x

కూటమి సరికొత్త పొలిటికల్ గేమ్ ప్లాన్

స్థానిక పోరులో ఫ్రెండ్లీ కాంటెస్ట్ వ్యూం. కూటమికి మేలు చేస్తుందా?వైసీపీ కలిసొస్తుందా?


ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఒక సరికొత్త రాజకీయ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది, అదే ఫ్రెండ్లీ కాంటెస్ట్. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ మూడు పార్టీలు, స్థానిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి సీట్ల సర్దుబాటు కుదరని కొన్ని నిర్దిష్ట స్థానాల్లో ఎవరికి వారు విడివిడిగా తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. అయితే, ఈ పోటీ శత్రుత్వంతో కాకుండా, పరస్పర వ్యక్తిగత దూషణలు లేని ఒక మిత్రపూర్వక వాతావరణం లో సాగుతుంది. ఫలితాలు వచ్చిన తర్వాత గెలిచిన అభ్యర్థులు మళ్లీ ఉమ్మడి కూటమి ధర్మానికే కట్టుబడి ఉండేలా అగ్రనాయకత్వం ఈ రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది.

ఈ వినూత్న వ్యూహం వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల వ్యూహాత్మక ఆలోచన దాగి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల కారణంగా గ్రామ స్థాయిలో సీట్లు దక్కక నిరాశకు గురైన ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ప్రతిపక్ష వైసీపీ వైపు వలస వెళ్లకుండా నిరోధించడానికి ఇదొక పొలిటికల్ సేఫ్టీ వాల్ లా పనిచేస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ ఉనికి నామమాత్రంగా ఉన్న గ్రామాల్లో కూటమి భాగస్వామ్య పక్షాలు స్నేహపూర్వకంగా తలపడటం వల్ల ప్రజలు ఎవరిని ఎన్నుకున్నా అంతిమంగా విజయం కూటమి ఖాతాలోనే పడుతుంది. తద్వారా రెండు పార్టీల క్యాడర్‌ను యాక్టివ్‌గా ఉంచి, భవిష్యత్ ఎన్నికల కోసం క్షేత్రస్థాయి సొంత బలాన్ని కాపాడుకోవచ్చని కూటమి భావిస్తోంది.
ఈ వ్యూహం క్యాడర్‌లో ఉత్సాహం నింపినప్పటికీ, ఇందులో కూటమికి ఊహించని నష్టాలు , సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ఒకే స్థానంలో కూటమికి చెందిన ఇద్దరు బలమైన అభ్యర్థులు హోరాహోరీగా తలపడినప్పుడు క్షేత్రస్థాయిలో వారి సాంప్రదాయ ఓట్లు చీలిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పైస్థాయిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎంత సఖ్యతగా ఉన్నా, కిందస్థాయిలో స్థానిక నాయకుల మధ్య వచ్చే ఈ పోటీ కాస్తా శాశ్వత శత్రుత్వాలు, సమన్వయ లోపానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ అంతర్గత విభేదాలు కూటమి ఐక్యతకు లాంగ్ రన్‌లో నష్టం కలిగించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇదే తరుణంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) కూటమి వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు తన కౌంటర్ ప్లాన్స్ సిద్ధం చేస్తోంది. కూటమి అభ్యర్థుల మధ్య వచ్చే ఓట్ల చీలికను ఆసరాగా చేసుకుని, గట్టి పోటీ ఉన్న చోట తక్కువ ఓట్ల మెజారిటీతోనైనా తాము లాభపడాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అయితే, ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన చంద్రబాబు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ బలంగా ఉన్న స్థానాల్లో ఫ్రెండ్లీ ఫైట్‌ను పూర్తిగా నిరాకరిస్తూ, అక్కడ కచ్చితంగా కేవలం ఒక్క ఉమ్మడి అభ్యర్థినే నిలబెట్టి వైసీపీకి చెక్ పెట్టాలని కూటమి వర్గాల్లో గట్టి నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూటమి వర్గాల్లో వినిపిస్తోంది.
Read More
Next Story