ఉద్యోగాలు అడిగితే కేసులు పెడతారా?
నిరుద్యోగులు, యువత ఉద్యోగాల కోసం గొంతెత్తకుండా అణచివేస్తోందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
ఉద్యోగ అభ్యర్థుల భవిష్యత్తు కోసం పనిచేయాల్సిన కొన్ని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, రాజకీయ ప్రయోజనాల కోసం అభ్యర్థులను రెచ్చగొడుతూ ఆందోళనలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నాయనే ఇంటెలిజెన్స్ (నిఘా వర్గాల) నివేదికలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. నిరుద్యోగ యువతలోని అసంతృప్తిని ఆసరాగా చేసుకుని విద్యాసంస్థలు రాజకీయ వేదికలుగా మారడాన్ని సహించేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. జీవో నెం. 9 (ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల నియంత్రణ నిబంధనలు-2026) ప్రకారం విద్యాబోధనకే పరిమితం కావాల్సిన సంస్థలు, నిరుద్యోగులను ఆందోళనల వైపు మళ్లించడంపై ప్రభుత్వం అకస్మాత్తుగా ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ పరిణామాలపై కోచింగ్ సెంటర్ల యజమానులు, విద్యార్థి సంఘాల నాయకులు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ చర్యలు విద్యార్థుల హక్కులను అణచివేసేలా ఉన్నాయని వామపక్ష, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూసి, పోస్టుల సంఖ్య పెంచాలని అభ్యర్థులు తమ సొంత అభీష్టంతో శాంతియుతంగా నిరసనలు తెలుపుతుంటే, దానికి కోచింగ్ సెంటర్ల ముద్ర వేయడం సరికాదని వారు వాదిస్తున్నారు. మరోవైపు, తాము కేవలం పరీక్షల ప్రిపరేషన్‌పైనే శ్రద్ధ పెడుతున్నామని, విద్యార్థులను తామెక్కడా ఉసిగొల్పలేదని కోచింగ్ సంస్థల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదే తరుణంలో కాకినాడలోని ప్రముఖ శ్యామ్ ఇన్స్టిట్యూట్పై పోలీసులు జరిపిన తనిఖీలు (దాడులు) రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. పోలీస్ ఉద్యోగాల సంఖ్య పెంచాలంటూ కాకినాడ కలెక్టరేట్ వద్ద విద్యార్థులు చేపట్టిన భారీ ర్యాలీని ఈ సంస్థే వెనుక ఉండి నడిపించిందనే ఆరోపణలతో వన్‌టౌన్ పోలీసులు ఇన్స్టిట్యూట్, హాస్టల్ ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ముందస్తు సమాచారం లేకుండా జరిగిన ఈ తనిఖీల అనంతరం, అనుమతి లేకుండా నిరసనలు చేపట్టారనే కారణంతో ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జి. శ్యామ్‌తో పాటు ఆ సంస్థకు చెందిన 20 మంది విద్యార్థులపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్పై జరిగిన పోలీసుల దాడిని, విద్యార్థులపై కేసులు పెట్టడాన్ని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తో పాటు వామపక్షాలు తీవ్రంగా ఖండించాయి. హక్కుల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతను, వారికి ఆశ్రయం కల్పిస్తున్న విద్యాసంస్థలను భయభ్రాంతులకు గురిచేయడానికే ప్రభుత్వం పోలీసులను ప్రయోగిస్తోందని వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరోపించారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
Next Story

