మాట తప్పిన పవన్ కల్యాణ్ ?
జనసేనలో పెరుగుతున్న మెగా కుటుంబ ప్రాధాన్యత, కుటుంబ సభ్యులకు కీలక పదవులు
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గతంలో తాను వారసత్వ, కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకమని, అలాంటి రాజకీయాలు చేయడానికి తాను రంగంలోకి రాలేదని స్పష్టంగా ప్రకటించారు. అయితే, ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, నియామకాలు పరిశీలిస్తే ఆయన మాటలకు, పార్టీ , ప్రభుత్వ నిర్ణయాలకు పొంతన లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్ తన సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రత్యర్థులు, రాజకీయ విశ్లేషకులు వేలెత్తి చూపుతున్నారు.
పార్టీ స్థాపించినప్పటి నుండి పవన్ కల్యాణ్ తన సోదరుడు కొణిదెల నాగబాబుకు జనసేనలో అగ్రతాంబూలం కల్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నాగబాబును నర్సాపురం పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దించగా, 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని భావించారు. అయితే పొత్తుల సమీకరణాల్లో ఆ సీటు బీజేపీకి వెళ్లడంతో ఆ ప్రతిపాదన విరమించుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాగబాబును ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకోవాలని యత్నించినా, కేబినెట్ విస్తరణ జరగకపోవడంతో ఆగిపోయారు. చివరికి నాగబాబును 'ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ' చైర్మన్గా నియమించి, ఆయనకు కేబినెట్ హోదా దక్కేలా చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మితకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ పాలకమండలిలో 'ప్రత్యేక ఆహ్వానితురాలు'గా ప్రభుత్వం అధికారిక నియామకం చేపట్టింది. సుస్మితకు ఆలయ కమిటీలో చోటు కల్పించడం వెనుక ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒత్తిడి ఉందనే ప్రచారం సాగుతోంది. రాజకీయంగా లేదా సామాజిక సేవా రంగాల్లో పెద్దగా క్రియాశీలంగా లేని మెగా కుటుంబ సభ్యులకు ఇలాంటి కీలకమైన ఆధ్యాత్మిక , ప్రభుత్వ పదవులు కేటాయించడంపై విమర్శలు తీవ్రమవుతున్నాయి.
వారసత్వ రాజకీయాలపై పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కల్యాణ్, అధికారం చేతికి రాగానే అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ తన కుటుంబ సభ్యులకు ప్రాధాన్యత కల్పిస్తూ కీలక పదవులు కట్టబెట్టడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇది పవన్ కల్యాణ్ ద్వంద్వ విధానాలకు నిదర్శనమని, ఇతర పార్టీలపై ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆయన కుటుంబానికే వర్తిస్తాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మాట తప్పనంటూనే కుటుంబ సభ్యుల రాజకీయ ఎదుగుదలకు పదవులను ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు జనసేన వర్గాల్లోనూ అంతర్గతంగా కలకలం రేపుతున్నాయి.
Next Story

