x

మహిళలపై వరుస దాడులు..

ఏపీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తోంది?


సమాజంలో చట్టాలు సక్రమంగా అమలు కావడం, నేరగాళ్లలో శిక్షల పట్ల భయం ఉండటం, ఏ ఒక్క పౌరుడు కూడా భయపడకుండా జీవించగలగడమే నిజమైన శాంతిభద్రతలకు నిదర్శనం. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులు ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తారు కాబట్టి, ప్రతిఫలంగా వారి ఆస్తులకు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పించిన జీవించే హక్కుకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించడమే ఏ ప్రభుత్వానికైనా ప్రథమ , పరమ పవిత్రమైన విధి. ఈ ప్రాథమిక విధిలో విఫలమైతే సమాజంలో అరాచకత్వం పెరిగిపోయే ప్రమాదం ఉంది.

ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో మహిళలపై జరిగిన వరుస దాడులు , అమానుష ఉదంతాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించాయి. గుంటూరులో ఒక స్థానిక వివాదంలో మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘోరమైన ఘటనతో పాటు కావలి, కడప, నెల్లూరు జిల్లాల్లో మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడం, వారిపై దౌర్జన్యానికి దిగి బట్టలు, జాకెట్లు చింపివేయడం వంటి దుశ్చర్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనల్లో అధికార కూటమికి చెందిన కొందరు స్థానిక నాయకులు, కార్యకర్తల పేర్లు ముడిపడి ఉండటంతో, ఇవి కేవలం నేరాలుగా మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద రాజకీయ వివాదానికి దారితీశాయి.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని, శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , మహిళా సంఘాలు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ఈ రాజకీయ వేడి కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశ రాజధాని ఢిల్లీని కూడా తాకింది; ఏపీలో జరుగుతున్న దాడులతో పాటు విజయవాడ సాయికృష్ణ ఉదంతం వంటి లాకప్ డెత్‌ల (కస్టోడియల్ మరణాలు)పై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో స్పీకర్‌కు వాయిదా తీర్మానాన్ని అందజేశారు. దీని ద్వారా రాష్ట్రంలోని అంతర్గత భద్రతా లోపాలను జాతీయ స్థాయిలో చర్చకు పెట్టడంలో ప్రతిపక్షాలు ముందడుగు వేశాయి.
మహిళలపై దాడులకు పాల్పడిన వారికి అదే ఆఖరి రోజు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ పక్క చెబుతూనే ఉన్నారు.. మరో వైపు మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం, సోషల్ మీడియాలో వైరలవడం, ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడంతో గుంటూరు ఘటనలో బాధ్యుడైన నేతను పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా వెంటనే అరెస్ట్ చేయించారు, అలాగే విధుల్లో నిర్లక్ష్యం వహించిన స్థానిక సీఐని కూడా సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలను అవమానించే వారిని చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే క్రిమినల్స్ ఏ పార్టీకి చెందిన వారైనా సరే ఉపేక్షించే ప్రసక్తే లేదని, పోలీసు వ్యవస్థ పూర్తి జవాబుదారీతనంతో పనిచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చూస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Read More
Next Story