x

అధికారులపై నేతల ఆధిపత్యం

ఏపీ పాలనలో పరిధులు దాటుతున్న రాజకీయం


ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత పదేళ్లుగా ఒక ఆందోళనకరమైన ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టాలు చేసే ప్రజాప్రతినిధులు, వాటిని అమలు చేసే ప్రభుత్వ అధికారులు ఒకే రథానికి రెండు చక్రాల లాంటివారు. కానీ, క్షేత్రస్థాయిలో చోటుచేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఈ రెండు వ్యవస్థల మధ్య ఉన్న హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. ఏ ఒక్క పార్టీకో పరిమితం కాకుండా, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ ఐఏఎస్, ఐపీఎస్ , రెవెన్యూ అధికారులను లక్ష్యంగా చేసుకుంటూ, బహిరంగంగా వారిపై నోరు పారేసుకోవడం ఒక రాజకీయ ఫ్యాషన్‌గా మారిందనే విమర్శలు అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

ఈ ఘర్షణల పరంపర ఈనాటిది కాదు, గత పదేళ్ల పరిపాలనా చరిత్రను పరిశీలిస్తే ఎన్నో సంచలన ఘటనలు కనిపిస్తాయి. 2015లో కృష్ణా జిల్లా ముసునూరులో అక్రమ ఇసుక తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లిన మహిళా తాసిల్దార్ వనజాక్షిపై నాటి అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు భౌతిక దాడికి దిగడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 2017లో విజయవాడ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో నాటి కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంతో ఎంపీ, ఎమ్మెల్యే స్థాయి నేతలు తీవ్ర వాగ్వాదానికి దిగి చట్టాన్ని సవాల్ చేశారు. అలాగే, వైఎస్సార్సీపీ హయాంలో రేణిగుంట విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్ అధికారులతో ప్రోటోకాల్ వివాదాలు ఇరు వర్గాల మధ్య ఉన్న అహంకారాల పోరును బయటపెట్టాయి.
కాలం మారినా నేతల ప్రవర్తన మారలేదని నిరూపిస్తూ ఇటీవలి కాలంలోనూ ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయి. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భూకబ్జాల అంశంపై మహిళా డీఐజీపై బహిరంగంగా వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర దుమారం రేపింది. అటు ఉత్తరాంధ్రాలో, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర మధ్య జిల్లా సమీక్షా సమావేశంలోనే మంత్రి సమక్షంలో తీవ్రస్థాయిలో పరస్పర వాగ్వాదం జరిగింది. మైకు దొరికిందని ఏది పడితే అది మాట్లాడొద్దని ఒక కలెక్టర్, ఎమ్మెల్యేను హెచ్చరించే స్థాయికి పరస్పర సంబంధాలు దిగజారిపోవడం క్షేత్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్లను ప్రతిబింబిస్తోంది.
ఈ వ్యవస్థాగత లోపానికి ప్రధానంగా ది పబ్లిక్ హీరో సిండ్రోమ్ కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. నేడు సోషల్ మీడియాలో వ్యూస్, లైక్స్ కోసం కెమెరాల ముందు అధికారులను నిలదీసి మాస్ హీరో అనిపించుకునే వ్యూహం పెరిగిపోయింది. అలాగే, ప్రభుత్వం మారిన ప్రతిసారీ అధికారులను టార్గెట్ చేసే పగతీర్చుకునే ధోరణి , విధులకు ఆటంకం కలిగిస్తే నాటి ఐపీసీ 353 (నేటి న్యాయ సంహిత) కింద నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నా, నిందితులకు త్వరితగతిన కఠిన శిక్షలు పడకపోవడం ఈ ధోరణికి కారణమవుతోంది. తప్పు చేసిన అధికారిని శిక్షించడానికి చట్టపరమైన మార్గాలు ఉన్నాయని, ప్రజాప్రతినిధులే వీధుల్లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే రూల్ ఆఫ్ లా దెబ్బతింటుందని, అధికారికి హుందాతనం.. నేతకు బాధ్యత ఉన్నప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More
Next Story