x

దేశాన్ని కదిలిస్తున్న జెన్ జీ విప్లవం

నిరుద్యోగ సెగలతో ఏపీ నేతల్లో మొదలైన వణుకు


భారత ప్రధాన న్యాయమూర్తి (CJ of India) చేసిన సంచలన వ్యాఖ్యలు దేశంలో ఒక సరికొత్త పోరాటానికి ఊపిరి పోశాయి. యువతపై సిజేఐ చేసిన విమర్శల నేపథ్యంలో ఆవిర్భవించిన సీజేపీ (CJP) ఉద్యమం, ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జెన్ జీ (Gen Z) యువత నేతృత్వంలో ఒక మహా ప్రవాహంలా మారి దేశం నలుమూలలకు విస్తరిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం తెరపైకి రావడం, ఆపై మనస్తాపంతో 14 మంది అమాయక యువత ఆత్మహత్యలకు పాల్పడటం ఈ ఉద్యమ రగిలే అగ్నికి మరింత ఆజ్యం పోసింది.

ఈ పెను తుఫాను కేవలం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసమే వచ్చింది కాదు. గత 12 ఏళ్లుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న యువజన, విద్యా వ్యతిరేక విధానాలపై దేశ యువత సాధిస్తున్న తిరుగుబాటు ఇది. గడిచిన దశాబ్ద కాలంలో పాలకుల తప్పుడు నిర్ణయాల వల్ల కనీసం ప్రశ్నించే హక్కు, మాట్లాడే స్వేచ్ఛను కూడా కోల్పోయిన భారత యువత నేడు తీవ్రమైన మానసిక ఒత్తిడిలోకి నెట్టివేయబడింది. ఈ క్రమంలోనే జంతర్ మంతర్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు అత్యంత దారుణంగా, అమానవీయంగా వ్యవహరించడం పతాక స్థాయికి చేరింది. అయితే, దేశ భవిష్యత్తును శాసిస్తున్న ఈ కీలక అంశాలపై మాట్లాడటానికి దేశ అత్యున్నత న్యాయమూర్తికి కనీసం సమయం లేదని చెప్పడం యువతను మరింత ఆవేదనకు గురిచేస్తోంది.
దేశాన్ని కుదిపేస్తున్న ఈ జెన్ జీ ఉద్యమంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ శూన్యత స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర పాలకులైన చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లతో పాటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ పరిణామాలపై పూర్తి మౌనం వహించడం గమనార్హం. గతంలో తాను వ్యవస్థను ఎదిరించే ‘బొద్దింకను అవుతానంటూ ఆవేశంగా మాట్లాడిన జగన్, నేడు యువత రోడ్లపైకి వస్తున్నా నోరు విప్పకపోవడం వారి చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలకు ముందు యువతకు తాయిలాలు చూపిస్తూ నిరుద్యోగ భృతి ఇస్తామని భారీ హామీలు ఇచ్చినప్పటికీ, అధికారం చేజిక్కించుకున్నాక కనీసం ఆ ప్రస్తావన కూడా తీసుకురాకుండా యువతకు ఘోర మొండిచేయి చూపించారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ శాతం ఊహించని స్థాయికి చేరుకుంది, ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తు శూన్యంగా మారుతోంది. ఢిల్లీ వేదికగా మొదలైన ఈ జెన్ జీ విప్లవ జ్వాలలు ఏపీ తీరాన్ని తాకడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. రాష్ట్రంలోని నిరుద్యోగ సెగలు, పాలకుల ఉదాసీనత ఇలాగే కొనసాగితే, రానున్న రోజుల్లో ఢిల్లీ తరహాలోనే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఊహించని స్థాయిలో యువత తిరుగుబాటు (Gen Z Movement) రావడం ఖాయంగా కనిపిస్తోంది. పాలకుల మేల్కొలుపుకు ఇదే ఆఖరి హెచ్చరిక కానుంది.
Read More
Next Story