అధికార పీఠమెక్కితే ఆంక్షలే
ప్రజాస్వామ్య విలువలకు పాతర వేస్తున్న ప్రతీకార రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నేతల పర్యటనలపై అధికారంలో ఉన్న ప్రభుత్వం, పోలీసులు ఆంక్షలు విధించడం ఒక సర్వసాధారణమైన పరిపాటిగా మారిపోయింది. ప్రతిపక్ష నేత పర్యటించాలనుకుంటే చాలు, కాన్వాయ్ పరిమాణాన్ని కుదించడం, అనుమతించే వాహనాల సంఖ్యను తగ్గించడం, భద్రత లేదా శాంతిభద్రతల సమస్యలను సాకుగా చూపడం పోలీసులకు అలవాటైపోయింది. నిర్ణీత సంఖ్యలోనే పార్టీ శ్రేణులు పాల్గొనాలని నిబంధనలు పెట్టడం ద్వారా ప్రతిపక్షాల ప్రజా రాలీలను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు నిరంతరం సాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ అప్రజాస్వామిక ధోరణి ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
గడిచిన దశాబ్ద కాలపు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇదే తరహా నిర్బంధ విధానాన్ని అవలంబించినట్లు స్పష్టమవుతోంది. 2014 నుండి 2019 మధ్య కాలంలో నాటి తెలుగుదేశం ప్రభుత్వం, అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పర్యటనలపై, ఆయన పార్టీ నేతలపై అనేక ఆంక్షలు విధించింది. ఆ తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ సైతం అదే పంథాను కొనసాగించింది. అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటనలను అడ్డుకుంటూ జీవో నంబర్ 1 వంటి వివాదాస్పద ఆంక్షలు తీసుకురావడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ సీన్ రివర్స్ అయింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్, వైఎస్ఆర్సీపీ నేతల పర్యటనలపై ఆంక్షల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్య విలువల గురించి, పౌర హక్కుల గురించి గొంతు చించుకున్న నాయకులే, అధికార పీఠం ఎక్కగానే తమ పాత మాటలను మరిచిపోయి అదే తరహా ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగిస్తుండటం గమనార్హం. ఈ రెండు ప్రధాన పక్షాల తీరు అధికారంలో ఉంటే ఒక మాట, ప్రతిపక్షంలో ఉంటే మరో మాట అనే చందంగా మారింది.
భారత రాజ్యాంగంలో ప్రతిపక్షానికి ఎంతో గౌరవం, విశిష్టమైన స్థానం ఉన్నాయి. ప్రభుత్వ లోపాలను ఎండగట్టడం, ప్రజల సమస్యల పట్ల గళమెత్తడం ప్రతిపక్షం ప్రాథమిక బాధ్యత. అయితే, ప్రతీకార రాజకీయాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం, ప్రజాస్వామ్య విలువలను కాలరాయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. కేవలం రాజకీయ కక్షసాధింపుల కోసం వ్యవస్థలను వాడుకుంటూ ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడం ద్వారా, పాలకులే స్వయంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారనే విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా బలంగా వినిపిస్తున్నాయి.
Next Story

