x

వ్యూహం మార్చుకున్న జగన్

కాక్రోచ్ పొలిటికల్ రీ..బ్రాండింగ్ వైపు వైఎస్సార్‌సీపీ అధినేత అడుగులు


వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే కాక్రోచ్ (బొద్దింక) అంశాన్ని ప్రస్తావించడం వెనుక సామాన్య యువతతో, ముఖ్యంగా నేటి తరం జెన్ జీ (Gen Z) ఓటర్లతో కనెక్ట్ అవ్వాలనే ఒక వినూత్నమైన పొలిటికల్ రీ..బ్రాండింగ్ వ్యూహం దాగి ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. గతంలో తనను తాను ఒంటరిగానే పోరాడతానని సింబాలిక్‌గా చెప్పుకునే జగన్, ఇప్పుడు హఠాత్తుగా తనను తాను ఒక కాక్రోచ్ గా అభివర్ణించుకోవడం వెనుక బలమైన రాజకీయ మైండ్ గేమ్ ఉందనేది విశ్లేషకుల అంచనా. ఒక మాజీ సీఎం అనే గంభీరమైన ఇమేజ్ లేదా అధికారిక చట్రం నుండి వ్యూహాత్మకంగా తప్పుకుని, వ్యవస్థలు భ్రష్టుపట్టినప్పుడు తిరగబడే ఒక సామాన్య పౌరుడిగా, తిరుగుబాటుదారుడిగా తనను తాను ప్రెజెంట్ చేసుకునేందుకే ఆయన ఈ కొత్త పంథాను ఎంచుకున్నారు.

ఈ వ్యూహానికి జాతీయ స్థాయిలో యువత జరిపిన ఒక వినూత్న డిజిటల్ నిరసన ట్రెండ్ స్ఫూర్తిగా నిలిచింది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు, అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జెన్ జీ యువత సోషల్ మీడియా వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) పేరుతో ఒక డిజిటల్ మూవ్‌మెంట్‌ను నడిపింది. పాలకుల అణచివేత ఎంత తీవ్రంగా ఉన్నా, అణుబాంబు దాడిని కూడా తట్టుకుని నిలబడగల ఏకైక జీవి అయిన బొద్దింక తరహాలోనే యువత ప్రతిఘటన కూడా అంతకంతకూ పుట్టుకొస్తుందనేది ఆ డిజిటల్ ట్రెండ్ సారాంశం. ఈ జాతీయ స్థాయి అన్వయాన్ని జగన్ చాకచక్యంగా ఏపీలోని మెగా డీఎస్సీ వివాదానికి, నిరుద్యోగుల ఆందోళనలకు ముడిపెడుతూ, వ్యవస్థలు భ్రష్టుపట్టినప్పుడు ప్రశ్నించే సామాన్యుడిలా నాలాంటోడు కూడా కాక్రోచ్ అవుతున్నాడు అని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
కేవలం వైఎస్సార్‌సీపీ జెండాలతో, పార్టీ క్యాడర్‌తో చేసే సాంప్రదాయ రాజకీయ ఆందోళనలు ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఆశించిన స్థాయిలో ప్రజా ఒత్తిడిని తీసుకురాలేకపోతున్నాయనే నిజాన్ని జగన్ త్వరగానే గ్రహించారు. అందుకే పార్టీలకు, రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా ఉంటూ, కేవలం తమ ఉద్యోగ భవిష్యత్తు కోసం ఆవేదన చెందుతున్న తటస్థ నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు. డీఎస్సీ అక్రమాల వల్ల నష్టపోయిన అభ్యర్థుల గొంతుకగా మారి, వారి ఆవేదనను తన వైపు తిప్పుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఒక నైతిక ఒత్తిడిని పెంచవచ్చని ఆయన భావిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం కాకుండా, యువత పక్షాన నిలబడే స్వచ్ఛంద శక్తులకు కాక్రోచ్ ఒక ప్రతీకగా మార్చడమే ఇందులో దాగి ఉన్న అసలు ఎత్తుగడ.
మొత్తంగా, కూటమి ప్రభుత్వంపై ఒక స్వచ్ఛంద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి, అధికార పక్షాన్ని డిఫెన్స్‌లో పడేయడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక సరికొత్త పొలిటికల్ డిస్కోర్స్‌ను సృష్టించారు. సాధారణంగా రాజకీయాల్లో బొద్దింక అనే అంశాన్ని ప్రతికూల కోణంలో చూస్తారు, కానీ దానికున్న తీవ్రమైన ప్రతిఘటనా శక్తిని ఒక సాజిటివ్ మెటాఫర్‌గా మార్చి వైఎస్సార్‌సీపీ సరికొత్త మైండ్ గేమ్ ఆడుతోంది. భవిష్యత్తులో ఈ కాక్రోచ్ నినాదం యువతలో ఎంతవరకు చొచ్చుకుపోతుంది, కూటమి ప్రభుత్వంపై ఇది ఎలాంటి ప్రజా ఒత్తిడిని తీసుకురాబోతుందనేది రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల గమనాన్ని శాసించనుందనేది ఆసక్తికర పరిణామంగా మారింది.
Read More
Next Story