x

స్థానిక ఎన్నికల్లోకి మత రాజకీయాలు

మత మార్పిడిలను ప్రోత్సహించారని వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన సీఎం చంద్రబాబు


ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన విమర్శలకు పదును పెట్టారు. గత ప్రభుత్వ వైఫల్యాలను, వివాదాస్పద నిర్ణయాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే వ్యూహంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదాన్ని చంద్రబాబు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత లేని నెయ్యిని, జంతువుల కొవ్వును వాడారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం అపవిత్రం కావడానికి గత ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారాయి.
దీనికి కొనసాగింపుగా, తాజాగా జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు నాయుడు మరోసారి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో బలవంతపు మతమార్పిడులు జరిగాయని, హిందూ దేవాలయాలపై దాడులను సైతం పరోక్షంగా ప్రోత్సహించారంటూ సీఎం మతపరమైన సెంటిమెంట్ల అస్త్రాన్ని ప్రయోగించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ తరహా విమర్శలు చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో రాజకీయంగా పట్టు సాధించాలని కూటమి భావిస్తోంది.
అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న విమర్శలపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ అంతే తీవ్రంగా స్పందిస్తూ కౌంటర్ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఆ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే చంద్రబాబు దేవుడిని, మతాన్ని వాడుకుంటున్నారని ఆరోపిస్తోంది. రాబోయే స్థానిక ఎన్నికలలో రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే మతపరమైన సెంటిమెంట్లను రాజేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
Read More
Next Story