x

కలెక్టర్లలో ర్యాంక్ కలకలం

పాలనపై పర్యవేక్షణ కోసం చంద్రబాబు తెరపైకి కొత్త పద్ధతి


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లా కలెక్టర్ల పనితీరు ఆధారిత ర్యాంకింగ్‌ల విధానంపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వ సేవల్లో జాప్యాన్ని తగ్గించి, జవాబుదారీతనం పెంచేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికార యంత్రాంగం భావిస్తుండగా, క్షేత్రస్థాయిలో దీనివల్ల కొత్త సవాళ్లు ఎదురవుతాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కార వేగం (PGRS) వివిధ ప్రభుత్వ ప్రాధాన్యతలే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రక్రియపై అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు పరిపాలనా నిపుణులలోనూ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పరిపాలనలో కార్పొరేట్ తరహా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ప్రవేశపెట్టడంపై రాష్ట్రానికి చెందిన పలువురు ప్రముఖ మాజీ ఐఏఎస్ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకింగ్ లు ఒక రకంగా మంచిదే అయినప్పటికీ మరో వైపు ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం అందించే సివిల్ సర్వీసెస్ వ్యవస్థను కేవలం లాభనష్టాలు చూసే వ్యాపార సంస్థగా మార్చడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. గణాంకాలు లేదా ఆన్‌లైన్ రేటింగ్‌ల ఆధారంగా మాత్రమే ఒక అధికారి పనితీరును అంచనా వేయడం వల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు జరిగే అసలైన న్యాయాన్ని విస్మరించినట్లవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఈ ర్యాంకింగ్ విధానం వల్ల అధికారులపై మితిమీరిన ఒత్తిడి పెరిగి, నివేదికల్లో డేటా తారుమారు జరిగే ప్రమాదం ఉందని సీనియర్ బ్యూరోక్రాట్లు స్పష్టం చేస్తున్నారు. ర్యాంకుల్లో వెనుకబడితే చర్యలు ఉంటాయనే భయంతో, కింది స్థాయి సిబ్బంది సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించకుండానే కేవలం ఆన్‌లైన్ పోర్టల్‌లలో క్లోజ్ చేసి చేతులు దులుపుకునే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. దీనివల్ల కాగితాల మీద ప్రగతి కనిపిస్తున్నా, ప్రజల నిజమైన ఇబ్బందులు అలాగే ఉండిపోతాయని విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, రాష్ట్రంలోని జిల్లాల మధ్య ఉన్న భౌగోళిక, ఆర్థిక అసమానతలను పరిగణనలోకి తీసుకోకుండా అందరికీ ఒకే రకమైన పారామీటర్లతో మార్కులు ఇవ్వడాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన కోస్తా జిల్లాలకు ఉండే వనరులు, అవకాశాలు.. వెనుకబడిన రాయలసీమ లేదా గిరిజన ప్రాంత జిల్లాలకు ఉండవని, అందువల్ల ఈ ర్యాంకింగ్ విధానాన్ని మరింత హేతుబద్ధంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. డిజిటల్ గ్రాఫ్‌ల కంటే క్షేత్రస్థాయి పర్యటనలు, పౌరుల నిజమైన సంతృప్తికే ప్రభుత్వం పెద్దపీట వేయాలని వారు సూచిస్తున్నారు. మరో వైపు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాల్సిందేనని, అది లేక పోతే పాలన సరిగా సాగదని, జవాబుదారీ తనం తగ్గుతుందనే చర్చ కూడా అధికార వర్గాల్లో ఉంది.
Read More
Next Story