ఏపీ స్థానిక ఎన్నికల్లో జెన్ జీ ప్రకంపనలు
నిరుద్యోగ యువత ఆక్రోశం పాత రాజకీయ కోటలను బద్దలు కొడుతుందా?
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో సరికొత్త తరం (జెన్ జీ) ఓటర్లు అత్యంత నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24.3 శాతంగా ఉన్న యువ ఓటర్లు ఈసారి స్థానిక పోరులో పొలిటికల్ సునామీ తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. సాంప్రదాయ కుల, మత, ధన రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తున్న ఈ డిజిటల్ జనరేషన్.. తమ భవిష్యత్తును మార్చే అభ్యర్థుల వైపే నిలబడాలని బలంగా ఆకాంక్షిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
డిగ్రీలు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు రాకపోవడం, ఒకవేళ వచ్చినా పేపర్ లీకేజీలు, కోర్టు కేసులతో నిరుద్యోగులు తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. కోచింగ్ సెంటర్ల ఫీజుల కోసం తల్లిదండ్రులు తెచ్చిన అప్పుల భారం, ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితిపై యువతలో తీవ్ర ఆవేదన నెలకొంది. తమ హక్కుల కోసం, ఉద్యోగాల కోసం శాంతియుతంగా రోడ్లపైకి వస్తే లాఠీ దెబ్బలు, పోలీస్ కేసులు ఎదురవ్వడంపై ఈ సరికొత్త తరం సగటు నిరుద్యోగి అగ్నిపర్వతంలా రగులుతున్నారు అనే చర్చ నవతరంలో వినిపిస్తోంది.
ఉద్యోగాల నియామకాల్లో వెలుగుచూసిన అక్రమాలు, అవినీతి, దొడ్డిదారిలో కొందరికి ఉద్యోగాలు దక్కడం వంటి పరిణామాలు ఈ తరాన్ని మరింత తిరుగుబాటు వైపు నడిపిస్తున్నాయి. పాతతరం రాజకీయ సమీకరణాలను అస్సలు నమ్మని జెన్ జీ.. తమ సమస్యలను పట్టించుకోని వ్యవస్థపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎన్నికలకు రెండు రోజుల ముందు డబ్బులు పంపిణీ చేసి ఓట్లు సీటు చేసుకునే పాత రాజకీయ వ్యూహాలకు గట్టి చెక్ పెట్టాలని, ఆ కసినంతటినీ ఓటు రూపంలో చూపించాలని యువత భావిస్తోంది.
సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే బంధుత్వాలు, కులాల చుట్టూ తిరుగుతాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ కాబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. యువ ఓటర్లు ఏ పార్టీ జెండానూ చూడకుండా కేవలం అభ్యర్థుల విజన్, స్థానిక అభివృద్ధి, ఉపాధి కల్పననే ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో, తమకు ఉద్యోగాలు ఇవ్వని వారికి ఓటెందుకు వేయాలి? అనే నినాదంతో కదిలితే ఏపీ రాజకీయాల్లో పాత కోటలు బద్దలవడం ఖాయమని, ఈ జెన్ జీ తిరుగుబాటు రాష్ట్ర భవిష్యత్తును మార్చబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story

