జనాభా నియంత్రణ విధానాన్ని అత్యుత్తమంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు 2026 గొడ్డలి పెట్టుగా మారనుందనే ఆందోళన దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.. జనాభాను అదుపు చేసిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ వంటి సౌత్ స్టేట్స్ తమ లోక్‌సభ స్థానాలను భారీగా కోల్పోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ అసెంబ్లీలలో అధికారిక తీర్మానాలు కూడా ఆమోదించాయి. అటు కేరళలో అధికార ఎల్‌డీఎఫ్ కూటమితో పాటు ప్రధాన ప్రతిపక్షమైన యూడీఎఫ్ కూటమి కూడా ముక్తకంఠంతో ఈ బిల్లుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. వీటికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ అధికార పక్షం, ప్రతిపక్షాల రాజకీయం ఉంది.
అయితే, పొరుగున ఉన్న దక్షిణాది రాష్ట్రాలన్నీ కేంద్ర బిల్లుపై పోరాడుతుంటే, ఆంధ్రప్రదేశ్ రాజకీయం మాత్రం దీనికి పూర్తి భిన్నమైన దారిలో పయనిస్తోంది. ఏపీలోని అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేనలతో పాటు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) కూడా ఈ బిల్లుకు ఇది వరకే సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. రాష్ట్రంలో స్థానికంగా రాజకీయ వైరుధ్యాలు, తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ, ఢిల్లీ బిల్లు విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలోని ఈ మూడు ప్రధాన శక్తులూ ఒకే తీరుగా వ్యవహరించడం విశేషం. మిగిలిన సౌత్ స్టేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ కేంద్ర నిర్ణయానికి జై కొట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ బిల్లును గట్టిగా సమర్థిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లు దీనిని పూర్తి స్థాయిలో స్వాగతించారు. గతంలో పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ఓటింగ్‌తో ఈ బిల్లు వీగిపోయిన సందర్భంలో సీఎం చంద్రబాబు విపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. విపక్ష పార్టీలు బిల్లును అడ్డుకుని దేశానికి ద్రోహం చేశాయని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని, దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు హామీ ఇచ్చారని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం ఉన్న 25 నుండి 38 కి పెరుగుతాయని, ఎక్కడా ప్రాతిపదిక నిష్పత్తి మారదని ఆయన సమర్థించారు.
మరోవైపు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం ఈ బిల్లు విషయంలో కేంద్రానికే మద్దతుగా నిలిచారు. పార్లమెంట్‌లో బిల్లు వీగిపోయినప్పుడు, దాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్ష పార్టీలపై జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిల్లును అడ్డుకున్న పార్టీలు తాము సాధించింది ఏంటో తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ బిల్లు వీగిపోవడం వల్ల అటు మహిళా రిజర్వేషన్లు వాయిదా పడ్డాయని, ఇటు దక్షిణాది ప్రయోజనాలకు ఎలాంటి రక్షణా దక్కకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఏపీలోని మూడు ప్రధాన పార్టీలు ఈ బిల్లును సమర్థిస్తుంటే.. రాష్ట్రంలోని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు (CPI, CPM) మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు వ్యక్తపరుస్తున్నాయి.