పతాక స్థాయికి బహిష్కరణ రాజకీయాలు
సెల్ప్ గోల్ ఎవరిది? చంద్రబాబుదా? జగన్ దా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో, సాంకేతిక కారణాల వల్ల ఆయనకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వనప్పుడు సభకు వెళ్లి ప్రయోజనం లేదంటూ జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ వస్తున్నారు. అయితే, చట్టసభకు దూరం కావడం ద్వారా జగన్ సాధించింది ఏమిటి? ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత గల విపక్షం సభలో లేకపోతే.. అసలు నష్టపోయేది ఎవరు? జగనా?, వైఎస్సార్సీపీయా?, లేక ఆ పార్టీని నమ్మి ఓటు వేసిన ప్రజలా? అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల జరిగిన వర్షకాల అసెంబ్లీ సమావేశాలను గమనిస్తే, టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలకమైన బిల్లులను, బడ్జెట్‌ను ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఏకపక్షంగా ఆమోదింపజేసుకుంటోంది. ఈ సమయంలో సభలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే, ప్రజల పక్షాన పోరాడే ఒక గొప్ప రాజకీయ అవకాశాన్ని వైఎస్సార్సీపీ చేజేతులా కోల్పోయిందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు, ఒక ప్రజాప్రతినిధిగా తనకు రావలసిన జీతభత్యాలు, అలవెన్సులను తన హక్కుగా భావిస్తున్నప్పుడు.. అదే ప్రజల సమస్యలను సభలో లేవనెత్తడం కూడా ఒక కనీస బాధ్యత కాదా అని స్వయంగా స్పీకరే అసెంబ్లీ వేదికగా ప్రశ్నలు సంధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది.
అన్నింటికంటే ముఖ్యంగా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ 11 నియోజకవర్గాల ప్రజల గొంతుకను అసెంబ్లీలో ఎవరు వినిపించాలనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నియోజకవర్గాల అభివృద్ధికి నిధులు సాధించాలన్నా, స్థానిక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలన్నా ఎమ్మెల్యేలకు అసెంబ్లీయే ప్రధాన వేదిక. ఇదే పరిస్థితి ఐదేళ్లపాటు కొనసాగితే, ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడి, ప్రభుత్వ పథకాల కేటాయింపుల్లో ఆ నియోజకవర్గాలు వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా వచ్చే ఎన్నికల నాటికి అక్కడి ఓటర్లలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
రాజకీయ నాయకులు, స్థానిక ప్రజల అభిప్రాయాల ప్రకారం.. జగన్ తీసుకున్న ఈ బహిష్కరణ నిర్ణయం వైఎస్సార్సీపీకి ఒక సెల్ఫ్ గోల్ లాంటిదని మెజారిటీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రతిపక్ష హోదా లేకపోయినా, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలతో సభలోకి వెళ్లి గళం విప్పి ఉంటే జగన్‌కు ప్రజల్లో మైలేజ్ పెరిగేదని, కానీ పూర్తిగా దూరం కావడం వల్ల పార్టీ క్యాడర్ నైరాశ్యంలో మునిగిపోతోందని విశ్లేషణలు చెప్తున్నాయి. రాజకీయ పార్టీల వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నప్పటికీ, తుది విశ్లేషణలో మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలో చిట్టచివరికి నష్టపోయేది ఓటర్లేనని స్పష్టమవుతోంది.
Next Story

