ఏపీ స్థానిక ఎన్నికల్లో బ్యాలెట్ రాజకీయం..
ఈవీఎం గెలుపు ముద్ర పోగొట్టుకునేందుకే కూటమి ప్లాన్?
ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తిగా బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అయితే, గత 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి, ఫలితాలపై తీవ్ర అభ్యంతరాలు, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఆసక్తికరమైన చర్చకు దారితీసింది.
గత సార్వత్రిక ఎన్నికల రోజున సాయంత్రం 5 గంటల వరకు ప్రకటించిన ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ, అర్ధరాత్రి దాటే వరకు పోలింగ్ జరిగి ఓటింగ్ శాతం ఒక్కసారిగా భారీగా పెరగడంపై విపక్షాలు అప్పట్లోనే మండిపడ్డాయి. దీనికి తోడు తుది పోలింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించేందుకు ఎన్నికల సంఘం నాలుగు రోజుల సుదీర్ఘ సమయం తీసుకోవడంతో, ఈవీఎంల మేనేజ్మెంట్ వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందనే బలమైన ఆరోపణలను ప్రతిపక్షాలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి.
ఈ నేపథ్యంలోనే, ప్రజల్లో , రాజకీయ పార్టీల్లో ఈవీఎంలపై ఉన్న అనుమానాలకు, వివాదాలకు పూర్తిగా స్వస్తి పలికి, ఎన్నికల ప్రక్రియపై నమ్మకాన్ని పెంచేందుకే కూటమి ప్రభుత్వం ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పేపర్ ద్వారానే జరపాలని భావిస్తున్నట్లు కూటమి వర్గాల్లో అంతర్గతంగా విస్తృతంగా చర్చ నడుస్తోంది. బ్యాలెట్ ద్వారా కూడా తామే గెలిచి చూపిస్తే... సార్వత్రిక ఎన్నికల విజయంపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని నిరూపించవచ్చనేది కూటమి వ్యూహంగా కనిపిస్తోంది.
అయితే, ఈ వ్యవహారంపై రాజకీయ విశ్లేషకులు మరో ఆసక్తికరమైన కోణాన్ని తెరపైకి తెస్తున్నారు. నిజానికి ఏపీ ఎన్నికల చరిత్ర ప్రకారం... సార్వత్రిక ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వాడుతుండగా, స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడూ సాంప్రదాయ బ్యాలెట్ విధానంలోనే జరుగుతున్నాయి. ఇటువంటప్పుడు, ఈవీఎంల గెలుపు అనే ముద్రను పోగొట్టుకుని, తాము ఏ విధానానికైనా సిద్ధమే అని చెప్పుకుంటూ గత ఆరోపణల నుండి క్లీన్ చిట్ పొందేందుకే ప్రభుత్వం ఎన్నికల అధికారి ద్వారా ఈ అంశాన్ని ప్రత్యేకంగా హైలైట్ చేయిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story

