1/70 చట్టంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సుప్రీంకోర్టులో గిరిజనులకు అనుకూలంగా అఫిడవిట్
ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతాల్లో దశాబ్దాలుగా సున్నితంగా మారిన భూ వివాదాల పరిష్కారం దిశగా రాష్ట్ర ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టం (భూ బదలాయింపు నియంత్రణ చట్టం) లో ఎలాంటి సవరణలు లేదా మార్పులు చేయకూడదని ప్రభుత్వం ప్రాథమికంగా నిశ్చయించింది. గిరిజనుల హక్కులను కాపాడటమే ధ్యేయంగా ప్రస్తుత చట్టాన్ని యథాతథంగా కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నట్లు సచివాలయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఈ చట్టాన్ని సవరించాలంటూ కొంతమంది గిరిజనేతరులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ కేసులో గిరిజన ప్రజలకు అండగా నిలవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయస్థానంలో త్వరలో దాఖలు చేయనున్న కౌంటర్ అఫిడవిట్లో గిరిజనుల ప్రయోజనాలకు అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం తన వాదనలను వినిపించనుంది. ఈ మేరకు కోర్టులో సమర్పించాల్సిన చట్టపరమైన నివేదికలు, అఫిడవిట్ ముసాయిదాను సిద్ధం చేసే బాధ్యతను ప్రభుత్వం ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించింది.
అసలు ఈ వివాదానికి మూలమైన ‘1/70 చట్టం నేపథ్యాన్ని పరిశీలిస్తే... బ్రిటిష్ కాలపు చట్టాల ఆధారంగా 1959లో తెచ్చిన భూ బదలాయింపు నియంత్రణ చట్టాన్ని (LTR) మరింత బలోపేతం చేస్తూ 1970లో ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ చట్టం ప్రకారం షెడ్యూల్డ్ లేదా ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములు కేవలం గిరిజనుల మధ్య మాత్రమే బదిలీ అవ్వాలి. ఒక గిరిజనుడి భూమిని గిరిజనేతరుడు కొనడానికి వీల్లేదు. చివరికి పబ్లిక్ పర్పస్ కింద ప్రభుత్వం సేకరించే భూములను కూడా గిరిజనేతరులకు కేటాయించకుండా నిషేధిస్తూ ఈ చట్టం గిరిజనులకు సంపూర్ణ రక్షణ కల్పిస్తోంది.
అయితే, తరతరాలుగా ఏజెన్సీ ప్రాంతాల్లోనే స్థిరపడి జీవిస్తున్న గిరిజనేతరులు ఈ చట్టం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని, భూములపై హక్కులు లేక రుణాలు కూడా పొందలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, గిరిజనుల చట్టబద్ధమైన హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూస్తూనే, అక్కడ నివసిస్తున్న గిరిజనేతరులకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఎలా న్యాయం చేయవచ్చనే అంశంపై గిరిజన సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రత్యేక నివేదికను సిద్ధం చేసి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.
Next Story

