సోషల్ మీడియా చేతిలో జర్నలిజం మాయ చేసే మార్కెటింగ్ అయింది
x

సోషల్ మీడియా చేతిలో జర్నలిజం మాయ చేసే మార్కెటింగ్ అయింది

జర్నలిజం నిజాన్ని నిర్భయంగా చెప్తూ అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించే గళంగా చదువుకుంటాం. సోషల్ మీడియా రాకతో ఇదొక మార్కెటింగ్ టూల్ అయిపోయిందా..


నేటి సమాజం లో అధికశాతం ప్రజలు -పిల్లల నుండి వృద్ధుల వరకు – సామాజిక మాధ్యమాలలో[ సోషల్ మీడియా] లో అత్యధిక సమయం గడుపుతున్నారనటం వాస్తవ దూరం కాదు. ప్రత్యక్ష మానవ సంబంధాల స్థానంలో స్మార్ట్ ఫోను స్క్రీను మీద లేక కంప్యూటర్ మానిటర్ మీద, చివరికి గడియారం అద్దం లోను కనపడే బొమ్మలతో చాటింగ్, వాట్సాప్ వీడియోలు, ట్విట్టర్ సందేశాలతోనూ పొద్దు గడపటం సర్వసాధారణమై పోయింది.

వీటికి తోడు యు ట్యూబ్ చానల్‌లో ఎవరైనా, ఏదైనా అప్ లోడ్ చేసే అవకాశం ఉండటంతో ఒకరిని మించి ఒకరు ఏది తోచితే దాన్ని చిత్రించి పెడుతూ ఒక వేలం వెర్రి లాగా తయారు చేశారు. అందువల్ల తమకు ఎక్కువ మంది ప్రేక్షకులుండాలనే దుగ్ధ తో ఈ మీడియాకు కట్టిపడేసేలా ఆకర్షణీయంగా, సెన్సేషనల్‌గా ఒక విషయాన్ని ప్రజలకు అందించటం ఒక వృత్తిగా పాటిస్తున్నారు.

తమ నైపుణ్యాన్ని రకరకాలుగా ప్రదర్శిస్తూ దాన్ని ఒక సంపాదనా మార్గం కూడా మలుచుకున్నారు. ఈ ఆకర్షణలు, పై మెరుగుల గోలలో పడి ఇక కంటెంట్ విషయంలో సత్యమెంత, విశ్వసనీయత ఎంత అనేది గాలికి వదిలేశారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో పేట్రేగిన ఈ జాడ్యం ఈనాడు పెద్ద ప్రచార అస్త్రంగా మారి పోయింది. సామాజిక ఉద్యమాలకు, రాజకీయ ప్రచారానికి కూడా తేలికగా, తక్కువ ఖర్చుతో కొట్లాది మందిని, సత్వరమే చేరుకోగల సౌలభ్యం గల బలమైన సాధనంగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

ఈనాటి ఎన్నికలలో కూడా ప్రధాన ప్రచారవాహికగా మారి పోయింది. దానితో దీనికి ఒక విశ్వసనీయత కల్పించటం అవసరమయ్యింది. ప్రజలకు ఈ సమాచారం నిజమైనదీ, అత్యవసర మైనదీ అన్న భ్రమ కల్పించటం ఎక్కువయ్యింది. వాస్తవం కంటే వాస్తవమని పెంచేలా కంటెంట్ తయారు చేసి విస్తృతంగా ప్రచారంలో పెట్టటంతో ప్రజలు తాము స్క్రీన్ మీద చూసిందంతా నిజమే అనే భ్రమలో పడుతున్నారు. ప్రజలలో వున్న ఈ నమ్మకాన్ని ఆధారం చేసుకుని రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి ప్రత్యేక ఐ టి విభాగాలను నిర్వహిస్తున్నాయి. వాటిలో ప్రతిభా వంతులైన వేలాదిమంది ఉద్యోగులుగా పనిచేస్తూ తమ ప్రచారాస్త్రాలు ప్రయోగిస్తున్నారు.

