వైదిక దళిత దృష్టిని సవాలుచేసిన-’దండోరా!’
x

కవి బోయి భీమన్న

వైదిక దళిత దృష్టిని సవాలుచేసిన-’దండోరా!’

తెలుగునాట మాలల ఉన్నతి మొదటి నుంచి వారికున్న వైదిక మూలాల కారణంగా ఏర్పడింది అయితే, మాదిగల వెనుకబాటు మీద ఇప్పటికి శాస్త్రీయ అధ్యయనం లేదు. అది జరగవలసి ఉంది


మన చాతుర్వర్ణ నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో ఎక్కడా- ‘లిస్టెడ్’ కాని కులాలను ఐదవ కేటగిరీలో పెట్టి వీరు- ‘పంచములు’ అంటరానివారు అన్నారు. అయితే, అది నిలకడగా జడత్వంతో ఉండే భావన కాదని, దీనికి పైకి ప్రాకే (Upper mobility) లక్షణం ఉంటుందని, ఇటువంటి ‘యావ’తో ఉండడాన్ని- ‘సంస్కృతీకరణ’ అన్నారు సుప్రసిద్ధ సోషల్ అంత్రోపాలజిస్ట్ డా. ఎం.ఎన్. శ్రీనివాస్. అలా పైకి చేరాలి అని వుండే ఆ యావను- ‘భ్రాహ్మణీకరణ’ చెందడం అన్నారు. డా. శ్రీనివాసన్ సూత్రీకరణ తెలుగునాట షెడ్యూలు కులాల విషయంగా ఎంతవరకు నిజమని చూస్తే, లభిస్తున్న ఆధారాలు అది సత్యమని చెబుతాయి. విజయనగర సామ్రాజ్య పాలకుడు రాజైన శ్రీకృష్ణ దేవరాయలు (1471-17) రాసిన ‘ఆముక్తమాల్యద’ లో ‘మాల దాసరి’ ఒక ప్రధాన పాత్రగా కనిపిస్తుంది. అప్పటికి అది ఆ రాజుకు వున్న సర్వజన భావన కావొచ్చు. అయితే ఆ కాలం నాటికే ‘మాల’ కులస్తులు సేవారంగంలో పనిచేస్తూ పరిపాలనకు దగ్గరగా ఉండడం వల్ల, కావ్యాలలో సైతం ‘మాల’ ప్రస్తావన ఉన్నట్టుగా మనకు అర్ధమవుతుంది.

ఇదే కృష్ణానదికి ఆవల ఇప్పటి గుంటూరు జిల్లావాసి శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 1921-22 మధ్య కాలంలో రాసిన నవల పేరే ‘మాలపల్లి’ కావడంతో, మొదటినుంచి సాహిత్యరంగంలో ఆ కులానికి లభించిన కావ్య ప్రశస్తి ఎంత గొప్పదో అర్ధమవుతుంది. ఈ నవల రావడానికి కొంచెం ముందు; శ్రీ గురజాడ అప్పారావు గారు (1862-1915) ‘మంచి అన్నది మాల అయితే, మాల నేను అవుతాను’ అనడం, అప్పటికి అది ప్రగతిశీల భావన అయితే కావొచ్చు కానీ, ఇప్పటి దళిత స్పృహ ఆయన ‘షరతు’ను అంగీకరించదు. అయితే, ‘రికార్డు’ కోసం దాన్ని గుర్తు చేసుకోవడం వరకూ ఇబ్బంది లేదు.

కేంద్ర సాహిత్య అకాడమి 2012లో గుంటూరులో ‘మాలపల్లి’ నవలపై రెండు రోజుల సదస్సు నిర్వహించి అందులో వచ్చిన పత్రాలను ఒక గ్రంధంగా తెచ్చింది. అందులో ‘మాలపల్లి – ఆధ్యాత్మిక దృక్పధం’ అంశంపై శ్రీ బూదాటి వెంకటేశ్వర్లు రాసిన పత్రంలో ఆయన- “సనాతన వైజ్ఞానానికి సమాంతరంగా సాగిన అచల సంప్రదాయాన్ని, ఈ దేశంలో ఆరని జ్యోతిగా నిలిచిన అధ్యాత్య్మిక వెలుగును, అడుగడుగునా సమర్దిస్తూ ‘మాలపల్లె’ను ఉన్నవ వారు ‘మునిపల్లె’గా మార్చారు” అని రాసారు.

ఇటువంటి నేపధ్యంలో, ఇప్పుడు మీకు తూర్పుగోదావరి వాసి మాల కులస్తుడైన శ్రీ బోయి భీమన్న (1911-2005) వ్యక్తిత్వము- ‘పాలేరు నుంచి పద్మశ్రీ వరకూ...’ (ఇది ఆయన జీవిత చరిత్ర గ్రంధం పేరు) లోని కొన్ని విషయాలు రేఖా మాత్రంగా తెలిస్తే ఈ వ్యాస పరంపరలో జరుగుతున్న చర్చ మరింత స్పష్టంగా అర్ధం అవుతుంది. ఈ గ్రంధాన్ని ఆయన జీవించిన కాలంలోనే ఆయన భార్య హైమవతి రాసారు.

