x

ఆ ఓట్లు ఎవరివి?

44,71,523 ఓట్లను (మొత్తం ఓటర్లలో దాదాపు 10.75%) ఎన్నికల సంఘం 'అన్‌కలెక్టబుల్' (తొలగింపు) జాబితాలోకి చేర్చింది.


ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 44,71,523 ఓట్లను (మొత్తం ఓటర్లలో దాదాపు 10.75%) ఎన్నికల సంఘం అన్‌కలెక్టబుల్ (తొలగింపు) జాబితాలోకి చేర్చింది. బూత్ లెవెల్ అధికారులు (BLOs) దాదాపు 40 రోజుల పాటు నిర్వహించిన ముమ్మర డోర్-టు-డోర్ సర్వే ఆధారంగా ఈ ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. అత్యధికంగా నెల్లూరు, తిరుపతి, కడప, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో ఈ ఓట్లు నమోదయ్యాయి. ఉపాధి కోసం ఇతర నగరాలకు వెళ్లిన వలస కార్మికులు, చిరునామా మారిన వారు, సర్వే సమయంలో ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని వారు, మరణించిన వారు , దాదాపు 7.27 లక్షల నకిలీ (డూప్లికేట్) ఓటర్లను గుర్తించి ఈ జాబితాలో చేర్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ భారీ ఓట్ల ప్రక్షాళన వ్యవహారంపై రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్రమైన రాజకీయ దుమారం రేగుతోంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అధికార కూటమి ప్రభుత్వం బూత్ లెవెల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష మద్దతుదారుల, నిరుపేద వలస కూలీల ఓట్లను తొలగిస్తోందని ఆరోపించింది. దీనికి భిన్నంగా అధికార తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి నేతలు స్పందిస్తూ, గత ప్రభుత్వ హయాంలో చేర్చిన లక్షలాది దొంగ, నకిలీ ఓట్లను మాత్రమే ఎన్నికల సంఘం చట్టబద్ధంగా తొలగిస్తోందని, తప్పులు లేని పారదర్శకమైన జాబితా తయారీ కోసమే ఈ ప్రక్రియ జరుగుతోందని సమర్థించుకున్నారు.
మరోవైపు, ప్రముఖ రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ వంటి వ్యక్తలు కూడా ఈ ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తారు. రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో ఏకంగా 10 శాతానికి పైగా ఓట్లను ఒకేసారి 'అన్‌కలెక్టబుల్' అని ప్రకటించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన హెచ్చరించారు. కేవలం సర్వే జరిగిన సమయానికి నివాసాల్లో అందుబాటులో లేనంత మాత్రాన నిరుపేదలు, వలస కార్మికుల ఓట్లను తొలగించడం వారి ప్రాథమిక హక్కును హరించడమే అవుతుందని పేర్కొంటూ, ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
అయితే, పొరపాటున ఓటు కోల్పోయిన అర్హులైన ఓటర్లు తమ హక్కును తిరిగి పొందేందుకు చట్టపరంగా పూర్తి అవకాశం ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. జూలై 31న ముసాయిదా (డ్రాఫ్ట్) ఓటర్ల జాబితా విడుదలైన తర్వాత, అందులో పేరు లేని వారు వెంటనే అలర్ట్ అవ్వాలని సూచించింది. బాధిత ఓటర్లు జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు తమ అభ్యంతరాలను లేదా క్లెయిమ్‌లను సమర్పించవచ్చు. ఇందుకోసం ఫారమ్-6 (Form 6) ని భర్తీ చేసి, అవసరమైన గుర్తింపు పత్రాలతో ఆన్‌లైన్‌లో ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా గానీ, లేదా ఆఫ్‌లైన్‌లో తమ ప్రాంత బూత్ లెవెల్ అధికారి (BLO) లేదా తహశీల్దార్ కార్యాలయంలో గానీ అందజేయవచ్చు. ఈ క్లెయిమ్‌లను పరిశీలించిన అనంతరం అక్టోబర్ 3న విడుదల చేసే తుది జాబితాలో అర్హుల పేర్లను తిరిగి చేరుస్తారు.
Read More
Next Story