x

సుప్రీం కోర్టు ఆదేశాలున్నా ఆగని అరాచకాలు

ఏపీ స్థానిక ఎన్నికల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు


ఆంధ్రప్రదేశ్ మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అత్యంత సంచలన మలుపు చోటుచేసుకుంది. నామినేషన్ల ప్రక్రియలో అధికార కూటమి శ్రేణులు సాగించిన హింస, ప్రతిపక్ష అభ్యర్థులపై జరిగిన అరాచకాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని స్పష్టం చేస్తూ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి (SEC) కీలక మార్గదర్శకాలను ఇచ్చింది.

ఈ విచారణలో భాగంగా సుప్రీంకోర్టు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణను అక్టోబర్ 25 వరకు వాయిదా వేయాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, క్షేత్రస్థాయిలో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలించి, ప్రభావిత మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువును కనీసం 48 గంటల పాటు పొడిగించే అంశంపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దేశ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా పెను హాట్ టాపిక్‌గా మారింది.
సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) తక్షణమే స్పందించింది. తీవ్రమైన హింస, దాడులు , ఘర్షణలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన 19 మున్సిపాలిటీలలో నామినేషన్ల ఉపసంహరణతో పాటు, తదుపరి ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎస్ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ, క్షేత్రస్థాయిలో అభ్యర్థుల భయాందోళనలను తగ్గించేందుకు , శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు ఈ నిలిపివేత చర్యలు చేపట్టినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అయితే, ఒకవైపు కోర్టు ఆదేశాలు, మరోవైపు ఎన్నికల సంఘం ఆంక్షలు అమల్లోకి వచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఉద్రిక్తతలు పూర్తిగా చల్లారలేదు. జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు వేస్తున్న ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధికార కూటమి వర్గాలు ఇప్పటికీ భయభ్రాంతులకు గురిచేస్తూనే ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలుకు సిద్ధమవుతున్న వారిపై దాడులు కొనసాగుతుండటం, పోటీ చేస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం తగిన భద్రత కల్పించడం లేదనే విమర్శలు రావడం ఇప్పుడు ఎన్నికల నిర్వహణపై మరిన్ని ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Read More
Next Story