ప్రధాన మంత్రి మోడీ యు ట్యూబ్ చానల్ కి 2.3 కోట్లమంది సబ్‌స్క్రైబర్స్ వున్నారు. ఇంస్టాగ్రామ్‌లో మోదీకి ఫాలోవర్స్ 8.9 కోట్ల మంది ఉన్నారు. రాహుల్ గాంధీకి సబ్‌స్క్రైబర్స్ 53 లక్షలమంది. భారత్ జోడో యాత్ర తరువాత ఇంస్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ 27 లక్షల మంది అయ్యారు. పీపుల్స్ పల్స్ సంస్థ సమాచారం ప్రకారం ఆయన చేసిన కొన్ని వీడియోలను మూడు కోట్లకు పైగా చూశారు. ప్రముఖ యూ ట్యూబర్ ధృవరాఠి చానల్‌లో గత మూడు వారాలలో బిజెపి వ్యతిరేక విశ్లేషణతో అప్‌లోడ్ చేసిన వీడియోలను 11 కోట్ల మంది చూశారు. తెలుగు రాష్ట్రాలలో 65% మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. తెలంగాణ లో 18-19 వయసు గల కొత్త వోటర్లు 9 లక్షల మంది, ఆంధ్రాలో 10.3 లక్షల మంది వున్నారు. ఈ కొత్త ఓటర్లు మొత్తం సోషల్ మీడియామీద ఆధారపడుతున్నారు.

2024 ఎన్నికల సందర్భంగా మీడియాలో జరుగుతున్నవాటిని పరిశీలిస్తే ఎన్నో విస్తుబోయే నిజాలు అర్ధం చేసుకోగలం. “ప్రపంచ స్థాయిలో మన దేశాన్ని ప్రముఖ స్థానంలో నిలబెట్టాను కనుక నాకు 400 స్థానాలు వస్తాయి, అసలు దేశంలో నాకు ప్రత్యామ్నాయమే లేదు అని ఒకరు మైండ్ గేమ్ మొదలు పెడితే మీడియాలో ఎక్కువ భాగం ఆ పల్లవినే పాడుతున్నారు.

“నేను ఎంతో సంక్షేమం తీసుకువచ్చాను. నన్ను గెలిపించుకోండి. నేను రాకపోతే మీ సంక్షేమం ఆగి పోతుంది. ఇవి నాయకుల మధ్య ఎన్నికలు కాదు. పెత్తందారులకు, పేదవారికి మధ్య పోరాటం. సంక్షేమానికి స్వార్ధానికి మధ్య పోరాటం ఇది వర్గపోరాటం, మీ బిడ్డ మీ ఇంటికి మేలు చేశాడనుకుంటే నాకు ఓటు వేయండి“ అని అభ్యర్ధించినా, “మీ బిడ్డ వయసులో చిన్నవాడు అయినప్పటికీ అనుభవం ఉందని చెప్పుకునే వాళ్ళు చేయలేని మంచి చేశాడు. మరి నాకు 175 సీట్లు ఎందుకు ఇవ్వరు?” అని ఒక నేత దబాయిస్తాడు.

“రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, అభివృద్ధికి ఆమడ దూరం విసిరేసి, రాష్ట్ర ప్రతిష్టను పాతాళంలోకి నెట్టి, పెట్టుబడులు రాకుండా చేశారు. నేను వస్తే సంపద సృష్టించి దాన్ని పేదలకు అందిస్తాను” అని మరో నాయకుడు ఊహల వలలు విసురుతున్నాడు.

సాధ్యాసాధ్యాల గురించి చర్చించకుండా, నిర్దిష్ట కార్యక్రమాల గురించి ఆడగకుండా, పత్రికలు, మాధ్యమాలు నిలువుగా చీలిపోయి వీళ్ల పక్షమే వహిస్తూ, నిజాలను పాతర వేసి, పార్టీల ప్రకటనలనే సర్వ సత్యాలుగా ప్రచారం చేస్తున్నాయి.

విద్య, దారిద్ర్య నిర్మూలన, ఉద్యోగ కల్పన, ఆరోగ్య సంరక్షణ, జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవలసిన ఆర్థిక చర్యలు, దున్నేవానికి భూమి వంటి మౌలిక సమస్యలను, వాస్తవ విషయాలను చర్చనీయాంశాలుగా తప్పించి వేశారు.

హిందూ స్త్రీల మంగళ సూత్రాలు, ముస్లీం స్త్రీల తలాక్ లు, మత రిజర్వేషన్లు, సామరస్యాన్ని దెబ్బతీసే మత వివక్ష పూరితమైన ప్రకటనలు, పనిలో పనిగా పాకిస్థాన్ ఉగ్రవాదం, చైనా విస్తరణ వాదం అంటూ ఒక భావనాత్మక వాతావరణం సృష్టించారు. సామాజిక మాధ్యమాలు ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసే వేదికలుగా మారి పోయాయి.

