x

ఆంధ్రలో ఆంక్షల రాజకీయాలు

కట్టుబాట్లు కాపులు, బీసీలకేనా? అగ్రవర్ణ నేతలకు వర్తించవా?


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం సామాజిక సమీకరణాలు, అంతర్గత కట్టుబాట్ల చుట్టూ తీవ్ర చర్చ నడుస్తోంది. పార్టీల సరిహద్దులు దాటి సామాజిక సభల్లో విపక్ష నేతలతో వేదికలు పంచుకుంటున్న బీసీ, కాపు సామాజికవర్గాల సీనియర్ నేతలపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం విధిస్తున్న ఆంక్షలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఒకరినొకరు కలుసుకోవడం, సామాజిక గౌరవాన్ని ప్రకటించడంపై పార్టీ లైన్ దాటకూడదని, వేదికలు పంచుకోకూడదనే నారా చంద్రబాబు జారీ చేసి ఆదేశాలు, నిబంధనలు క్షేత్రస్థాయిలో కొత్త వివాదాలకు దారితీస్తున్నాయి.

గత ఏడాది డిసెంబర్ 16న నూజివీడులో జరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సభ ఇందుకు ప్రధాన ఉదాహరణగా నిలిచింది. గౌడ, బీసీ సామాజికవర్గాలకు చెందిన ప్రముఖులు హాజరైన ఈ వేదికపై యాదవ సామాజికవర్గ మంత్రి కొలుసు పార్థసారథి, లచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే గౌతు శిరీషలతో పాటు వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ కూడా కూర్చున్నారు. ఒక బీసీ దిగ్గజ నేత సభలో విపక్ష నేతతో వేదిక పంచుకున్నారనే కారణంతో చంద్రబాబు, లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం, దానికి సదరు మంత్రి, ఎమ్మెల్యే బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి రావడం అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది.
తాజాగా ఇదే తరహా రాజకీయం రాష్ట్రంలో 20 శాతానికి పైగా ఉన్న కాపు సామాజికవర్గంలోనూ రిపీట్ అయ్యింది. ఇటీవలే మరణించిన కాపు నేత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు పార్టీలకతీతంగా కాపు నేతలంతా తరలివచ్చారు. అక్కడ వైసీపీ నేతలు కూడా ఉండటంతో, ఆ సభకు హాజరైన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బోండా ఉమా, వంగవీటి రాధాలపై అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వైసీపీ నేతలతో వేదికలు పంచుకోవదని చంద్రబాబు హుకుం జారీ చేశారు. మరణాలు, సంస్మరణ సభల్లో కూడా రాజకీయాలు చూడాలా? అంటూ ప్రస్తుతం కాపు సామాజికవర్గాల నేతల్లో చంద్రబాబు నాయుడి తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో, గతంలో ఎన్టీఆర్ మనవడు నందమూరి తారకరత్న భౌతికకాయానికి నివాళులర్పించేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు, అక్కడ నాటి వైసీపీ అగ్రనేత విజయసాయిరెడ్డితో పక్కపక్కనే కూర్చుని చాలాసేపు ముచ్చటించిన పాత దృశ్యాలను సోషల్ మీడియాలో నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. అధినేతలు విపక్ష నేతలను కలిస్తే అది రాజకీయ సంస్కారం అవుతుంది.. కానీ, పార్టీకి వెన్నుముకగా ఉండే బీసీ, కాపు నేతలు తమ సామాజికవర్గ పెద్దల సభలకు వెళ్లి వేదికలు పంచుకుంటే అది క్రమశిక్షణా రాహిత్యం ఎలా అవుతుంది? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. ఈ 'బుల్ స్టాండర్డ్స్ ఆంక్షల రాజకీయం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తుందో చూడాలి.
Read More
Next Story