x

ఎండిపోతున్న పంటలు.. కరువైన వర్షాలు

ఏపీలో కరువు మండలాల ప్రకటనపై కాలయాపన ఎందుకు?


ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో కరువు పరిస్థితులు అత్యంత భీతావహంగా మారాయి. రాష్ట్రంలోని మొత్తం 688 మండలాల్లో ఏకంగా 628 మండలాలు కరువు కోరల్లో చిక్కుకోగా, వర్షపాతం సాధారణం కంటే 54 శాతం తక్కువగా నమోదైంది. దాదాపు 313 మండలాలు తీవ్రమైన కరువు బారిన పడ్డాయి. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 1.5 లక్షల హెక్టార్లలో పంటలు పూర్తిగా ఎండిపోగా, నీటి లభ్యత లేక రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల్లో విత్తనాలు కూడా వేయలేని పరిస్థితి ఏర్పడింది. వేసిన అరకొర పంటలు సైతం కళ్లముందే ఎండిపోతుండటంతో రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు కరువు ప్రభావిత మండలాలను అధికారికంగా ప్రకటించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ కరువు నిర్వహణ మార్గదర్శకాల (Manual for Drought Management) ప్రకారం కరువును శాస్త్రీయంగా నిర్ధారిస్తారు. దీనికోసం కేవలం వర్షపాత లోటునే కాకుండా... వరుసగా నాలుగు వారాల పాటు వర్షాలు కురవకపోవడం (Dry Spells), శాటిలైట్ డేటా ఆధారంగా పంటల విస్తీర్ణం తగ్గడం, రిమోట్ సెన్సింగ్ ద్వారా నేలలో తేమ శాతం (Soil Moisture) పడిపోవడం, భూగర్భ జలాల మట్ట క్షీణత వంటి ఐదు రకాల సూచికలను పరిశీలిస్తారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలోని క్షేత్రస్థాయి బృందాలు పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపిన తర్వాత, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పరిశీలించి కరువు మండలాలను నోటిఫై చేస్తుంది. అయితే, ఈ సాంకేతిక ప్రక్రియల ఆలస్యం వల్ల క్షేత్రస్థాయిలో రైతులకు సకాలంలో సాయం అందడం లేదనే వాదనలు ఉన్నాయి.
కరువు ప్రకటనపై రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రభుత్వం, అధికారిక యంత్రాంగం స్పందిస్తూ... కరువును ప్రకటించడానికి నిర్దేశిత కేంద్ర ప్రభుత్వ నిబంధనలు (Central Norms) ఉన్నాయని, శాస్త్రీయ డేటా సేకరించి, పంట కోతలు పూర్తయిన తర్వాతే అధికారికంగా తుది జాబితా విడుదల చేస్తామని చెబుతోంది. దీనిపై విపక్షాలు , రైతు సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కరువు స్పష్టంగా కనిపిస్తున్నా సాంకేతిక సాకులు చెప్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, తక్షణమే కరువు విపత్తు ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వడంలో విఫలమైందని వారు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వం కరువు మండలాలను అధికారికంగా ప్రకటిస్తేనే రైతులకు , గ్రామీణ సమాజానికి చట్టబద్ధమైన ఉపశమనాలు లభిస్తాయి. కరువు ప్రకటించిన వెంటనే రైతులకు పెట్టుబడి రాయితీ, ఇన్ పుట్ సబ్సిడీ (Input Subsidy) అందుతుంది. పంట బీమా (Crop Insurance) క్లెయిమ్‌లు వేగంగా చెల్లించబడతాయి. సహకార, వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాల రద్దు లేదా కాలపరిమితి పొడిగింపు జరుగుతుంది. అంతేకాకుండా, గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద పనిదినాలను 100 రోజుల నుండి 150 రోజులకు పెంచుతారు. ఉచిత పశుగ్రాసం పంపిణీ, తాగునీటి సరఫరాకు ప్రత్యేక నిధుల కేటాయింపు వంటి చర్యల ద్వారా గ్రామీణ వలసలను నిరోధించే అవకాశం కలుగుతుంది.
Read More
Next Story