x

విజయసాయిరెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

మత రాజకీయాలవైపు స్వరం మార్చిన విజయసాయిరెడ్డి


తిరుమల శ్రీవారి సాక్షిగా మాజీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు చేసిన సంచలన ప్రకటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున వ్యూహాత్మక చర్చలకు దారితీసింది. రాజ్యసభ సభ్యత్వానికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి, గత 19 నెలలుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా వ్యవహరిస్తున్న ఆయన హఠాత్తుగా రీఎంట్రీ ఇవ్వడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రజల పక్షాన నిలబడటానికి, వారి గొంతుకను అసెంబ్లీ , పార్లమెంట్లలో బలంగా వినిపించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నెల ఆఖరులో విజయవాడ వేదికగా నిర్వహించే పత్రికా సమావేశంలో పార్టీ పేరు, విధివిధానాలు, భవిష్యత్ కార్యాచరణను పూర్తిగా ప్రకటిస్తానని ఆయన స్పష్టం చేశారు.

ఈ తాజా ప్రకటనతో విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతారంటూ ఇటీవల కాలంలో వచ్చిన ఊహాగానాలకు పూర్తిగా తెరపడింది. అయితే, గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో తీవ్రంగా విభేదించి బయటకు వచ్చిన ఆయన, తిరిగి ఆ పార్టీ వైపు చూసే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది. గతంలో ఆయన తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడం వల్లే.. ఆ ఎంపీ సీటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి దక్కేలా మార్గం సుగమమైంది. సామాజిక మాధ్యమాల్లో ఆయన పెట్టబోయే పార్టీ పేరు భారత్ జన వికాస్ కావచ్చు అంటూ జోరుగా ప్రచారం సాగుతున్నప్పటికీ, దీనిపై అధికారిక స్పష్టత విజయవాడ సమావేశంలోనే రానుంది.
మరోవైపు, విజయసాయి రెడ్డి తీసుకోబోయే ఈ నిర్ణయం వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉండి నడిపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ గట్టిగా అనుమానిస్తోంది. తమ పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ను, ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లోని క్యాడర్‌ను దెబ్బతీసే వ్యూహాత్మక ఎత్తుగడలో భాగమే ఈ కొత్త పార్టీ స్థాపన అని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు, ఇటీవల కాలంలో విజయసాయి రెడ్డిపై నమోదైన ఏపీ మద్యం కుంభకోణం, కాకినాడ పోర్టు స్కామ్ వంటి కేసుల దర్యాప్తు తీవ్రతరమైన నేపథ్యంలో.. ఈడీ విచారణల ఉచ్చు నుండి రాజకీయంగా రక్షణ కవచం పొందేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారనే విశ్లేషణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, విజయసాయి రెడ్డి స్థాపించబోయే కొత్త పార్టీ ఏపీ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. దశాబ్ద కాలం పాటు వైఎస్సార్‌సీపీలో ప్రధాన వ్యూహకర్తగా, చాణక్యుడిగా పనిచేసిన ఆయనకు క్షేత్రస్థాయిలో ఉన్న పరిచయాలు, సామాజిక సమీకరణాలను తక్కువ అంచనా వేయలేలేమని నిపుణులు భావిస్తున్నారు. భవిష్యత్తులో ఈ పార్టీ ఒంటరిగా పోరాడుతుందా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలుస్తుందా, లేక అధికార టీడీపీ నేతృత్వంలోని కూటమితో పొత్తుల దిశగా బేరసారాల శక్తిని పెంచుకుంటుందా అనే ప్రశ్నలపై పూర్తి స్పష్టత రావాలంటే ఈ నెల ఆఖరున జరిగే విజయవాడ సమావేశం వరకు వేచి చూడాల్సిందే.
Read More
Next Story