ప్రజలు, ముఖ్యంగా యువతరం లో ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టటం తో వారు గ్రూపులుగా విడిపోయి పొద్దస్తమానం ఈ సామాజిక విషవలయంలో చిక్కుకు పోయి ఆలోచనా రహితులవుతున్నారు. ప్రచార పటాటోపం తో ఒక సామూహిక మూర్ఖత్వానికి గురవుతున్నారు. ఇదంతా ప్రజాస్వామ్యం పేర , ప్రజాభిప్రాయం పేర జరుగుతుండటం శోచనీయం.

అక్షర జ్ఞానం లేని వారికి చిత్రాలు, వీడియోలు, అరకొర చదువు వున్నవారికి ప్రాంతీయ భాష, యాసలలో చిట్టి సందేశాలు, బాగా చదువుకున్న వారి కోసం ఎక్కడలేని తర్కం ఒలికిస్తూ వ్యాసాలు, బుల్లెట్ వ్యాఖ్యలు, చురకలు, చమత్కారాలు రంగరించి అర్ధ సత్యాలతో వండిన విష పదార్థాలు మీడియా నిండా వడ్డిస్తున్నారు. సెన్సేషనల్ టైటిల్సుతో వీరి కంటెంట్ స్టైల్ పాఠకులను నమ్మించేలా చేస్తుంది. పోలింగ్ పూర్తిఅయ్యాక కూడా ఈ జ్వరాన్ని తగ్గకుండా చూస్తూ తమ రేటింగులు పెంచుకుంటున్నాయి కొన్ని పెద్ద చానల్స్‌తో పాటు అనేక యు ట్యూబ్ చానల్స్. “జూన్ నాలుగు తర్వాత మీ అంతు చూస్తాం” అని చేసుకునే సవాళ్ళు, “కాబోయే ముఖ్యమంత్రి ఆయనే” అనీ “కాదు ఈయన” అని, ఆస్థాన విద్వాంసులయిన అమ్ముడుపోయిన విశ్లేషకుల పరిశీలనల పేరుతోను. నిపుణుల సర్వేలు అంటూనూ, అనేక ఆధార రహిత వార్తలు, తమ ఇష్టాలను, కోరికలను , సత్యాలుగా ప్రచారం చేస్తూ, బెట్టింగ్ వ్యవస్థను పోషిస్తున్నారు.

అనేకసార్లు మనకు తెలిసింది మనం చేస్తున్నది, మనం ఆలోచిస్తున్నది తప్పు అని ఈ మీడియా పండితులు చెప్పేది మాత్రమే సత్యమని మనం పూర్తిగా నమ్మేలా చేస్తుంది. ఈ ప్రభావానికి నిరక్షరాస్యుల నుండి విద్యావంతుల వరకు గురి అవుతున్నారు. ఒక్క రాజకీయ విషయాలే కాదు, ఈ జబ్బు అన్నిసామాజిక రంగాలలోను ముదిరిపోయింది. ఈ పరిస్థితి నే “సత్యానంతర దృక్పథం” అని ఒక పేరు పెట్టి మేధావులు సమర్థిస్తున్నారు.

మన కట్టు, బొట్టు, తిండి తో సహా ప్రతి విషయంలోనూ కలగజేసుకుని, మనం చేస్తున్నదంతా తప్పు అని, వారు అనుకున్నదే సరైనది అని పాఠాలు చెప్పే సమాజంలో మనం జీవిస్తున్నాం. ఒక చారిత్రక నాగరికత గురించిన కథనాల నుంచి ఒక నిర్దిష్ట రకం వంటనూనె వినియోగం వరకు సోషల్ మీడియాలో అనేక కథనాలు వ్యాప్తి చెందుతున్నాయి. వాటిని రాస్తున్నవారు నిజంగా సత్యాన్ని వెలికి తీసిన వారా? విజ్ఞాన సంపన్నులా అంటే అదేమీ కాదు. నీలాంటి, నాలాంటి సామాన్యులే. ఈ రాతగాళ్లు తమ విశ్వాసాలకి, నమ్మకాలకి “ ఏ స్వార్ధంతోనూ కాదు మీ క్షేమం కోరి చెబుతున్నాను” అనే ధ్వనిలో ప్రచారం చేస్తున్నారు.

