చంద్రబాబుకు చెక్.. పవన్ కల్యాణ్‌కు ప్రమోషన్?
శ్రీనివాస వర్మ వ్యాఖ్యల వెనుక స్కెచ్..2029 కోసం బీజేపీ నయా ప్లాన్?
ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ వేదికపై ఒక ఆసక్తికరమైన రాజకీయ ఘట్టం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ల పేర్లను తారుమారు చేశారు. ఆయన నోటి వెంట ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అనే సంబోధన రావడం అక్కడ ఉన్న వారందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత ఆయన వెంటనే సర్దుకుని సక్రమంగానే ప్రసంగించినప్పటికీ, ఈ ’నోటి తడబాటు‘ వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉందనే చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో తీవ్రంగా సాగుతోంది.
సీనియర్ నేత తడబడటం వెనుక అసలు కథేంటి?
భూపతిరాజు శ్రీనివాస వర్మ ఏపీ రాజకీయాల్లో కేవలం ఒక సాధారణ నేత కాదు. ఆయన విద్యార్థి దశ నుంచే బీజేపీ సిద్ధాంతాలతో పెరిగిన అత్యంత సీనియర్ నాయకుడు. బహిరంగ సభల్లో అనర్గళంగా మాట్లాడటం ఆయనకేమీ కొత్త కాదు. పైగా పక్క రాష్ట్రం నుండి వచ్చిన వారెవరైనా పొరపడ్డారంటే అర్థం ఉంది కానీ, ఏపీకి చెందిన ఒక కేంద్ర మంత్రికి రాష్ట్ర సీఎం ఎవరో, డిప్యూటీ సీఎం ఎవరో తెలియకపోవడం అనేది నమ్మశక్యంగా లేదనేది విశ్లేషకుల అభిప్రాయం. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రబాబును పక్కనపెట్టి, పవన్ కల్యాణ్‌ను సీఎం అని సంబోధించడం వెనుక ఢిల్లీ బీజేపీ పెద్దల ముందస్తు వ్యూహం ఏమైనా ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబును నర్మగర్భంగా తక్కువ చేసి చూపిస్తూ, పవన్ కల్యాణ్‌ను ప్రమోట్ చేయడానికే కేంద్ర పెద్దలు కావాలనే ఈ విధంగా మాట్లాడించారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
2029 వ్యూహాలకు ఇక్కడే పునాది పడుతోందా?
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అతిపెద్ద భాగస్వామిగా ఉన్నప్పటికీ, రాబోయే రోజుల్లో సమీకరణాలు మారే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అగ్రనాయకత్వం చంద్రబాబు కంటే జనసేనాని పవన్ కల్యాణ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనేది బహిరంగ రహస్యం. గత కొంతకాలంగా కేంద్రంలోని పెద్దలు పవన్‌ను ప్రత్యేకంగా ఆదరిస్తున్న తీరును గమనిస్తే, భవిష్యత్తు రాజకీయాలకు ఇప్పుడే పునాది వేస్తున్నట్లు అర్థమవుతోంది. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీలో కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్‌ను బరిలోకి దించేందుకు బీజేపీ ఇప్పటి నుంచే తెరవెనుక స్కెచ్ వేస్తోందని, అందులో భాగమే ఈ ప్రసంగాల వ్యూహమని రాజకీయ పక్షాలు విశ్లేషిస్తున్నాయి.
మిత్రపక్షాల మధ్య చిచ్చు పెట్టే ఎత్తుగడ?
ఈ పరిణామాలన్నీ కూటమిలోని అంతర్గత సఖ్యతను పరీక్షించేలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడి లాంటి హేమాహేమీ నేతను కాదని, పవన్‌ను హైలైట్ చేయడం ద్వారా కూటమిలో ఆధిపత్య పోరును సృష్టించాలని బీజేపీ భావిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ కల్యాణ్‌ను భవిష్యత్ సీఎం అభ్యర్థిగా ఫోకస్ చేయడం ద్వారా జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు, టీడీపీ గ్రాఫ్‌ను కంట్రోల్‌లో ఉంచాలనేది బీజేపీ ప్లాన్‌గా కనిపిస్తోంది. మొత్తానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ సభలో దొర్లిన ఈ చిన్న పొరపాటు, రాబోయే ఐదేళ్ల ఏపీ రాజకీయాల్లో రానున్న ఒక పెద్ద తుఫానుకు సూచికగా మారిందని పొలిటికల్ సర్కిల్స్ గుసగుసలాడుకుంటున్నాయి.
Next Story