అందులోని కొన్ని విషయాలు ఇవి:

1. మాక్సిం గోర్కి నవల ‘అమ్మ’ అనువదించిన క్రొవ్విడి లింగరాజు 1938-41 మధ్య రాజమండ్రి మున్సిపాలిటీ చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు భీమన్నతో చెప్పిన విషయమిది. “మద్రాసులో “ఆంధ్రప్రభ” అనే దినపత్రిక పెడుతున్నారు అనీ, తనను సంపాదకుడిగా రమ్మని పిలిచారని, కానీ తాను వెళ్ళడం లేదని భీమన్నతో చెబుతూ, ‘సంపాదకవర్గంలోకి నిన్ను తీసుకోమని రాసాను, నీవు మద్రాసు వెళ్ళు” అన్నారు.

2. భీమన్న మద్రాసు కొంత ఆలస్యంగా వెళ్ళాడు. ఈయన కోసం కొన్నాళ్ళు ఆంధ్రప్రభ యాజమాన్యం ఎదురుచూసి, ఆ స్థానంలో శ్రీశ్రీని వేసేసుకున్నారట ఆ స్థానంలో. దాంతో గూడవల్లి రామబ్రహ్మంగారి ‘ప్రజామిత్ర’ లో సబ్ ఎడిటర్ గా భీమన్న చేరారు.

3. రామబ్రహ్మంగారు ‘మాలపిల్ల’ సినిమా (1938) పూర్తిచేసి, రిలీజ్ చేయడానికి సిద్దంగా ఉన్న రోజులవి. సినిమాలో కధ హరిజనులకు అవమానకరంగా ఉన్నదని, తాను కోర్టులో కేసు వేస్తానని వేముల కూర్మయ్య గారు బెదిరిస్తున్నారు.

4. “మా పిల్లలను ఒక బ్రాహ్మణుడు లేవదీసుకుని పోవడానికి వీల్లేదు” అన్నారు కూర్మయ్య గారు.

5. “పోనీ ఒక బ్రాహ్మణ పిల్లని మీ మాలవాడు లేవదీసుకుని పోయినట్లుగా మీరొక సినిమా తీయండి” అన్నారు భీమన్న

6. ఈ సినిమా విడుదల కోసం మెడ్రాస్ లో జరిగిన పంచాయతీలో దర్శకుడి తరుపున భీమన్న కూర్చుని కూర్మయ్యను ఒప్పించడంతో చివరికి సినిమా విడుదల అయింది.

ఇలాంటి సంగతులు ఎన్నో ఈ గ్రంధంలో చూస్తాము. రచయిత ముందుమాటలో మొదట్లో ఇలా అంటారు- “ఎక్కడో గోదావరి లంకలో పల్లెటూరి పేటలో పుట్టి, మహా కవిగా వెరసి, పద్మశ్రీ ఇంకా ఎన్నెన్నో గౌరవాలు పొందుతూ ఎదిగిన ఈ మాల పిల్లవాడు ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఈయన జీవిత సరళి ఎలాంటిది?” అని ఆమె ఆ గ్ర్నదంలో రాస్తారు.

సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత మోదుకూరి జాన్ సన్ (మాదిగ) (1930-1988) సంస్మరణ ప్రచురణ తీసుకురావాలని 2003లో తెనాలి వద్ద కొలకలూరులోని ఆయన మిత్రులు కొందరు అనుకున్నారు. దాని కోసం అప్పట్లో హైదరాబాద్ లో భీమన్నను సీనియర్ జర్నలిస్టు ఆర్. భరద్వాజ కలిసి మోదుకూరితో ఆయన అనుబంధం గురించి వివరాలు ‘రికార్డు’ చేసారు.

ఆ ప్రచురణలో ఆయన చెప్పిన వివరాలు ఇవి:

1. బెజవాడ గోపాల రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1955 అక్టోబర్ 27న నన్ను ఆంధ్రప్రదేశ్ అనువాద శాఖకు డైరక్టర్ గా పోస్టు చేసారు... అప్పట్లో నేను ఆంధ్ర యూనివర్సిటీ సెనేట్ మెంబర్ గా వున్నాను.

2. అప్పట్లో మావద్ద ఖాళీగా వున్న ఒక అనువాదకుడు పోస్టులో కొన్నాళ్ళు మోదుకూరి జాన్ సన్ పనిచేసారు.

