x

ఏపీలో భారీగా ఓట్ల కోత?

30 లక్షల ఓట్లు మాయం కానున్నాయా.. అసలేం జరుగుతోంది?


ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర ప్రక్షాళన (SIR-2026) ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్న వేళ రాష్ట్రంలో భారీ ఎత్తున ఓట్లు రద్దవుతున్నాయనే అంశం తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తాజా ముసాయిదా గణాంకాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 44.89 లక్షల మంది పేర్లను ASDD (అందుబాటులో లేనివారు, వలస వెళ్ళినవారు, మరణించినవారు, డూప్లికేట్) కేటగిరీ కింద చేర్చారు. దీనికి తోడు మరో 22 లక్షల ఓట్లను చిరునామా లేనివి (Untraced) గా ఎన్నికల సంఘం ప్రకటించడంతో, క్షేత్రస్థాయి పరిశీలనల అనంతరం రాష్ట్రంలో మొత్తంగా 30 లక్షలకు పైగా ఓట్లు శాశ్వతంగా రద్దయ్యే అవకాశం ఉందనే సంచలన అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిణామాలపై మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, సీపీఐ, సీపీఎం నేతలతో కూడిన ఓటు పరిరక్షణ వేదిక తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వివేక్ యాదవ్‌కు 13 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించింది. కేవలం బూత్ లెవల్ అధికారులు (BLOs) ఇళ్లకు వెళ్లిన సమయంలో అందుబాటులో లేరనే ఏకపక్ష కారణంతో లక్షలాది మంది వలస కార్మికులు, పేదల ఓట్లను 'Untraced' పేరిట తొలగించడం చట్టవిరుద్ధమని వారు మండిపడుతున్నారు. పారదర్శకత కోసం ఏ ఏ ఓట్లు రద్దయ్యాయో ఆ వివరాలను పోలింగ్ బూత్‌ల వారీగా రాజకీయ పార్టీలకు బహిర్గతం చేయాలని, ఈ సవరణల ప్రక్రియ గడువును మరింత పొడిగించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు రాజకీయ పార్టీల మధ్య దీనిపై తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో అక్రమంగా చేరిన బోగస్ ఓట్లను, ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఉన్న డూప్లికేట్ ఓట్లను ఏరిపారేయడానికి ఈ ప్రత్యేక ప్రక్షాళన ప్రక్రియ అత్యంత అవసరమని అధికార పక్షం సమర్థిస్తోంది. అయితే, క్లెయిమ్‌ల గడువు ముగిసినప్పటికీ ఎస్ఐఆర్ ప్రక్రియలో అందిన 3.92 లక్షల నోటీసులు, 4.10 లక్షల కొత్త దరఖాస్తులపై (ఫారం-6, 7, 8) విచారణలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంతో దాదాపు 8 లక్షల ఓట్ల భవిష్యత్తు ఇంకా ఊగిసలాడుతోంది. ఈ పెండింగ్ ఓట్లలో నిజమైన, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటం ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది.
ఈ వివాదాలు, విమర్శలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పందిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రత్యేక ప్రక్షాళన అత్యంత పారదర్శకంగా జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 8 లక్షల క్లెయిమ్‌లు, నోటీసులపై క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విచారణ జరిపి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి, అక్టోబర్ 9, 2026న తుది ఓటర్ల జాబితా ఖరారైన తర్వాతే ఏపీలో పంచాయతీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం కానుంది.
Read More
Next Story