x

చంద్రబాబుకు బెయిల్ ఇచ్చిన జడ్జికి లోకాయుక్త పదవి

జైలర్‌కు ఎక్సైజ్ శాఖలో నజరానా. హైకోర్టులో జడ శ్రవణ్ కుమార్ పిటిషన్.


ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జున రావు నియామకం, అలాగే రాజమహేంద్రవరం జైలు మాజీ జైలర్ కోవెల దుర్గా రమేష్‌కు ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్ ఇవ్వడం తీవ్ర వివాదానికి దారితీసింది. 2023లో స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అప్పట్లో హైకోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ మల్లికార్జున రావు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేశారు. అనంతరం ఆయన పదవీ విరమణ చేయగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను లోకాయుక్తగా నియమించింది. అదే సమయంలో చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు విధులు నిర్వహించిన జైలర్ దుర్గా రమేష్‌ను నిబంధనలు సడలించి మరీ ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్‌గా నియమించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ రెండు వివాదాస్పద నియామకాలను సవాలు చేస్తూ ప్రముఖ సీనియర్ న్యాయవాది, జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు. గతంలో తనకు అనుకూలంగా బెయిల్ తీర్పు ఇచ్చినందుకు ప్రతిఫలంగానే జస్టిస్ మల్లికార్జున రావుకు అత్యున్నత లోకాయుక్త పదవిని బహుమతిగా కట్టబెట్టారని పిటిషనర్ ఆరోపించారు. అలాగే జైల్లో వ్యక్తిగత సేవలు అందించినందుకు జైలర్‌కు ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్ ఇచ్చారని, ఇవన్నీ ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని ఆయన ధ్వజమెత్తారు. తీర్పులు ఇచ్చిన న్యాయమూర్తులకు రిటైర్ అయిన వెంటనే ఇలాంటి పదవులు ఇవ్వడం వల్ల న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తుతాయని శ్రవణ్ కుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నియామకాల కోసం చంద్రబాబు ప్రభుత్వం లోకాయుక్త చట్టానికి తెచ్చిన సవరణలను కూడా పిటిషన్‌లో తీవ్రంగా తప్పుబట్టారు. చట్టం ప్రకారం లోకాయుక్త పదవికి కేవలం రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే అర్హులు కాగా, ప్రస్తుత ప్రభుత్వం సాధారణ 'రిటైర్డ్ హైకోర్టు జడ్జి' కూడా అర్హుడేనంటూ నిబంధనలను మార్చివేసింది. అంతేకాకుండా, గతంలో హైకోర్టు సిట్టింగ్ చీఫ్ జస్టిస్‌తో సంప్రదింపులు జరిపి నిష్పాక్షికంగా ఎంపిక చేసే పద్ధతి ఉండేదని, తాజా సవరణల ద్వారా ఆ అధికారాన్ని ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాజకీయ కమిటీ చేతుల్లోకి తీసుకున్నారని శ్రవణ్ కుమార్ వాదించారు. ప్రభుత్వం తనకు అనుకూలమైన వారిని నియమించుకోవడానికే చట్టాన్ని నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
ఈ చట్ట సవరణలు, నియామకాలపై దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. కోర్టులో జరిగిన ప్రాథమిక విచారణలో పిటిషనర్ తరఫున జడ శ్రవణ్ కుమార్, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ తమ వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను ఒకదానికొకటి జత చేయాలని ఆదేశించింది. లోకాయుక్త నియామక చట్టబద్ధతపై తదుపరి విచారణలో సమగ్రంగా సమీక్షిస్తామని స్పష్టం చేయడంతో ఈ కేసు న్యాయస్థానంలో ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
Read More
Next Story