Courtesy AI
x

ఒకే జిల్లా.. నాలుగు డివిజన్లు: తిరుపతి రైల్వే పరిపాలనలో గందరగోళం!

విశాఖకు జోన్.. తిరుపతికి మొండిచేయి! రాయలసీమకు రైల్వే అన్యాయంపై స్వరం పెంచుతామంటున్న నేతలు


రైల్వే ప్రాజెక్టుల మంజూరులో సమన్యాయం పాటించడం ద్వారా మేలు చేయాలని రాయలసీమ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

"2002లో మంజూరు చేసి, ఆ తరువాత గుంటూరుకు తరలించిన రైల్వే డివిజన్ తిరుపతిలో ఏర్పాటు చేయండి" అని తిరుపతి బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ప్రతినిధి కుప్పాల గిరిధర్ సూచించారు. పరిపాలన, రవాణా సదుపాయానికి ఇది మరింత మేలు చేస్తుందని కూడా ఆయన సూచించారు.

"కొత్త డివిజన్ ఏర్పాటు అనేది ఖర్చుతో కూడుకున్నది. పరిపాలనా అనుమతులు ఆలస్యం అవుతాయి" అని భావిస్తే, రైల్వే ప్రాజెక్టుల వర్గీకరణలో మంజూరు చేసిన ప్రాజెక్టును తిరిగి తిరుపతికి కేటాయించడం సముచితం" అని ఆయన అభిప్రాయపడ్డారు.
విశాఖపట్నంను రైల్వే జోన్ గా ప్రకటించిన సమయంలో కూడా తిరుపతిని మరిచిపోయారనే వేదన వ్యక్తం అవుతోంది. రైల్వే ప్రాజెక్టుల్లో రాయలసీమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంద్ర ప్రాంతానికి జోన్, డివిజన్ ఉంది. కోస్తా ప్రాంతానికి విజయవాడ, గుంటూరు డివిజన్లు ఉన్నాయి. రాయలసీమ జిల్లాలకు కు మాత్రం గుంతకల్ డివిజన్ ఒక్కటే ఉంది.
"గుంతకల్లు డివిజన్ కార్యాలయం తిరుపతికి 350 కిలోమీటర్లు దూరంలో ఉందని, తిరుమలకు వీఐపీలు ఇతర ప్రముఖులు వచ్చిన సందర్భంలో రైల్వే అధికారులకు కూడా ఇబ్బందిగా మారింది" అని గిరిధర్ వివరించారు.

ఆదాయం ఎంత..?
తిరుపతికి రోజుకు దాదాపు 200 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. తిరుపతి, రేణిగుంట జంక్షన్ కు సుమారు 400 కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. చిత్తూరు జిల్లా నుంచి సీజన్ పండ్లలో మామిడి, మామిడి గుజ్జు తోపాటు రాయలసీమ నుంచి అనేక రకాలా లాజిస్టిక్ రవాణా ద్వారా కూడా రైల్వే శాఖకు ఆదాయం వస్తోంది.
"తిరుపతి స్టేషన్ ప్రయాణికులకు విస్తృత సేవలు అందిస్తోంది. ఏటా సుమారు 300 కోట్ల రూపాయలు ఆదాయం ఇక్కడి నుంచే రైల్వే శాఖకు వస్తోంది. తిరుపతి రైల్వే స్టేషన్ కు అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ సుదీర్ఘకాలంగా రైల్వే డివిజన్ అందని ద్రాక్షగా మారింది" అని గిరిధర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

"వందల కోట్ల ఆదాయం ఇస్తున్న తిరుపతికి రైల్వే డివిజన్ ఇవ్వాలి" అని సీపీఎం నేత కందారపు మురళీ డిమాండ్ చేశారు.

"తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రానికి ఉన్న ప్రాధాన్యత, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కూడలిగా ఉండడం కూడా ప్రయాణికులు, కార్గో రవాణాకు కూడా కీలకంగా ఉందనే విషయాలను పరిగణలోకి తీసుకోవాలి" అని మురళీ సూచించారు. రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధులు మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన కీలక సమయం ఇదే అని కూడా ఆయన సూచన చేశారు.

ఒకో ప్రాంతం ఒకో డివిజన్ లోనా..?

రాయలసీమ పరిధిలోని జిల్లాలు, రైల్వే స్టేషన్లు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విభిన్న డివిజన్లు సదరన్ రైల్వే (చెన్నై) పరిధిలోకి చేర్చారు. దీనివల్ల పరిపాలనా వ్యవహారాలు కూడా ఇబ్బందికరంగా మారాయి. దీనివల్ల జిల్లా లేదా రైల్వే అధికారులు సమీక్షలకు కూడా ఇబ్బందికరంగా మారింది.
ఇదీ సాక్ష్యం..
1. తిరుపతి, రేణిగుంట గుంతకల్లు డివిజన్ లో ఉన్నాయి.
2. రేణిగుంట నుంచి కడపకు వెళ్లే రైల్వే మార్గంలో రైల్వే కోడూరు నియోజవవర్గం ఓబులవారిపల్లె రైల్వే స్టేషన్ కీలకమైంది. మంగంపేట ముగ్గురాళ్ల గనులకు ప్రసిద్ధి. దీనితో పాటు రేణిగుంట విజయవాడ మార్గంలో ఉన్న శ్రీకాళహస్తికి సమీపంలోని కృష్ణపట్నం కూడా గుంటూరు డివిజన్ లో ఉన్నాయి.
3. శ్రీకాళహస్తి, దీనికి సమీపంలోని శ్రీసిటీ, నగరి, ఆ తరువాతి స్టేషన్లు సదరన్ రైల్వే (చెన్నై) పరిధిలో ఉన్నాయి.
ఈ ప్రాంతాలకు సంబంధించి తిరుపతి జిల్లా కలెక్టర్ సమీక్షించాలంటే నాలుగు రైల్వే డివిజన్ అధికారులను సమన్వయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
"విశాఖ జోన్ ఏర్పాటుతో వాల్తేరు, విజయవాడ దీనికి 30 కిలోమీటర్ల దూరంలోనే గుంటూరు రైల్వే డివిజన్లు దగ్గర, దగ్గరే ఉన్నాయి. అమరావతి కేంద్రంగా డివిజన్ ఏర్పాటైతే, అత్యంత సమీపంలోనే మూడు డివిజన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయి" ఈ అతపస్య పరిస్థితిని చక్కదిద్దాలని తిరుపతి రైల్వే డివిజన్ సాధర సమితి కన్వీనర్ గిరిధర్ డిమాండ్ చేశారు.

నిరుద్యోగులకు ఉపాధి

రాయలసీమ జిల్లాలోని బొప్పాయి, అరటి టమోటా, వేరుశనగ, మామిడి ఇతర కూరగాయల పంటలను ఢిల్లీ,ముంబై, కలకత్తా వంటి దూర ప్రాంతాలకు రవాణా చేసే గూడ్స్ సౌకర్యం మెరుగవుతుందని గిరిధర్ గుర్తు చేశారు. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక పర్వ దినాల్లో అదనపు రైళ్లు, అదనపు బోగీలు ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 20 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని, భారతదేశంలో రైల్వే నిబంధనల మేరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైల్వే డివిజన్ గా తిరుపతిని ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. తిరుపతి ని బాలాజి డివిజన్ గా ప్రకటించాలని గత 30 సంవత్సరాల నుంచి డిమాండ్ ఉందన్నారు.
Read More
Next Story