x

కల్తీ నెయ్యి కేసు..ముగింపు ఎప్పుడో?

ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు


తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన సంచలన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. ఎన్‌డీఏ కూటమి వంద రోజుల పాలన సందర్భంగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ సనాతన ధర్మ రక్షకుడిగా రూపాంతరం చెంది, 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించి, తాను సనాతన వాదినని ప్రకటించుకున్నారు. ఎలాంటి పూర్తిస్థాయి ప్రాథమిక సమాచారం, కచ్చితమైన ల్యాబ్ ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే దేవుడి పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేశారని విమర్శిస్తూ వైసీపీ నేతలు తీవ్ర ప్రతివిమర్శలు చేశారు. ఈ వివాదం కాస్తా సర్వోన్నత న్యాయస్థానానికి చేరడంతో.. కనీస ప్రాథమిక ఆధారాలు లేకుండా రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, దేవుడిని రాజకీయాల్లోకి లాగవద్దని సుప్రీంకోర్టు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐ పర్యవేక్షణలో ఏర్పాటైన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ అంశంపై లోతైన విచారణ చేపట్టింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన తుది చార్జ్‌షీట్‌లో సీబీఐ కీలక నిజాలను వెల్లడించింది. లడ్డూల తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు అవశేషాలు లేవని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేయడంతో చంద్రబాబు తొలి ఆరోపణలు కాస్తా ఇరకాటంలో పడ్డాయి. అయితే, అక్కడ అంతకంటే పెద్ద ఫుడ్ ఫ్రాడ్ జరిగిందని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్ల కాలంలో సరఫరా అయిన నెయ్యిలో అసలు పాల చుక్కే లేదని, అది పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, కెమికల్ ఎస్టర్స్ వంటి పూర్తిగా రసాయన సింథటిక్ పదార్థాలతో తయారు చేసిన నకిలీ నెయ్యి అని సీబీఐ నివేదిక బయటపెట్టింది.
క్రిమినల్ దర్యాప్తుతో పాటు, తిరుమలలో జరిగిన వ్యవస్థీకృత పరిపాలనా లోపాలను వెలికితీయడానికి సీఎం చంద్రబాబు ప్రభుత్వం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఛైర్మన్‌గా ఒక ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. దినేష్ కుమార్ కమిషన్ తన లోతైన అధ్యయనం తర్వాత ప్రభుత్వానికి తుది నివేదికను అందజేసింది. గత వైఎస్సార్సీపీ హయాంలో కొనుగోలు కమిటీ ఉద్దేశపూర్వకంగా టెండర్ నిబంధనలను సడలించిందని, కనీస నాణ్యతా ప్రమాణాల ల్యాబ్ తనిఖీలు లేకుండానే లక్షలాది కిలోల నెయ్యిని సేకరించడం వల్లే ఈ అక్రమాలు సాధ్యమయ్యాయని కమిషన్ తన నివేదికలో బట్టబయలు చేసింది. ఈ ఏకసభ్య కమిషన్ నివేదికను పరిశీలించి బాధ్యులపై తగిన చట్టపరమైన, క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో డీజీపీ, న్యాయశాఖ కార్యదర్శులతో కూడిన ఒక త్రిసభ్య (త్రీ మెన్) కమిటీని రంగంలోకి దించింది.
ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ సిట్ సమర్పించిన చార్జ్‌షీట్ ఆధారంగా మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు, వీరిపై ఏసీబీ కోర్టులో విచారణ సాగుతోంది. వీరిలో ఉత్తరాఖండ్‌కు చెందిన భోలేబాబా డెయిరీ, తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నిర్వాహకులతో పాటు పలువురు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. అక్రమాలకు సహకరించినట్లు తేలిన కార్మిక, ఫ్యాక్టరీల శాఖకు చెందిన ఏడుగురు అధికారులపై ఇప్పటికే ప్రభుత్వం క్రమశిక్షణా చర్యల వేటు వేసింది. ఇక రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన వైసీపీ నేతలపై చర్యల విషయానికి వస్తే.. నాడు టెండర్ నిబంధనలను అడ్డగోలుగా మార్చడానికి అనుమతించిన నాటి టీటీడీ ఉన్నతాధికారులు లతో పాటు నాటి వైఎస్సార్సీపీ బోర్డు సభ్యులు, ముఖ్య నేతలపై చట్టపరమైన విచారణకు, తదుపరి క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం గట్టిగా ఉచ్చు బిగిస్తోంది. అయితే ఎంత మంది మీద చర్యలు తీసుకోనుందనేది ప్రశ్నర్థకంగా మారింది.
Read More
Next Story