x

రేషన్ కార్డుల ఏరివేతపైనే గురి.. బియ్యం నాణ్యతపై మౌనం ఎందుకు?

కేవలం బియ్యం కోసమే కాదు, సంక్షేమ పథకాలకు ఆధారమైన కార్డుల భవితవ్యంపై నిరుపేదల ఆందోళన


ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా కొత్త 'స్మార్ట్ పీడీఎస్' (Smart PDS) నిబంధనలను అమల్లోకి తెచ్చింది. కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, గత 6 నెలలుగా నిరంతరాయంగా ఒక్కసారి కూడా రేషన్ సరుకులు తీసుకోని ఇన్-యాక్టివ్ కార్డులను గుర్తించి, వాటిని తాత్కాలికంగా హోల్డ్‌లో (Disable) ఉంచుతారు. పీడీఎస్ వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను, లీకేజీలను , ఒకరి కంటే ఎక్కువ చోట్ల ఉన్న నకిలీ కార్డులను సాంకేతికత ద్వారా అరికట్టడమే ఈ జాతీయ స్థాయి ప్రక్షాళన యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ప్రక్షాళన ముసుగులో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 1.58 కోట్ల రేషన్ కార్డులు తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఉండగా, ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే సుమారు 16 లక్షల కార్డులపై దీని ప్రభావం పడవచ్చని అంచనా. అయితే, క్షేత్రస్థాయిలో రేషన్ తీసుకోకపోవడానికి ప్రధాన కారణం పేదల బతుకుదెరువు వలసలు. ఏపీలోని వివిధ జిల్లాల నుండి వేలాది కుటుంబాలు కూలి పనుల కోసం పక్క రాష్ట్రాలకు లేదా నగరాలకు వలస వెళ్తుంటాయి. పనుల బిజీలో ఉండి లేదా సాంకేతిక లోపాల వల్ల వలస ప్రాంతాల్లో రేషన్ పొందని నిరుపేద కుటుంబాలు, ఈ 6 నెలల నిబంధన కారణంగా ఇప్పుడు తమ కార్డులను కోల్పోయే భయాందోళనల్లో ఉన్నారు.
ఈ ప్రక్షాళనలో ఎదురవుతున్న మరో ప్రధాన విమర్శ రేషన్ బియ్యం నాణ్యత (Quality). పేదలు రేషన్ తీసుకోకపోవడానికి కేవలం వలసలే కారణం కాదు, రేషన్ షాపుల్లో ఇచ్చే లావు బియ్యం, వండితే ముద్దయిపోయే రకాలు, కొన్నిసార్లు పురుగులు పట్టిన బియ్యం పంపిణీ కావడం కూడా ఒక బలమైన కారణం. ప్రజలు నిరుత్సాహపడి మార్కెట్లో సన్న బియ్యం కొనుగోలుకు మొగ్గు చూపుతుండటాన్ని ప్రభుత్వాలు గమనించడం లేదు. బియ్యం నాణ్యతను పెంచి, సన్న బియ్యం అందించడం ద్వారా ప్రజలు రేషన్ తీసుకునేలా ప్రోత్సహించాల్సింది పోయి.. క్వాలిటీపై మాట్లాడకుండా కేవలం కార్డుల ఏరివేతపైనే దృష్టి పెట్టడం ఎంతవరకు న్యాయమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రేషన్ కార్డు అనేది కేవలం బియ్యం కోసమే కాదు.. ఆరోగ్యశ్రీ, ఫీజ్ రీయింబర్స్‌మెంట్లు, ఉచిత ఇళ్ల స్థలాలు వంటి అనేక సామాజిక భద్రతా పథకాలకు అది ఒక ప్రాథమిక అర్హత పత్రం. ఒకవేళ కార్డు బ్లాక్ అయితే, పేదలు మళ్లీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వస్తుంది. దీనిపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందిస్తూ లబ్ధిదారులకు భరోసా ఇస్తున్నారు. ఇది కార్డుల శాశ్వత తొలగింపు కాదని, కేవలం తాత్కాలిక నిలిపివేత మాత్రమేనని స్పష్టం చేస్తున్నారు. కార్డు హోల్డ్‌లో పడిన వారు ఆందోళన చెందకుండా, రాబోయే 3 నెలల గడువులోగా తమ సమీప సచివాలయానికి వెళ్లి బయోమెట్రిక్ లేదా e-KYC పూర్తి చేసుకుంటే కార్డులు వెంటనే యథావిధిగా పునరుద్ధరించబడతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Read More
Next Story