నిపుణుల సలహాలు, అభిప్రాయాలు, సామాన్యులకు అందుబాటులో లేకపోవటంతోనో, వైద్యం లాంటి రంగాలలో ఫీజు చెల్లించి ఆ జ్ఞానాన్ని పొందవలసి ఉండటంతోనో ఈ ఉచిత సలహాలకు గిరాకీ పెరిగిపోయింది. వీళ్ళు నిజాయితీగా చెబుతున్నట్లు, ప్రజ్ఞావంతులు తమ లాభం కోసమో, స్వప్రయోజనం కోసమొ చెబుతున్నట్లు భావించి, ఈ కుహనా శ్రేయోభిలాషుల కథనాల వలలో చిక్కుకు పోతున్నాము.

"రిఫైన్డ్ ఆయిల్ గురించి చీకటి నిజం" లేదా “ఈ గింజలు రోజూ తింటే కొవ్వు మాయం” “బీరకాయ తింటే డయాబెటిస్ కు శాశ్వత సెలవు” “ములగాకు తో వజ్రకాయం” వంటి సంచలనాత్మక శీర్షికలతో, ఆశలు రేపే ఊరింపులతో నింపుతున్నారు. జలుబు నుండి కాన్సర్ చికిత్స వరకు ఎంతో బలంగా చెబుతారు. “చిటికే లో జబ్బు మాయం” అంటారు. ఎక్కడైనా బెడిసికొడితే మాత్రం ఇది మా స్వానుభవం మాకు ఉపయోగ పడింది, మీకు పనిచేయకపోతే మా బాధ్యత ఏముంది” అంటారు.

ఈ కథనాల పరమ లక్ష్యం- ఒప్పించడం. వారు చెప్పిందే “ అంతిమ సత్యం" అని నమ్మించడం. దానికి వారు బలమైన, తెలివైన, ఆకట్టుకునే వాదనలు చేస్తారు. అంశం లోని వాస్తవికత పై కాక వారి వాదనా నైపుణ్యం పై మనం ఒప్పుకోవడం జరుగుతోంది. అది నిజమా కాదా అని ఆలోచించే అవకాశమే ఇవ్వకుండా ఊదర గొట్టేస్తారు.

“కుమారి ఆంటీ చికెన్ కర్రీ నిజంగా అద్భుతం వుంటుందా?” “బెంగుళూరు రేవ్ పార్టీలో హేమా వుందా లేదా అనే చర్చలలో మునిగి పోతాము. మన చుట్టూ అలాంటి వాదనలే ఉన్నప్పుడు మనం వాటికి తేలికగా,మనకు తెలియకుండానే ఐచ్చికంగానే లొంగిపోతాము.

ఇక ఎన్నికల వాతావరణంలో వారు నిర్మించే సత్యాలకు లొంగి పోవడం ఎంతసేపు ? సత్యం పేర బహుళ కథనాలు చుట్టుముడుతున్న ఒక "సత్యానంతర సమాజం" లో మనం నివసిస్తున్నాము, అందువల్ల “ వాస్తవానికి “ ”పురాణానికి” మధ్య సరిహద్దులు మసక బారిపోతున్నాయి

సోషల్ మీడియా నేడు ఈ సత్యానంతర సమాజానికి ప్రధాన దోహదం చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండటాన్ని, దానిని వినిపించే ఒక వేదిక ఉండటాన్ని ఇష్టపడతారు. పర్యవసానంగా, మనం ఎన్నడూ అడగని సమాచారం వరదలో మునిగి పోతున్నాము. సోషల్ మీడియాలో ఏ అంశానికి సంబంధించిన సమాచార మైనా, పరస్పర విరుద్ధమైన వాదనలతో సహా దొరుకుతుంది. ప్రణాళికా బద్దంగా ఒక్కో కంటెంట్‌ను వైరల్ చేస్తూ సత్యానంతర భావనలను మరింత ముందుకు తీసుకు వెళుతోంది మీడియా.

మనం సాధారణంగా- చూసిన, విన్న, చదివిన విషయాలను నమ్ముతాం. సోషల్ మీడియాలో ఈ మూడు ఒకేసారి జరుగుతున్నాయి. ఇన్ని వేల, లక్షల వ్యూస్ ఉన్నాయంటే ఇది నిజమే అని భావిస్తాము. ప్రింటులో కానీ , అంతర్జాలంలో కానీ కనిపించిన ప్రతిదాన్ని విశ్వసించ కూడదనే ఎరుక లేకపోవటం, "నకిలీ" నుండి సత్యాన్ని వేరు చేయడానికి ఎక్కువ మందిలో ఆసక్తి లేకపోవడం వంటి కారణాలవల్ల నెట్ లో వున్నదంతా నిజమని నమ్ముతున్నాము. అసమానత, వివక్షత, జీవితం పట్ల అభద్రత, ఆదుర్దాలు నిండిన మన సమాజంలో రాజకీయ, సామాజిక-ఆర్థిక ప్రక్రియలు మన ఆలోచనా సంస్కృతిని నిర్దేశిస్తాయి. పక్షపాత రాజకీయాల ప్రాబల్యం కారణంగా ఒకరి నిర్దిష్ట చారిత్రక కథనాన్ని మనం గుడ్డిగా విశ్వసిస్తాము. దీనిని "సమూహ పక్షపాతం" అని అనవచ్చు.

