ఏపీలో ’అగ్రీడ్ లిస్ట్‘ కలకలం
అవినీతి నివారణకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థలో పారదర్శకతను పెంచడం, అవినీతిని అరికట్టడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రవర్తన అనుమానాస్పదంగా ఉన్న, నిజాయితీపై ఆరోపణలు ఎదుర్కొంటున్న గెజిటెడ్ స్థాయి అధికారులపై కఠిన నిఘా ఉంచేందుకు వీలుగా అగ్రీడ్ లిస్ట్ విధానాన్ని (Agreed List System) ప్రవేశపెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సరికొత్త నిఘా యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే అమల్లోకి వచ్చింది.
ఈ ప్రత్యేక విధానం కింద సాధారణ పరిపాలన శాఖ (GAD), అవినీతి నిరోధక శాఖ (ACB), విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు సంయుక్తంగా ఒక స్క్రీనింగ్ కమిటీగా ఏర్పడి పని చేస్తాయి. క్షేత్రస్థాయిలో అందుతున్న నమ్మదగిన, ఆధారాలతో కూడిన ఫిర్యాదులపై ఈ కమిటీ గరిష్టంగా 90 రోజుల్లోగా రహస్య విచారణ పూర్తి చేస్తుంది. ఆరోపణల్లో ప్రాథమిక సత్యం ఉందని నిర్ధారణ అయితే, సదరు అధికారుల పేర్లను పరస్పర అంగీకారంతో ఈ ‘అగ్రీడ్ లిస్ట్’ లో చేరుస్తారు. అయితే, కేవలం వ్యక్తిగత కక్షలతో వచ్చే అనామక (Anonymous) ఫిర్యాదులను ప్రభుత్వం పూర్తిగా తిరస్కరిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ నిఘా వలయంలోకి రాష్ట్ర ప్రభుత్వ గెజిటెడ్ అధికారులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు కూడా వస్తారు. ఈ జాబితాలో ఒకసారి అధికారి పేరు నమోదైతే, వారికి భవిష్యత్తులో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే ఎలాంటి కీలకమైన లేదా లాభదాయకమైన (Lucrative) పోస్టింగ్‌లను కేటాయించరు. అదనంగా, సదరు అధికారుల రోజువారీ నిర్ణయాలు, ఫైళ్ల క్లియరెన్స్ వేగం, జీవనశైలి, ఆస్తుల వివరాలపై విజిలెన్స్ వర్గాలు నిరంతరం కంటికి కనిపించకుండా నిఘా ఉంచుతాయి. ఈ జాబితా ఒక సంవత్సరం పాటు అమల్లో ఉంటుంది. ప్రతి ఏటా దీనిని పునఃసమీక్షిస్తారు.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని అవినీతిపై ముందస్తు నివారణ చర్యగా (Preventive Vigilance) అభివర్ణిస్తుండగా, ఉద్యోగ సంఘాల నుండి దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నచ్చని అధికారులను రాజకీయంగా వేధించడానికి లేదా వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ఈ విధానం దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కొన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వకుండా రహస్యంగా నిఘా పెట్టడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్దేశాన్ని నెరవేరుస్తూనే, నిజాయితీ గల అధికారులకు నష్టం జరగకుండా ఈ విధానాన్ని సమతూకంతో అమలు చేయడం ఇప్పుడు ఒక సవాలుగా మారింది. మరో వైపు ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను నుంచి డైవర్ట్ చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
Next Story