3. నేను జాన్ సన్ తో ‘మోదుకూరి’ అనే నీ ఇంటి పేరుతొ నువ్వు చెలామణి అయితే మంచిది, నీ పేరు పెట్టుకోవద్దు మార్చు అని చెప్పాను. మొండివాడు వినలేదు.

4. కేంద్ర సాహిత్య అకాడమీ రీజినల్ సలహా సంఘం సమావేశంలో పాల్గొనడానికి 1974 ఫిబ్రవరిలో మద్రాస్ వెళ్ళాను. అప్పుడు అక్కడ జాన్ సన్ అతిధిగా వున్నాను.

ఇవి 1911-2005 మధ్య సవర్ణ లేదా ఆధిపత్య కులాలతో పాటు ఒక మాల సాహితీ వేత్తకు దక్కిన గౌరవం. ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికీ, బోయి భీమన్న ‘పాలేరు’ (1938) నాటకాన్ని భిన్నంగా చూడాలి. భీమన్న జీవితానికి, ఆయన రాజకీయాలకు, ‘కెరియరిజ’, వ్యక్తిగత జీవితానికి సంబంధం లేనివిగా విడిగా దాన్ని మనం చూడాలి. ‘చదువు’ దళిత వికాసానికి సమస్తమూ... అనేది అందులోని ప్రధాన అంశం. ఆ కధలో ఒక పాలేరు పిల్లవాడు కష్టపడి చదివి కలక్టర్ అవుతాడు. అలా అతడు తన యజమాని కూతురుని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాడు. అప్పట్లో ‘పాలేరు’ నాటకం ఊళ్లలో ప్రజల మీద బలమైన ప్రభావం కలిగించింది. దాంతో ఎందరో తల్లిదండ్రులు పిల్లల్ని కొత్తగా బడులకు పంపించడం మొదలెట్టారు అంటుంటారు.

అయితే, ఈ కాలంలో మాదిగలు గురించి మన సాహిత్యంలో చిత్రణ ఎలా ఉంది? అని చూసినప్పుడు, అందుకు అది పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. కందుకూరు అనంతం (1901-56) ‘కరుణ కుమార’ కలం పేరుతో కధలు రాసేవారు. రెవెన్యూశాఖలో తాహసిల్దారుగా ఆయన పనిచేసారు. వీరి ‘కొత్త చెప్పులు’ కధలో నెల్లూరు జిల్లా గ్రామీణ జీవనంలో మాదిగల జీవన చిత్రం చూస్తాము.

ఆ కధలోని ఈ ప్రస్తావనలు చూద్దాం:

1. “మా మాదిగోళ్ళ భూములన్నీ సర్కారీ ఈనాం భూముల్లో కల్సిపోతుంటే, మీరేం చేసారు సామి? ఊరికి మాదిగవాడు పనికిరాడా? చాకలోడికీ, మంగలోడికీ, కుమ్మరోడికీ, కమ్మరోడికీ అందరికీ మాన్యాలు ఉంచి, మా మాదిగోళ్ళకి మాత్రం ఎందుకు లేకుండా చేయాలి సామీ, మేం చెయ్యలేము సామీ ఈ చాకిరీ”

2. ‘మాదిగలు పట్టుపట్టారంటే అతి మూర్ఖపు పట్టు వాళ్ళది. హఠం పట్టితే త్రిమూర్తులు దిగివచ్చినా ససేమిరా అనే రకం’

3. “మాదిగవాళ్ళు చేయవలసిన పనిని మమ్మల్ని చేయమంటారేందయ్యా? అని మాలలు అక్కణ్ణించి వెళ్ళిపోయారు’

ఈ రెండు కులాలు గురించిన తెలుగు సాహితీ ప్రస్తావనలోని వైవిధ్యం ఇలా ఉంది. నిజానికి ఈ ఉపకులాల వర్గీకరణ అంశం వెలుగులోకి వచ్చాక, ఈ రెండు కులాల మధ్య వున్న ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక వైరుధ్యం, వీరి వెనకబాటు అంచనా కోసం ప్రభుత్వం ఇప్పటికే ‘ఆంథ్రోపలాజికల్’ (Anthropological) పరిశోధన చేయవలసి ఉంది. సుప్రసిద్ధ భారతీయ సోషల్ అంత్రోపాలజిస్ట్ డా.ఎం.ఎన్. శ్రీనివాస్ చేసిన నిర్ధారణతో, తెలుగునాట మాలల ఉన్నతి మొదటి నుంచి వారికున్న వైదిక మూలాల కారణంగా ఏర్పడింది అనేది స్పష్టం అవుతున్నది. అయితే, మాదిగల వెనుకబాటును నిర్ధారిస్తూ ఇప్పటికి ఒక శాస్త్రీయ అధ్యయనం లేదు. అది జరగవలసి ఉంది. (సశేషం)

Read More
Next Story