మన చుట్టూ ఉన్న అనేక ఆందోళనలను (నిజమైనవి కావొచ్చు, కల్పించబడినవి కావొచ్చు) ఎదుర్కునే టప్పుడు మనకు ఉపయోగ పడుతుందని చెప్పే దాన్ని "సత్యం" గా మనం విశ్వసిస్తాము. ఉదాహరణకి ఆరోగ్యంగా ఉండాలనేది ప్రతివారి కోరిక. అనారోగ్యం పాలవుతామేమోననే ఆందోళన సర్వ సాధారణం.ఈ కారణంగా కలుషిత వాతావరణం లో మనం తినే ప్రతిదీ "అనారోగ్యకరమైనది""విషపూరితమైనది" అని చెప్పే వారి పోస్టులను మన అనుభవానికి దగ్గరగా వుండటం తో నమ్ముతాము. ఆపైన , చెప్పే వారికన్ని తెలుసని భావించి, ఇక వారు సూచించే ప్రతి ఆకు, అలము ఆరోగ్యకరమైన దనీ, సర్వ రోగ నివారిణి అని విశ్వసిస్తాము.

ప్రస్తుత ఆధిపత్య జ్ఞాన వ్యవస్థలో ఏర్పడిన వ్యాపార శీలత వల్ల ఈ జ్ఞానం పట్ల విశ్వాసం నశిస్తోంది. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయబడుతున్న ప్రత్యామ్నాయ సనాతన "సత్యాల" పట్ల విశ్వాసం పెరుగుతోంది. ఇంటర్నెట్ అనేది అనేక కుట్ర సిద్ధాంతాల భాండాగారం గా తయారయ్యింది.

ప్రతి ఆధునిక విషయం పట్ల అనుమానాలు రేకెత్తించడం, నేటి జీవన విధానాన్ని, ఆలోచనలని తూలనాడటం, సమాజాన్ని తిరోగ మింప జేసి పురాతనమైనదే శ్రేష్టమైనది అన్న భావం కలిగించడం సర్వసాధారణంగా మారింది. చారిత్రక వాస్తవాలను వక్రీకరించి పాఠకు లేని గొప్పదనాన్ని ఆపాడించటం ఒక లక్ష్యం తో జరుగుతోంది.

సత్య మనేది స్థిరమైనది, విశ్వజనీనమైనది కాదు. అది దేశ,కాల మాన పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చెందుతూ వచ్చే ఒక అంగీరించబడిన మానవ జ్ఞానం. అది సాపేక్షంగా నిరూపించబడింది. కానీ ఈ సత్యా నంతర సమాజం అసలు సత్యాలనే విస్మరించి, “కొత్త సత్యాలను నిర్మించి, ప్రసారం చేస్తున్నది” ఈ క్రమం లో అది విసురుతున్న సవాళ్లపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం.

సోషల్ మీడియా వాడకం చాలా పెరిగింది. అది సమాజపు ఆలోచనా విధానాన్ని నియంత్రిస్తున్నది. ఇంత ప్రభావ వంతమైన సోషల్ మీడియా పట్ల ప్రజాస్వామ్య, శ్రేయోరాజ్య నిర్మాణానికి ఉద్యమాలు నిర్మిస్తున్న శక్తులు జాగురూకత వహిస్తున్నాయా? వాస్తవ సమాచారం సమాజానికి ప్రధాన హెచ్చరికగా ఉపయోగ పడుతుంది కానీ అవాస్తవ సమాచారం ప్రజలలో విమర్శనాత్మక ఆలోచనలను క్షీణింప జేస్తుంది. అసత్యాన్నేకాదు, వారికి అవసరమైన ‘సత్యా’న్ని సైతం నిర్మిస్తున్న ఈ సమయంలో మనం జాగ్రత్త పడటం అవసరం.


Read More
Next Story