బాబు ’ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‘ వ్యూహం..వైసీపీ ఫినిష్?
డబుల్ ఇంజిన్ సర్కార్ పైనే భారీగా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ వ్యూహాన్ని తెరపైకి తీసుకొచ్చారు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ’ట్రిపుల్ ఇంజిన్ సర్కార్‘ నినాదం హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో కూటమి పగ్గాలు చేపట్టడాన్ని డబుల్ ఇంజిన్ పాలనగా అభివర్ణిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించడం ద్వారా మూడో ఇంజిన్‌ను జోడించాలని వ్యూహాత్మక పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయి పంచాయతీలు, మున్సిపాలిటీలను కూడా కూటమి వశం చేసుకోవడం ద్వారా నిధుల వినియోగాన్ని, సంక్షేమ పథకాలను పల్లెల వరకు అత్యంత వేగంగా తీసుకెళ్లవచ్చని ఆయన క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ సరికొత్త పొలిటికల్ నినాదం వెనుక చంద్రబాబు మాస్టర్ ప్లాన్ దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత స్తబ్దుగా మారిన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) క్షేత్రస్థాయి ఎన్నికల ద్వారా మళ్లీ పుంజుకోకుండా పూర్తిగా నామరూపాలు లేకుండా చేయడం ఈ వ్యూహంలో ప్రధాన భాగం. అలాగే, కేంద్రం నుంచి వచ్చే ఫైనాన్స్ కమిషన్ నిధులు నేరుగా స్థానిక సంస్థలకే అందుతుండటంతో, అక్కడ కూడా కూటమి అధికారంలో ఉంటేనే నిధుల అనుసంధానం సులువవుతుందనే బలమైన సందేశాన్ని ఓటర్ల మైండ్లోకి పంపడం చంద్రబాబు ఎత్తుగడగా కనిపిస్తోంది.
అయితే.. ఈ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూటమి లోపల ఉన్న సీట్ల పంచాయతీ అతిపెద్ద సవాల్‌గా నిలిచింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ధర్మం కోసం త్యాగాలు చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక ఆశావహులంతా ఇప్పుడు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలపై కన్నేశారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీల క్యాడర్ టికెట్ల కోసం తీవ్రంగా పోటీ పడుతుండటంతో, సీట్ల పంపకాలు సరిగ్గా జరగకపోతే రెబెల్స్ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంతర్గత విభేదాలను అధిగమించి క్యాడర్‌ను సమన్వయం చేయడం కూటమి అగ్రనేతలకు కత్తిమీద సామేనని చెప్పాలి.
మరోవైపు.. ప్రతిపక్ష వైసీపీ ఈ నినాదాన్ని తీవ్రంగా తప్పుబడుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన సూరప్ సిక్స్ హామీల అమలులో జరుగుతున్న వైఫల్యం , విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి కీలక అంశాలపై ప్రస్తుత డబుల్ ఇంజిన్ ప్రభుత్వమే విఫలమైందని ఆరోపిస్తోంది. ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అనే కొత్త డ్రామాను తెరపైకి తెచ్చారని వైసీపీ విమర్శిస్తోంది. ఈ నేపథ్యంలో, రాబోయే స్థానిక పోరు కూటమి ఆధిపత్యానికి, వైసీపీ రాజకీయ మనుగడకు అత్యంత ప్రతిష్టాత్మకమైన అగ్నిపరీక్షగా మారబోతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story

