x

ఏపీలో భారీగా రేషన్ బియ్యం స్మగ్లింగ్‌?

హైటెక్ బ్రేకులు.. సంస్కరణలు సక్సెస్ అవుతాయా?


ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి నెలా దాదాపు లక్షల మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని పేదలకు పంపిణీ చేస్తుండగా, క్షేత్రస్థాయిలో ఈ సంక్షేమ బియ్యం పెద్ద ఎత్తున అక్రమ మార్గాల్లోకి మళ్లుతోంది. కాకినాడ పోర్టు వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ స్మగ్లింగ్ ముఠాల గుట్టు రట్టు కావడం నుండి రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం వెలుగుచూస్తున్న ఉదంతాల వరకు ఈ సమస్య తీవ్రత స్పష్టమవుతోంది. 2024లో ప్రభుత్వం మారిన తర్వాత రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన అధికారులు, కేవలం తొలి ఆరు నెలల్లోనే 1,066 క్రిమినల్ కేసులు నమోదు చేసి, రూ. 234 కోట్ల విలువైన సుమారు 60,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమార్కులకు సింహస్వప్నంగా మారుతూ కీలక సూత్రధారులపై నాన్-బైలబుల్ పీడీ యాక్ట్ సైతం ప్రయోగిస్తున్నారు.

ఈ వ్యవస్థీకృత దోపిడీకి శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ ఇప్పుడు సరిహద్దులు దాటి విప్లవాత్మకమైన ‘హైటెక్’ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,000 రేషన్ దుకాణాల నిర్వహణ నుండి మిల్లుల రవాణా వరకు ప్రతి అడుగునూ డిజిటలైజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్‌లు, రేషన్ లారీల కదలికలను కనిపెట్టేలా ఆర్‌ఎఫ్‌ఐడీ (RFID) డిజిటల్ ట్యాగ్‌లు, నిరంతర జీపీఎస్ (GPS) ట్రాకింగ్ లాంటి గట్టి నిఘా చర్యలను క్షేత్రస్థాయిలోకి తెచ్చారు. గోదాములలో నిల్వల చోరీని అడ్డుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కెమెరాలను అమర్చడంతో పాటు, పట్టుబడిన బియ్యం రేషన్‌దా కాదా అని స్పాట్‌లోనే ఒక్క నిమిషంలో నిర్ధారించే రాపిడ్ టెస్టింగ్ కిట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.
అయితే, సాంకేతికత పరంగా ప్రభుత్వం ఎన్ని కంచెలు వేసినా.. క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌ను 100 శాతం అరికట్టడం సాధ్యమేనా అన్నది ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే, సివిల్ సప్లైస్ నిఘా అంతా మిల్లుల నుండి రేషన్ షాపుల వరకే పరిమితం అవుతోంది. అసలైన లీకేజీ రేషన్ షాపు దాటిన తర్వాతే మొదలవుతోందని విశ్లేషకులు చెప్తున్నారు. చాలామంది లబ్ధిదారులు రేషన్ బియ్యాన్ని తినడానికి ఇష్టపడక, స్థానిక బ్రోకర్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లో బయోమెట్రిక్ పడిపోవడంతో ఈ పంపిణీ విజయవంతమైనట్లు చూపిస్తున్నా, పేదల నుంచి సేకరించిన ఆ బియ్యమే టన్నుల కొద్దీ మారి పోర్టుల ద్వారా విదేశాలకు తరలిపోతోంది. సాంకేతికతకు దొరకని ఈ లూప్‌హోల్‌ను మాఫియా చాలా చాకచక్యంగా వాడుకుంటోంది.
ఈ కీలక లూప్‌హోల్‌ను మూసివేయడానికే ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. లబ్ధిదారులు బియ్యాన్ని విక్రయించకుండా ఉండేందుకు, వారు ఇష్టపడే నాణ్యమైన స్టీమ్ రైస్ (ఉడికించిన బియ్యం) సరఫరాను కాకినాడ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. తినే బియ్యం ఇస్తే ఎవరూ అమ్మరనేది ప్రభుత్వ నమ్మకం. దీనితో పాటు డీలర్లు అవినీతికి పాల్పడకుండా ఉండేందుకు రేషన్ షాపులను మీ మార్ట్ అనే మినీ సూపర్‌మార్కెట్లుగా మారుస్తూ వారికి అదనపు ఆదాయం కల్పిస్తున్నారు. ఈ డిజిటల్ టెక్నాలజీ, నాణ్యత సంస్కరణలు కాగితాలకే పరిమితం కాకుండా, కిందిస్థాయి సిబ్బంది అవినీతికి లొంగకుండా, రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా కఠినంగా అమలు చేస్తేనే పేదవాడి సొంతమైన ప్రతి కిలో బియ్యం, ఆ పేదవాడి ఇల్లే చేరుతాయి.
Read More
Next Story