x

చంద్రబాబు ఎందుకు మారారు?

‘భారత్ మాతాకీ జై’ నినాదం వెనుక వ్యూహాలు ఏంటి


దేశ రాజకీయాల్లోనే అత్యంత సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, సెక్యులర్ విలువలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ శైలిలో 2024 ఎన్నికల విజయం తర్వాత ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో కమ్యూనిస్టులతో సుదీర్ఘకాలం ప్రయాణించినా, కాంగ్రెస్‌తో జతకట్టినా తన సొంత మార్క్ సిద్ధాంతాలను వీడని చంద్రబాబు... ఇప్పుడు ఎన్నడూ లేని విధంగా జాతీయవాద బీజేపీ లైన్ తీసుకున్నారు. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ శంకుస్థాపన సభలో ఆయన గొంతులోంచి భారత్ మాతాకీ జై అనే నినాదాలు మార్మోగడం, ప్రజలంతా దేశభక్తిని కలిగి ఉండాలని పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. 1998 నుండి 2004 వరకు వాజ్‌పేయి హయాంలో ఎన్డీఏలో కీలక పాత్ర పోషించినప్పుడు కూడా చంద్రబాబు ఎప్పుడూ దేశభక్తి గురించో, బీజేపీ మార్క్ నినాదాల గురించో పెద్దగా ప్రస్తావించలేదు. నాడు సుపరిపాలన (Good Governance), మరియు ఐటీ అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చిన ఆయన, నేడు బీజేపీ ప్రాథమిక సిద్ధాంత పునాదులైన దేశభక్తి, సాంస్కృతిక జాతీయవాదాన్ని ఓన్ చేసుకోవడం వెనుక బలమైన వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • ఈ మార్పు వెనుక ఉన్న ప్రధాన కారణాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న హిందూ ఓటు బ్యాంక్ సమీకరణాలు ఒకటని చెప్పవచ్చు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తిరుమల లడ్డూ వివాదం, అంతర్వేది రథం దగ్ధం వంటి ఘటనలపై కూటమి తీవ్రంగా పోరాడింది. ఏపీలో హిందూ సెంటిమెంట్ బలంగా ఏకీకరణ (Consolidation) అవుతోందని గ్రహించిన చంద్రబాబు, బీజేపీ కంటే ముందే తామే ఆ భావజాలాన్ని బలంగా వినిపించాలని నిర్ణయించుకున్నారు. దీనికి తోడు, కూటమిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల సనాతన ధర్మ రక్షణ అనే నినాదాన్ని తీవ్రంగా లీడ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ హిందూత్వ, జాతీయవాద లైన్‌కు వస్తున్న విపరీతమైన రెస్పాన్స్‌ను చూసి, ముఖ్యమంత్రిగా తాను వెనుకబడిపోకూడదనే ఉద్దేశంతోనే చంద్రబాబు కూడా తన స్వరంలో దేశభక్తిని, జాతీయవాదాన్ని మరింత తీవ్రం చేశారనే చర్చ కూడా వినిపిస్తోంది.
    మరోవైపు, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంతో కేవలం రాజకీయ పొత్తుగానే కాకుండా భావజాల పరంగా కూడా తాము అత్యంత సన్నిహితులం అనే గట్టి నమ్మకాన్ని కల్పించడం చంద్రబాబుకు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత అవసరమనే వాదన ఉంది. గతంలో (2018లో) బీజేపీతో విభేదించి తీవ్రంగా నష్టపోయిన అనుభవం చంద్రబాబుకు ఉంది. ఈసారి కేంద్రంలో బీజేపీ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో టీడీపీ మద్దతు కేంద్ర ప్రభుత్వ మనుగడకు అత్యంత కీలకంగా మారింది. భవిష్యత్తులో కేంద్రం నుండి వచ్చే రాజకీయ ఇబ్బందులను ముందే అడ్డుకునేందుకు ఈ భావజాల బంధం (Ideological Bond) ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని ఆయన భావిస్తున్నారనే వాదన కూడా వినిపిస్తోంది.
    దీనితో పాటు, మారుతున్న కొత్త తరం ఓటర్ల (Gen Z ) మైండ్‌సెట్‌ను పట్టుకోవడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందే ఉంటారు. నేటి యువతలో సామాజిక మాధ్యమాల ప్రభావం వల్ల దేశభక్తి, జాతీయవాద భావాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాతతరం సెక్యులరిజం రాజకీయాల కంటే, గర్వంగా భారత్ మాతాకీ జై అని చెప్పుకునే సరికొత్త ట్రెండ్‌ను యువత ఇష్టపడుతోంది. అందుకే మారుతున్న కాలానికి, ఓటర్ల నాడికి అనుగుణంగా చంద్రబాబు తనను తాను రీ-బ్రాండ్ చేసుకుంటున్నారు. ఆయన నోట వినిపిస్తున్న ‘భారత్ మాతాకీ జై’ నినాదం కేవలం ఒక అనుకరణ మాత్రమే కాదు... ఏపీలో మారిన రాజకీయ సమీకరణాలు, కేంద్రంలో అవసరాలు, భవిష్యత్తు ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు చంద్రబాబు వేస్తోన్న ఒక పక్కా వ్యూహాత్మక అడుగని చర్చ వినిపిస్తోంది.
  • Read More
    Next Story