x

బీసీలకు 34% రిజర్వేషన్లు

చంద్రబాబు సామాజిక న్యాయమా? 2029 వ్యూహమా?


ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించాలనే చంద్రబాబు కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనుక లోతైన రాజకీయ ఎత్తుగడలు, సామాజిక లెక్కలు దాగి ఉన్నాయి. రాష్ట్ర జనాభాలో సుమారు 51 శాతంగా ఉన్న బీసీలను రాజకీయంగా తమవైపు తిప్పుకోవడానికి ఈ వ్యూహం కీలకం కానుంది. రాష్ట్రంలో ఉన్న 13 వేలకు పైగా పంచాయతీలు, 660 కి పైగా జెడ్పీ స్థానాలు, 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వేలాది పదవులు బీసీలకు దక్కడం ద్వారా గ్రామస్థాయి నుంచి బలమైన బీసీ నాయకత్వం రూపుదిద్దుకుంటుంది. ఈ పదవుల కేటాయింపు ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను పటిష్టం చేసుకోవడంతో పాటు, భవిష్యత్తులో స్థానిక రాజకీయాలపై తిరుగులేని పట్టు సాధించాలనేది కూటమి ప్లాన్.

ఈ చారిత్రాత్మక నిర్ణయం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) సాగిస్తున్న సామాజిక న్యాయం ప్రచారానికి గట్టి చెక్‌ పెట్టనుంది. గత జగన్‌ ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులను సాకుగా చూపుతూ బీసీ రిజర్వేషన్లను 34% నుండి 24.15% కి తగ్గించడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 16,000 మంది బీసీలు రాజకీయ అవకాశాలు కోల్పోయారని కూటమి బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇప్పుడు తాము అధికారంలోకి రాగానే ఆ నష్టాన్ని భర్తీ చేస్తూ 34% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా, కూటమి మాత్రమే బీసీల నిజమైన ప్రతినిధి అనే నమ్మకాన్ని కలిగించడంలో చంద్రబాబు సఫలమయ్యారు. దీనివల్ల బీసీలు, ఎస్సీల ఓటు బ్యాంక్‌పై పట్టు సాధించాలని చూస్తున్న వైసీపీ డిఫెన్స్‌లో పడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
త్వరితగతిన (డిసెంబర్‌లోగా) స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన తరుణంలో ఈ 34 శాతం రిజర్వేషన్లను చట్టపరంగా, సాంకేతికంగా ఖరారు చేయడం ప్రభుత్వానికి పెద్ద సవాలే అయినప్పటికీ, ఈసారి పక్కా వ్యూహంతో అడుగులు పడ్డాయి. సుప్రీంకోర్టు గతంలో విధించిన నిబంధనలకు కట్టుబడుతూ, విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ ద్వారా సమకాలీన గణాంకాలను (Empirical Data) ప్రభుత్వం ముందే సేకరించింది . ఈ కమిషన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 50.50 శాతంగా నిర్ధారించబడింది . ఈ శాస్త్రీయ ఆధారాలను బేస్ చేసుకుని అసెంబ్లీలో అవసరమైన చట్ట సవరణలు చేయడం ద్వారా కోర్టుల నుంచి ఎటువంటి లీగల్ బ్రేక్స్ పడకుండా సాంకేతికంగా ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసుకుంది.
మొత్తంగా చూస్తే, ఈ నిర్ణయం వెనుక ఉన్నది కేవలం తాత్కాలిక సామాజిక న్యాయం మాత్రమే కాదు.. 2029 ముందస్తు రాజకీయ లెక్కలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా గ్రామ, మండల స్థాయిల్లో వేలాది మంది బీసీ నేతలను పదవుల్లో కూర్చోబెట్టడం వల్ల, వారు రాబోయే ఐదేళ్ల పాటు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతతో గ్రౌండ్ లెవెల్‌లో గట్టి రక్షణ కవచంలా నిలుస్తారు. ఈ వ్యూహం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో వైసీపీకి ఉన్న క్యాడర్ బలాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయవచ్చు . ఫలితంగా, 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో తిరుగులేని సామాజిక-రాజకీయ ఆధిక్యతను (Political Dominance) సొంతం చేసుకుని, సుదీర్ఘ కాలం అధికారంలో కొనసాగేలా చంద్రబాబు నాయుడు కూటమికి ఒక పటిష్టమైన పునాదిని నిర్మించుకుంటున్నారు.
Read More
Next Story