x

యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ భారం

అక్టోబరు 15నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనలు


దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ 'యూపీఐ (UPI)' పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకాలం పూర్తిగా ఉచితంగా సాగిన యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధిస్తూ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. మర్చంట్ లేదా వ్యాపార లావాదేవీల విభాగంలో రూ. 2,000 కంటే ఎక్కువ విలువైన ప్రతి లావాదేవీపై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీని కేంద్రం ఖరారు చేసింది. ఈ కొత్త నిబంధనలు 2026 అక్టోబర్ 15 నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. యూపీఐ డిజిటల్ వ్యవస్థ యొక్క భద్రతను పెంచడానికి, సాంకేతిక మౌలిక సదుపాయాల నిర్వహణను ఆర్థికంగా స్వయంసమృద్ధి గా మార్చడానికి బ్యాంకులు, పేమెంట్ గేట్‌వే యాప్‌ల నిర్వహణ వ్యయం కోసం ఈ ఛార్జీని తెరపైకి తెచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

ఈ కొత్త నిబంధనల వల్ల ప్రధానంగా పెద్ద వ్యాపార సంస్థలు, ఆన్‌లైన్ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు, పెద్ద రెస్టారెంట్లకు కొంత నష్టం లేదా అదనపు ఆర్థిక భారం తప్పదు. ఉదాహరణకు, ఒక కస్టమర్ పెద్ద దుకాణంలో రూ. 10,000 విలువైన వస్తువులను కొనుగోలు చేసి యూపీఐ ద్వారా చెల్లిస్తే, ఆ వ్యాపారి బ్యాంకుల ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 40 (0.4%) వరకు నష్టపోవాల్సి వస్తుంది. అయితే, వ్యాపారస్తులపై భారం మరీ పెరగకుండా ఉండేందుకు కేంద్రం ఈ ఛార్జీలపై గరిష్టంగా రూ. 300 పరిమితిని విధించింది. అంటే రూ. 75,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో ఎంత పెద్ద వ్యాపార లావాదేవీ జరిగినప్పటికీ వ్యాపారస్తులు చెల్లించాల్సిన గరిష్ట ఎండీఆర్ రూ. 300 మాత్రమే అవుతుంది. ఈ అదనపు భారాన్ని కస్టమర్ల బిల్లుపై రుద్దకూడదని, వ్యాపారస్తులే భరించాలని బ్యాంకులు , పేమెంట్ యాప్ నిర్వాహకులకు ప్రభుత్వం కఠిన ఆదేశాలు జారీ చేసింది.
సాధారణ ప్రజలకు, చిరువ్యాపారులకు ఈ విధానం నుండి పెద్ద ఎత్తున మినహాయింపులు లభించాయి. నిత్యజీవితంలో ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి (Person-to-Person) జరిపే సాధారణ నగదు బదిలీలపై, అవి ఎంత మొత్తమైనప్పటికీ ఎటువంటి ఛార్జీలు ఉండవు, అవి పూర్తిగా ఉచితం. అలాగే, నిత్యావసర విభాగాలుగా పరిగణించే రైల్వే టిక్కెట్లు, టెలికాం రీఛార్జ్‌లు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, ఇంధన కొనుగోళ్లు (పెట్రోల్/డీజిల్), విద్యుత్/నీటి బిల్లుల వంటి పబ్లిక్ యుటిలిటీ పేమెంట్లకు రూ. 2,000 దాటినప్పటికీ 0.4% కి బదులుగా కేవలం రూ. 5 ఫ్లాట్ రేట్ మాత్రమే వర్తిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారా నెలకు రూ. 1 లక్ష లోపు ఆదాయం పొందే చిన్న వీధి వ్యాపారులు, కిరాణా దుకాణదారులను (P2PM కేటగిరీ) ఈ ఛార్జీల నుండి పూర్తిగా మినహాయించారు.
మొత్తంగా చూస్తే, ఈ నిర్ణయం వల్ల వ్యాపార వర్గాలపై కొంతమేర నిర్వహణ భారం పడనుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే క్రెడిట్, డెబిట్ కార్డులతో పోలిస్తే యూపీఐ ఎండీఆర్ (0.4%) చాలా తక్కువ అయినప్పటికీ, ఇన్నాళ్లూ 'జీరో-ఎండీఆర్' కు అలవాటుపడిన కార్పొరేట్ వ్యాపారాలు డిజిటల్ లావాదేవీలకు అయ్యే ఈ కొత్త వ్యయాన్ని ఎలా భరిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విశ్లేషణల ప్రకారం.. దేశంలో జరిగే మొత్తం యూపీఐ మర్చంట్ లావాదేవీలలో కేవలం 4 శాతం హై-వాల్యూ లావాదేవీలపై మాత్రమే ఈ ప్రభావం పడుతుందని, మిగిలిన 96 శాతం చిన్న లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే సాగుతాయని నిర్ధారించారు. అయినప్పటికీ, వ్యాపారస్తులు ఈ అదనపు వ్యయాన్ని తట్టుకోవడానికి పరోక్షంగా వస్తువుల ధరలను పెంచే అవకాశం ఉందంటూ మార్కెట్ నిపుణులు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.


Read More
Next Story