x

ఏపీలో స్థానిక సమరం

జగన్ ‘టికెట్ కట్’ హెచ్చరిక వెనుక అసలు వ్యూహం ఇదేనా?


ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ నేతలకు ఇచ్చిన అల్టిమేటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలోనైనా ఏకగ్రీవ ఎన్నికలు జరిగితే, దానికి బాధ్యులైన నియోజకవర్గ సమన్వయకర్తలకు (కోఆర్డినేటర్లకు) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కదని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా గ్రామాల్లో ప్రశాంతత కోసం, గ్రామాభివృద్ధి నిధుల కోసం ఏకగ్రీవాలు చేసుకోవడం సహజమని, ప్రభుత్వం కూడా వీటికి ప్రోత్సాహకాలు ఇస్తుందని తెలిసినప్పటికీ, జగన్ ఈ తరహా టికెట్ కట్ వ్యూహాన్ని ఎంచుకోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

ఈ కఠిన నిర్ణయం వెనుక అధికార కూటమి నుంచి వచ్చే రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోవడం, లోపాయికారీ ఒప్పందాలను అడ్డుకోవడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో అధికార పక్షం తమ బలం, పోలీసు యంత్రాంగం ఉపయోగించి ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం లేదా భయపెట్టి ఉపసంహరింపజేయడం వంటి వ్యూహాలు అమలు చేసే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో, వైసీపీ ఇంచార్జ్‌లు అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగిపోయి లోపల సర్దుబాట్లు చేసుకోకుండా నిరోధించడానికి జగన్ ముందస్తుగానే ఈ టికెట్ భయం అస్త్రాన్ని ప్రయోగించారు. ఈ కండిషన్ వల్ల నేతలు తమ ఉనికిని కాపాడుకోవడానికైనా కచ్చితంగా క్షేత్రస్థాయిలో అభ్యర్థులను పోటీకి దించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరోకోణంలో చూస్తే, ఈ స్థానిక సంస్థల ఎన్నికలను జగన్ పార్టీ నేతలకు ఒక 'రాజకీయ అగ్నిపరీక్ష'గా మార్చారు. అధికారం కోల్పోయిన తర్వాత నియోజకవర్గాల్లో స్తబ్దుగా ఉన్న నాయకులను, క్యాడర్‌ను పట్టించుకోని లీడర్లను ఫిల్టర్ చేయడానికి ఇదొక చక్కని మార్గంగా వైసీపీ అధిష్టానం భావిస్తోంది. ఈ ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిజాయితీగా నిలబడి పోరాడేది ఎవరు, అధికార పార్టీని ఢీకొట్టే సత్తా ఎవరికి ఉంది, అలాగే ఒత్తిళ్లకు తలొగ్గి సైలెంట్ అయ్యేది ఎవరు అనేది స్పష్టంగా తేలిపోతుంది. ఈ ఫలితాల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సమర్థులైన అభ్యర్థులను ఖరారు చేయాలనేది జగన్ మాస్టర్ ప్లాన్?.
అయితే, జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో అనవసర శత్రుత్వాలు, గొడవలు వద్దనుకుని ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపే గ్రామీణ ఓటర్ల ఆలోచనలకు ఇది విరుద్ధంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. బలవంతంగా పోటీ పెట్టించడం వల్ల గ్రామాల్లో ఘర్షణ వాతావరణం పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అధికార కూటమి నేతలు సైతం దీనిపై కౌంటర్ ఇస్తూ, ఓటమి భయంతోనే జగన్ తన సొంత నేతలను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా, ఈ టికెట్ కట్ వ్యూహం వైసీపీ శ్రేణుల్లో ఎంతవరకు జోష్ నింపుతుందో, రాబోయే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.
Read More
Next Story