ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి చుట్టూ సాగుతున్న రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతూ, సామాన్య ప్రజలను,రాజధానిని నమ్ముకుని భూములిచ్చిన రైతులను తీవ్ర అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. జూలై 28న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజధాని కాంట్రాక్టర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. రాజధాని అంటే కేవలం 29 గ్రామాలే కాకుండా, అమరావతిని విజయవాడ, గుంటూరు నగరాలతో కలుపుకుని ఒక 'సమగ్ర పట్టణ ప్రాంతం'గా (Integrated Capital Region) చూడాలని సీఎం సూచించారు. గతంలో రెండో దశ భూసేకరణను రైతులు నిరాకరించినప్పుడు, భూములివ్వకపోతే అమరావతి కేవలం ఒక మున్సిపాలిటీగానే మిగిలిపోతుందని వ్యాఖ్యానించి విమర్శలు ఎదుర్కొన్న చంద్రబాబు.. ఇప్పుడు హఠాత్తుగా విజయవాడ, గుంటూరుల ప్రస్తావన తీసుకురావడం వెనుక పెద్ద రాజకీయ మాయాజాలమే ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తాజా మార్పు వెనుక బహుముఖ వ్యూహాలు దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ సంస్థల నుండి రాజధానికి భారీగా రుణాలు సాధించాలన్నా, క్షేత్రస్థాయిలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్లలో నమ్మకం కలిగించాలన్నా.. కేవలం 29 గ్రామాల పరిధిని చూపిస్తే సరిపోదని, ఇప్పటికే డెవలప్ అయిన విజయవాడ-గుంటూరుల ఆర్థిక బలాన్ని చూపించక తప్పదనే ఆర్థిక వాస్తవాన్ని కూటమి ప్రభుత్వం గుర్తించినట్లు కనిపిస్తోంది. మరోవైపు, రాజధాని పేరుతో తమ పార్టీకి చెందిన వారికి రియల్ ఎస్టేట్ లాభాలు చేకూర్చేందుకే అమరావతి చుట్టుపక్కల భూముల విలువను పెంచే వ్యూహాన్ని తెరపైకి తెచ్చారనే ఆరోపణలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అమరావతి భవిష్యత్తు కోసం త్యాగాలు చేసిన రైతుల ప్రాథమిక సమస్యలను ఇంకా పూర్తిగా పరిష్కరించకుండా, తరచూ ఇలా వ్యూహాత్మకంగా మాట మార్చడం ప్రజల్లో అసహనాన్ని పెంచుతోంది.
ఈ మొత్తం వ్యవహారంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన మావిగాన్ (మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు) కాన్సెప్ట్ ప్రభావం చంద్రబాబుపై స్పష్టంగా పడిందనే చర్చ నడుస్తోంది. అత్యంత తక్కువ ఖర్చుతో, ఇప్పటికే మౌలిక వసతులు ఉన్న నగరాలను కలుపుతూ పారిశ్రామికంగా 'మావిగాన్'ను డెవలప్ చేయవచ్చని జగన్ చెప్పడం.. ప్రజల్లో పెద్ద ఎత్తున సానుకూలత తెచ్చిపెట్టింది. రాబోయే 2029 ఎన్నికల్లో తాము ఈ 'మావిగాన్' అజెండాతోనే జనాల్లోకి వెళ్తామని, నచ్చిన వాళ్లు తమకు ఓట్లేయవచ్చని జగన్ సవాల్ విసరడం, రాజధాని పేరిట జరుగుతున్న అక్రమాలను నిరంతరం ఎండగట్టడం అధికార పక్షాన్ని ఆత్మరక్షణలో పడేసింది. జగన్ మోడల్‌కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను దెబ్బతీసేందుకు, దాని ప్రభావాన్ని తగ్గించేందుకే చంద్రబాబు ఇప్పుడు అమరావతిని ట్రై-సిటీ మెగా క్లస్టర్‌గా చూపిస్తూ జగన్ రూట్‌లోనే అడుగులు వేస్తున్నారనే విమర్శలు ఊపందుకున్నాయి.
అధికారం కోసం రాజకీయ నాయకులు ఆడుతున్న ఈ చదరంగంలో సాక్షాత్తు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు, సర్వస్వం కోల్పోయిన రాజధాని రైతులు బలిపశువులుగా మారుతున్నారు. జగన్ హయాంలో మూడు రాజధానుల పేరుతో కాలయాపన జరిగితే.. ఇప్పుడు చంద్రబాబు హయాంలో సమగ్ర ప్రాంతం పేరుతో సరికొత్త ప్రయోగాలు మొదలయ్యాయి. ఒకవైపు అభివృద్ధి వికేంద్రీకరణ అంటూ జగన్, మరోవైపు సమగ్ర మెట్రో రీజియన్ అంటూ చంద్రబాబు చేస్తున్న ఈ 'రాజకీయ మాయాజాలం' ఏపీ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేసింది. నాయకులు తమ స్వార్థ రాజకీయాల కోసం, ఎన్నికల అజెండాల కోసం రాజధానిని అడ్డం పెట్టుకుని ఆడుతున్న ఈ మాటల ఆటలు ఎప్పటికి తీరుతాయో, అసలు రాజధానికి ఒక స్పష్టమైన స్వరూపం ఎప్పుడు వస్తుందో అర్థం కాక ప్రజలు, రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.