x

బొత్సకు మేనల్లుడు వెన్నుపోటు? ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

విజయనగరంలో బొత్స వర్సెస్ చిన్న శ్రీను వార్


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో, ఒకప్పుడు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ కుటుంబం అత్యంత బలమైన రాజకీయ కేంద్రంగా ఉండేది. గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించిన బొత్స, ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) లో ఒక ముఖ్య నాయకుడిగా కొనసాగుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తర్వాత వైఎస్సార్‌సీపీలో బొత్స సత్యనారాయణే అత్యంత కీలక నేతగా ఎదిగారు, అంతేకాకుండా ప్రస్తుతం ఆయన శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా (LoP) కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన స్వస్థలం విజయనగరం జిల్లా అయినప్పటికీ, బొత్స రాజకీయ ప్రభావం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది. దీనివల్ల ఆయన కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు కూడా పలు రాజకీయ బాధ్యతలలో కొనసాగుతూ వచ్చారు.

అయితే, ఒకప్పుడు ఇదే రాజకీయ వర్గంలో అత్యంత కీలక వ్యక్తిగా ఉన్న బొత్స సత్యనారాయణ మేనల్లుడు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ చిన్న శ్రీను వైఎస్సార్‌సీపీని వీడి తెలుగుదేశం పార్టీ (TDP) లో చేరడంతో, ఇప్పుడు బొత్స కుటుంబం చుట్టూ ఉన్న రాజకీయ సమీకరణాలలో మార్పులు మొదలయ్యాయి. ఇది ఖచ్చితంగా బొత్సకు చెందిన పాత రాజకీయ నెట్‌వర్క్ ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. దశాబ్దాలుగా క్షేత్రస్థాయిలో బొత్స సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా నిలిచిన చిన్న శ్రీను వైఎస్సార్సీపీ నుంచి నిష్క్రమణ వైఎస్సార్‌సీపీ కేడర్‌లో తీవ్ర గందరగోళానికి దారితీసింది.
ముఖ్యంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో, ఈ పరిణామాల వల్ల తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య రాజకీయ లెక్కలు పూర్తిగా మారబోతున్నాయి. విజయనగరం జడ్పీ చైర్మన్ సీటు కేటాయింపుతో మొదలైన అంతర్గత విభేదాలు చివరకు పార్టీ మార్పుకు దారితీయడంతో, చిన్న శ్రీను వెంటే జిల్లాలోని కీలకమైన ద్వితీయ శ్రేణి నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఈ పరిణామం ఉత్తరాంధ్రలో ఉనికి కోసం పోరాడుతున్న వైఎస్సార్‌సీపీకి కోలుకోలేని దెబ్బ కాగా, క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్న అధికార టీడీపీకి మరింత బలాన్ని చేకూర్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ పరిణామాలపైన ఉత్తరాంధ్ర వైఎస్సార్‌సీపీ నాయకులు స్పందిస్తూ పైకి వ్యక్తులు మారినా పార్టీకి వచ్చే నష్టం లేదు అని చెప్తున్నా, అంతర్గతంగా మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారనే చర్చ వినిపిస్తోంది. మరోవైపు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న దాని ప్రకారం.. చిన్న శ్రీను రూపంలో టీడీపీకి ఉత్తరాంధ్రలో ఒక సిద్ధమైన పొలిటికల్ నెట్‌వర్క్ దొరికినట్లయింది. కూటమి అధికారంలో ఉండటం, దానికి తోడు బొత్స సొంత మనుషులే తోడవ్వడంతో విజయనగరం, భీమిలి బెల్ట్‌లలో తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో పూర్తిగా పైచేయి సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
Read More
Next Story