
పేపర్ లీక్‌లతో ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్తు?
NTAపై నమ్మకం పోతోందా?
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆశగా ఎదురుచూసే నీట్ పరీక్ష మరోసారి వివాదాల్లో చిక్కుకుంది. ప్రశ్నపత్రం లీక్ కావడంతో నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసి జూన్ 21న మళ్లీ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయం విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచలేకపోయింది. వరుసగా జరుగుతున్న లీక్‌లు, పరీక్షల రద్దులతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థుల కలలపై లీక్ ప్రభావం..
ఈసారి నీట్ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది హాజరయ్యారు. వారిలో చాలా మంది రెండేళ్లు, మూడేళ్లు కష్టపడి సిద్ధమయ్యారు. కుటుంబాలు ఆర్థికంగా ఎన్నో త్యాగాలు చేశాయి. కానీ ఒక్క లీక్‌తో ఆ శ్రమ అంతా వృథా అయిన భావన విద్యార్థుల్లో కనిపిస్తోంది.
నీట్ అభ్యర్థి శివమ్ తివారీ మాట్లాడుతూ.. పరీక్ష రాసిన తర్వాత మొదట ఇది పుకారే అనుకున్నానని, కానీ తర్వాత నిజంగా పేపర్ లీక్ అయ్యిందని తెలిసి తీవ్ర నిరాశకు గురయ్యానని తెలిపాడు. రెండేళ్ల కష్టం ఒక్కసారిగా కూలిపోయినట్టు అనిపించిందని చెప్పాడు.
జూన్ 21 మళ్లీ పరీక్ష..
‘‘జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించడం తాత్కాలిక చర్య మాత్రమే. ఇది అసలు సమస్యకు పరిష్కారం కాదన్నారు. మళ్లీ పరీక్ష తేదీ ప్రకటించగానే “పేపర్ కావాలా?” అనే సెటైర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి’’ అని కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు కేశవ్ అగర్వాల్ అన్నారు. ప్రజలు ఇప్పుడు NTAను “నేషనల్ ట్రామా ఏజెన్సీ”గా పిలవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
NTAలో నిపుణుల కొరత?
వినోబా భావే విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ చంద్ర భూషణ్ శర్మ కూడా NTA పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. పరీక్షల నిర్వహణ అనేది సాధారణ పరిపాలనా పని కాదని, దీనికి ప్రత్యేక నైపుణ్యం అవసరమని అన్నారు. ప్రస్తుతం పరీక్షలపై పూర్తి అవగాహన లేని అధికారులను కీలక పదవుల్లో నియమిస్తున్నారని విమర్శించారు. పరీక్షల భద్రతపై పూర్తి పట్టు ఉండాల్సిన సంస్థలో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణులు అవసరమని సూచించారు.
లీక్ ఎలా జరుగుతోంది?
ప్రశ్నపత్రాల తయారీ నుంచి ముద్రణ వరకు అనేక దశల్లో బయటి వ్యక్తులు పనిచేస్తున్నారు. టైపింగ్, ప్రింటింగ్, రవాణా వంటి ప్రక్రియల్లో ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం ఎక్కువగా ఉండటం వల్ల లీక్ అవకాశాలు పెరుగుతున్నాయన్నది
నిపుణుల అభిప్రాయం. అదే సమయంలో UPSC, IIT-JEE వంటి పరీక్షల్లో ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరగడం గమనార్హమని వారు చెప్పారు. మరి నీట్ పేపర్లే ఎందుకు పదేపదే లీక్ అవుతున్నాయనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
ఆన్‌లైన్ పరీక్షలే పరిష్కారమా?
2027 నుంచి నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. విద్యార్థులు దీనిని స్వాగతిస్తున్నా.. నిపుణులు మాత్రం కొన్ని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకేసారి 24 లక్షల మందికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించేందుకు అవసరమైన ఇంటర్నెట్, విద్యుత్, సాంకేతిక వసతులు ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవని వారు చెబుతున్నారు. హ్యాకింగ్ ప్రమాదం కూడా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు.
“బిగ్ బాస్ హౌస్” మాదిరి భద్రత
పేపర్ లీక్‌లను పూర్తిగా అడ్డుకోవడానికి కేశవ్ అగర్వాల్ ఒక ప్రత్యేక ప్రతిపాదన చేశారు. ప్రశ్నపత్రం తయారు చేసే నిపుణులను పరీక్షకు 15 రోజుల ముందు నుంచి పూర్తిగా భద్రత ఉన్న ప్రదేశంలో ఉంచాలని సూచించారు. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉంచితే లీక్ అవకాశాలు తగ్గుతాయని అన్నారు. అలాగే పరీక్ష ప్రారంభానికి గంట ముందు మాత్రమే పరీక్షా కేంద్రాల్లో ప్రశ్నపత్రాలు ముద్రించాలని సూచించారు.
మెడికల్ సీట్లు పెంచాలన్న డిమాండ్..
ప్రస్తుతం దేశంలో ప్రభుత్వ మెడికల్ సీట్లు చాలా తక్కువగా ఉండటం కూడా సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. 24 లక్షల మంది విద్యార్థులు కేవలం కొన్ని వేల ప్రభుత్వ సీట్ల కోసం పోటీ పడుతుండటంతో ఒత్తిడి పెరుగుతోందన్నారు. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, సీట్లు భారీగా పెంచాలని సూచించారు.
మరిన్ని సంస్కరణలు అవసరమని ప్రొఫెసర్ శర్మ కొన్ని కీలక సూచనలు చేశారు. అవేంటంటే..
- IIT-JEE మాదిరిగా ప్రయత్నాల సంఖ్య పరిమితం చేయాలి
- రెండు దశల్లో పరీక్ష నిర్వహించాలి
- అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి నిర్ణయించాలి
- సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలి
అని సూచించారు.
విద్యార్థుల్లో ఒకే ఆశ..
ఈసారి అయినా పారదర్శకంగా పరీక్ష నిర్వహించాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. “నేను రాసే పరీక్ష నిజాయితీగా జరుగుతోందని, ఫలితం నా కష్టానికి వస్తోందని నమ్మకం కలగాలి” అని విద్యార్థి శివమ్ చెప్పిన మాటలు ప్రస్తుతం లక్షలాది మంది అభ్యర్థుల మనసులో ఉన్న భావనను ప్రతిబింబిస్తున్నాయి.
ఇప్పుడు దేశం ఎదురు చూస్తున్న అసలు ప్రశ్న ఒక్కటే..
జూన్ 21న పరీక్ష లీక్ లేకుండా జరుగుతుందా?
లేక మళ్లీ అదే కథ పునరావృతమవుతుందా?

