ఏపీలో కౌలు రైతుల గోస
ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి సర్కార్ వైఫల్యం
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలుస్తున్న కౌలు రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వివిధ సర్వేలు, రైతు సంఘాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 32 లక్షల నుండి 35 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వీరిలో దాదాపు 14 లక్షల మంది కంటే ఎక్కువ మంది సొంతంగా సెంటు భూమి కూడా లేని నిరుపేదలు కాగా, మిగిలిన వారు స్వల్ప భూమి ఉండి అదనంగా కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్న మొత్తం వ్యవసాయ భూమిలో సుమారు 60% నుండి 70% శాతం భూమిని ఈ కౌలు రైతులే సాగు చేస్తుండటం గమనార్హం. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి వంటి తీవ్ర నీటిపారుదల (డెల్టా) జిల్లాలలో ఈ సాగు శాతం ఏకంగా ఎనభై శాతం దాటింది.
రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తిలో సింహభాగం కౌలు రైతుల శ్రమ వల్లే వస్తున్నప్పటికీ, వారు క్షేత్రస్థాయిలో తీవ్రమైన వ్యవస్థాగత సమస్యలను ఎదుర్కొంటున్నారు. పంట సాగుదారుల హక్కుల చట్టం (CCRC Act) ప్రకారం కౌలు కార్డు పొందాలంటే భూ యజమాని సంతకం తప్పనిసరి కావడమే వీరికి శాపంగా మారింది. తమ భూమిపై హక్కులు కోల్పోతామేమోననే భయంతో 90 శాతానికి పైగా యజమానులు సంతకాలు పెట్టడానికి నిరాకరిస్తున్నారు. దీనివల్ల కౌలు రైతుల పేర్లు ఈ-పంట (e-Crop) పోర్టల్‌లో నమోదు కావడం లేదు. ఫలితంగా.. ప్రభుత్వ పెట్టుబడి సాయం, ఇన్-పుట్ సబ్సిడీ, ఉచిత పంట బీమా, ప్రకృతి వైపరీత్యాల పంట నష్టపరిహారం వంటి ప్రయోజనాలన్నీ నేరుగా భూ యజమానుల ఖాతాలకే వెళ్తున్నాయి తప్ప, వాస్తవంగా నష్టపోయిన కౌలు రైతుకు పైసా కూడా అందడం లేదు. అధికారిక పత్రాలు లేకపోవడంతో బ్యాంకులు కూడా పంట రుణాలు ఇవ్వకపోవడంతో, వీరు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద 24% నుండి 36% వరకు భారీ వడ్డీలకు అప్పులు తెచ్చి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే, 2024 ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు కౌలు రైతులను ఆదుకుంటామని మేనిఫెస్టోలో భారీ హామీలు ఇచ్చారు. భూ యజమానుల హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా, కౌలు రైతులకు పూర్తి చట్టబద్ధమైన రక్షణ కల్పించేలా ఒక నూతన ప్రత్యేక కౌలు రక్షణ చట్టాన్ని తీసుకువస్తామని చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యంగా కౌలు గుర్తింపు కార్డుల (CCRC) జారీలో భూ యజమానుల అంగీకారం లేదా సంతకం తప్పనిసరి అనే నిబంధనను తొలగించి, కేవలం గ్రామసభల ద్వారానే వాస్తవ సాగుదారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే కౌలు రైతులకు కూడా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామని, బ్యాంకుల ద్వారా నేరుగా పంట రుణాలు అందేలా చూస్తామని, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా రూ.7 లక్షల ఎక్స్-గ్రేషియా తక్షణమే అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ అవి సరిగా అమలు కావడం లేదని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 17 నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఈ హామీల అమలు నెమ్మదించడంపై కౌలు రైతు సంఘాల నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ డిమాండ్లను ఉధృతం చేశారు. ఎన్నికల హామీ ప్రకారం భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా, కేవలం వీఆర్వో (VRO) క్షేత్రస్థాయి పరిశీలన, గ్రామసభల ద్వారానే సాగుదారులను ధృవీకరించి తక్షణమే CCRC కార్డులు జారీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ-పంట యాప్‌లో కేవలం వాస్తవ సాగుదారుడి పేరు మాత్రమే నమోదు చేయాలని, అన్నదాత సుఖీభవ వంటి పెట్టుబడి సహాయ పథకాల పరిధిలోకి భూమి లేని నిరుపేద కౌలు రైతులను కూడా చేర్చి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరుతున్నారు. వీటికి తోడు, కౌలుదారులకు పూర్తి చట్టబద్ధమైన రక్షణ కల్పించే నూతన సాగు చట్టాన్ని తక్షణమే అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించాలని, అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ. 7 లక్షల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
Next Story

