x

ఏపీ స్థానిక ఎన్నికలు.. హీటెక్కుతున్న రాజకీయం

ఏకగ్రీవాలపై కూటమి, వైసీపీ హోరాహోరీ వ్యూహాలు


ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగక ముందే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల గోలేంటి? అనే అంశంపైనే జోరుగా చర్చ నడుస్తోంది. గతంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏకగ్రీవాలను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రస్తుత కూటమి పార్టీలు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అదే వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు, గత హయాంలో అధికారంలో ఉండి ఏకగ్రీవాలను గట్టిగా సమర్థించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP), ఇప్పుడు వాటిని ఎలాగైనా అడ్డుకోవడానికి ఎదురు వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సీన్ పూర్తిగా రివర్స్ అవ్వడం గమనార్హం.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు జరిగాయి. అప్పట్లో అధికార పార్టీ నేతలు భౌతిక దాడులు, బెదిరింపులకు పాల్పడి, తమ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను లాక్కున్నారని నాటి ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేనలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో, రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను ఏకగ్రీవం చేసుకోవాలనే ఆలోచనలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు వైసీపీ పట్టుదలతో ఉంది. ప్రతి స్థానంలోనూ తమ అభ్యర్థులతో కచ్చితంగా నామినేషన్లు వేయించాలని, అక్రమ ఏకగ్రీవాలను అడ్డుకోవడానికి అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు న్యాయపోరాటం చేయాలని జగన్ తన శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు.
నిజానికి ప్రజాస్వామ్యంలో ఎలాంటి ఒత్తిడులు, గొడవలు లేకుండా గ్రామస్థులంతా ఏకతాటిపైకి వచ్చి ఒకే అభ్యర్థిని ఎన్నుకునే స్వచ్ఛంద ఏకగ్రీవాలు చట్టబద్ధమైనవి, ఆహ్వానించదగినవి. ఇలాంటి ఏకగ్రీవాల వల్ల గ్రామాల్లో ఎన్నికల ఖర్చు తప్పడమే కాకుండా గ్రూపు రాజకీయాలు, కక్షలు రావు. అందుకే ఇలాంటి గ్రామాలను ప్రోత్సహించడానికి పంచాయతీ రాజ్ శాఖ జనాభాను బట్టి రూ. 5 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు ప్రత్యేక అభివృద్ధి నిధులను నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరిగే సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. పార్టీ గుర్తులపై జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నిధులు ఉండవు.
అయితే, అధికార బలం, అంగబలం, అర్థబలంతో ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, లేదా బెదిరించి నామినేషన్లను ఉపసంహరింపజేసే బలవంతపు ఏకగ్రీవాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. ఇలాంటి చర్యల వల్ల సామాన్య ఓటరు కనీసం ఓటు వేసే హక్కును కూడా కోల్పోతాడు. అందుకే ఎన్నికల సంఘం, కోర్టులు ఇలాంటి బలవంతపు ఏకగ్రీవాలను తీవ్రంగా పరిగణిస్తాయి. ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు రుజువైతే ఆ ఏకగ్రీవాలను రద్దు చేసే అధికారం కూడా ఎన్నికల సంఘానికి ఉంటుంది. ఏది ఏమైనా, ఏపీలో రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ ఏకగ్రీవాల అంశం అతిపెద్ద పొలిటికల్ వార్‌కి దారితీయడం ఖాయంగా కనిపిస్తోంది.
Read More
Next Story