చంద్రబాబు అజెండా గిరిజనులా?గిరి సంపదా?
ఏజెన్సీ ప్రాంతాలను, ఆదివాసీలను తమ గుప్పెట్లో పెట్టుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ (మన్యం) ప్రాంతాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అకస్మాత్తుగా తన ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఏజెన్సీ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా తమ రాజకీయ ఆధిపత్యంలోకి తెచ్చుకోవాలని వ్యూహాత్మక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే, గిరిజనుల హక్కులను కాపాడేలా స్థానికులకే 100 శాతం ఉద్యోగాలు వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంటామని, గిరిజన భూ రక్షణ కవచమైన 1/70 చట్టం అంశంలో సుప్రీం కోర్టులో ఇంప్లీడ్ అవుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల సంచలన ప్రకటనలు చేశారు. అయితే, ఈ హఠాత్ పరిణామాల వెనుక గిరిజన సంక్షేమం కంటే కూడా, అక్కడి అపారమైన అటవీ సంపద, వేల కోట్ల విలువైన బాక్సైట్ నిక్షేపాలపై పాలకుల కన్ను పడిందనే అనుమానాలు క్షేత్రస్థాయిలో బలంగా వ్యక్తమవుతున్నాయి.
ఇటీవల ఏజెన్సీ ప్రాంతాలలో జీవో నంబరు 3 , 1/70 చట్టం అంశాలపై ఊహించని విధంగా భారీ ఎత్తున ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, ఈ ఆందోళనలు సాధారణంగా గిరిజన సంఘాల నుండి రాలేదని, స్వయంగా కూటమి ప్రభుత్వ వర్గాలే వ్యూహాత్మకంగా వెనకుండి వీటిని నడిపించాయనే అంతర్గత చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. గిరిజనులలో మొదట చట్టాలపై భయాందోళనలు సృష్టించి, ఆపై తామే రక్షకులుగా రంగంలోకి దిగి వారి సానుభూతిని ఓట్లుగా మార్చుకునేందుకే ఈ డ్రామా ఆడారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆదివాసీల మనసు గెలుచుకుని, వారి ద్వారా రాజకీయ అధికారాన్ని స్థిరపరుచుకోవడానికి ఇదొక ఓటు బ్యాంకు వ్యూహమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చారిత్రక నేపథ్యాన్ని పరిశీలిస్తే, ఏజెన్సీ ప్రాంతాల్లోని ఖనిజ సంపదపై పాలకుల వేట దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. గత 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం జీవో నంబర్ 97’ జారీ చేసి, విశాఖ ఏజెన్సీ పరిధిలోని 1,212 హెక్టార్ల అటవీ భూమిని బాక్సైట్ తవ్వకాల కోసం ఏపీఎండీసీ (APMDC)కి కట్టబెట్టే ప్రయత్నం చేసింది. కానీ, ఆనాడు సుమారు 8,000 మందికి పైగా ఆదివాసీలు ప్రాణాలకు తెగించి పోరాడటంతో మైనింగ్ పనులు ముందుకు సాగలేదు. ఆ తర్వాత వచ్చిన 2019-2024 వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గిరిజనుల ఓట్ల కోసం బాక్సైట్ లీజులను అధికారికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో లాటరైట్ తవ్వకాల ముసుగులో అల్యూమినియం ఖనిజాన్ని రహస్యంగా తరలించిందనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంది.
ఈ సుదీర్ఘ చరిత్రను గమనిస్తే, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా మన్యం గర్భంలో దాగి ఉన్న ఖనిజ నిధులపైనే పాలకుల కన్ను పడుతోందని స్పష్టమవుతోంది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఒకవైపు ఆదివాసీలపై అమితమైన ప్రేమను ఒలకబోస్తూ, మరోవైపు వారిని రాజకీయంగా లొంగతీసుకునే ప్రయత్నాలు చేస్తోందనే చర్చ ఆదివాసీ వర్గాల్లోను, రాజకీయ పక్షాల్లోను వినిపిస్తోంది. ఈ వ్యూహాత్మక రాజకీయ ముసుగు వెనుక.. అంతిమంగా కార్పొరేట్ శక్తులకు అటవీ సంపదను, బాక్సైట్ గనులను ధారాదత్తం చేసే పెద్ద స్కెచ్ దాగి ఉందనే విశ్లేషణలు ఆదివాసీ హక్కుల సంఘాల నుండి బలంగా వినిపిస్తున్నాయి. భవిష్యత్తులో మన్యం కొండలు కార్పొరేట్ మైనింగ్ కోరల్లో చిక్కుకుంటాయా లేక గిరిజన హక్కులు నిలబడతాయా అనేది చూడాలి.
Next Story

