x

బెజవాడ మున్సిపల్ సమరం

ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోటలో నేడు ఉనికి కోసం పోరాటం


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గుండెకాయ లాంటి విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ (VMC) లో అక్టోబర్ 28న జరగబోయే 7వ సాధారణ ఎన్నికల మునిసిపల్ నగారా మోగడంతో నగర రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. ఒకప్పుడు బ్లడ్ రెడ్ సిటీగా పిలవబడుతూ, కమ్యూనిజానికి తిరుగులేని కంచుకోటగా విరాజిల్లిన విజయవాడలో నేడు లెఫ్ట్ పార్టీలు తమ రాజకీయ ఉనికిని నిలబెట్టుకోవడానికి పోరాడాల్సిన పరిస్థితులు రావడం గమనార్హం. 1981లో విజయవాడ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా మారిన తొలి నాళ్లలో ఇక్కడ కమ్యూనిస్టుల ప్రభంజనం నడిచింది. ఆ ఏడాది జరిగిన మొట్టమొడటి వీఎంసీ ఎన్నికల్లోనే లెఫ్ట్ కూటమి క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా, నగర తొలి మేయర్‌గా సీపీఐకి చెందిన ప్రముఖ నేత టి. వెంకటేశ్వరరావు (టి.వి) పీఠాన్ని అధిరోహించారు. కార్పొరేషన్ చరిత్రలో సీపీఐ, సీపీఎం నేతలు నాలుగు సార్లు మేయర్ గా పని చేశారు. అలా మేయర్లైన కమ్యూనిస్టు నేతలు నగర పరిపాలనలో తమదైన చెరగని ముద్ర వేసింది.

ఆ కాలంలో కమ్యూనిస్టు మేయర్ల హయాంలో జరిగిన ప్రజాపక్షపాత పాలన, అవినీతి రహిత సంస్కరణలు నగర చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచిపోయాయి. ముఖ్యంగా విజయవాడ వన్ టౌన్, కొండ ప్రాంతాలు, కృష్ణాలంక వంటి మురికివాడల్లోని పేద ప్రజలకు రోడ్లు, డ్రైనేజీ, ఉచిత తాగునీటి వంటి కనీస మౌలిక వసతులు కల్పించింది కమ్యూనిస్టులే. సామాన్య పౌరులపై రూపాయి కూడా అదనపు పన్నుల భారం వేయకుండా, సైకిళ్లపై తిరుగుతూ ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే కమ్యూనిస్టు మేయర్ల నిరాడంబరతను చూసి నగర ప్రజలు సిద్ధాంతాలకు అతీతంగా వారిని అమితంగా ఆదరించారు. ఆటోనగర్ పారిశ్రామిక కార్మికులు, రిక్షా కార్మికులు, హమాలీల హక్కుల కోసం లెఫ్ట్ పార్టీలు చేసిన నిరంతర పోరాటాలు వీఎంసీలో వారిని సుదీర్ఘ కాలం పాటు తిరుగులేని శక్తిగా నిలబెట్టాయి.
అయితే, కాలక్రమేణా విజయవాడలో కమ్యూనిస్టుల ప్రభంజనం క్రమంగా పతనమవుతూ వచ్చింది. దీనికి ప్రధానంగా సీపీఐ, సీపీఎంగా పార్టీలు అంతర్గతంగా చీలిపోవడం వల్ల ఓటు బ్యాంకు విడిపోవడం, సొంత బలాన్ని నిర్మించుకోకుండా కాంగ్రెస్, టీడీపీ వంటి పార్టీలతో నిరంతరం మార్చి మార్చి పొత్తులు పెట్టుకోవడం వల్ల వారి స్వతంత్ర అస్తిత్వం దెబ్బతింది. మరోవైపు, 1983లో టీడీపీ ఆవిర్భావం, ఆ తర్వాతి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల రాకతో కమ్యూనిస్టుల సంప్రదాయ ఓటర్లు ఆయా ప్రాంతీయ పార్టీల వైపు డైవర్ట్ అయ్యారు. వీటికి తోడు ఒకప్పుడు కార్మిక నగరంగా ఉన్న విజయవాడ.. కాలక్రమేణా పెద్ద వ్యాపార, ఐటీ, రియల్ ఎస్టేట్ , ఎగువ మధ్యతరగతి హబ్‌గా రూపాంతరం చెందడం వల్ల పాతకాలపు కార్మిక ఆధారిత సిద్ధాంతాలు సరికొత్త యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రధాన పార్టీల భారీ ఆర్థిక, అంగబలాల ముందు నిలవలేక ఒకప్పుడు నగరాన్ని శాసించిన కమ్యూనిస్టులు నేడు కార్పొరేషన్‌లో కేవలం ఒకటి రెండు స్థానాలకే పరిమితం కావలసి వచ్చింది.
త్వరలో జరగనున్న విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు రంగంలోకి దిగనున్నాయి. అన్ని డివిజన్లలో అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో గత పూర్వ వైభవాన్ని కమ్యూనిస్టులు సాధించగలరా? ప్రలు ఏమేరకు మద్ధతు తెలుపనున్నారు? ఎన్ని స్థానాల్లో గెలచే అవకాశం ఉంది? మేయర్ స్థానాన్ని దక్కించుకోగలరా? అన్నవి కీలక ప్రశ్నలుగా మారాయి.
Read More
Next Story