
పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాగలడా?
ముందు ముందు జనసేన పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల భౌతిక పరిస్థితులు రాక తప్పదు. అప్పటిదాకా వరకు ఓపిక పట్టడం పవన్ కళ్యాణ్ వ్యూహం గా భావించాలి.
తమిళనాడు ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ బాధ్యతలు చేపట్టగానే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు పవన్ కళ్యాణ్ సీఎం కాగలరా లేదా అనే అంశం మన రాష్ట్రంలోం చర్చనియాంశం అయ్యింది. పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారని కొందరు; చెయ్యలేరని మరి కొందరు వాదోపవాదాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్ధులు ఆయనకి వ్యతిరేకంగా రకరకాల వాదనలు తెచ్చి ఆయన అనుచరుల్లో నమ్మకం పోగొట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.ఒక వాదన విఫలం కాగానే మరొక వాదన ముందుకి తెస్తున్నారు. ఒకప్పుడు జనసేన బతకదన్నారు. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం అయ్యి కూర్చుంది.పవన్ కళ్యాణ్ చంద్రబాబుని మొయ్యటం తప్ప సొంతగా నిలబడలేడన్నారు. జనసేన పార్టీ రాష్ట్ర పాలనలో భాగం అయ్యింది. ఇప్పుడు ఆయన ఎప్పటికీ సియం కాలేడని ఇంకో కొత్త వాదన తెచ్చారు. ఈ నేపద్యంలో పవన్ కళ్యాణ్ సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యటానికి అవకాశాలున్నాయా, లేవా ? ఉన్న ఆటంకాలేంటి? అనే ప్రశ్నల్ని statecraft perspective లోనుంచి అర్ధం చేసుకోవాల్సిన అవసరం వుంది
మూడో ప్రత్యామ్నాయాన్ని" సహించలేని” రాజకీయ శైలి:
తెలుగు రాష్ట్రాల్లో "మూడో ప్రత్యామ్నాయాన్ని" సహించలేని సాంప్రదాయ రాజకీయ శైలి ఎంతో కాలంగా వేళ్ళూనుకొని పోయింది . స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 36 ఏళ్ళు(1947-1983) కాంగ్రెస్ ఏకపక్ష పాలన సాగితే, ఆ తర్వాత 43 ఏళ్లు (1983-2024) టీడీపీ, కాంగ్రెస్,వైసీపీల మధ్యే అధికారం చేతులు మారింది. ఈ 79 ఏళ్ల కాలంలో ఆధిపత్య వర్గాలుగా స్థిరపడిన రెండు సామాజిక వర్గాలే రాష్ట్రాన్ని శాసించాయి. మరో బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో సామాన్య ప్రజలు కూడా ఈ రెండు శిబిరాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సి వచ్చింది. ఫలితంగా ప్రజలు కూడా రెండు శత్రు శిబిరాలుగా విడిపోయారు. వాళ్ళూ చాలాకాలం మూడో శక్తిని అవాంఛనియంగానే భావించారు.
ఇక రెండో కారణం—గతంలో 'మూడో ప్రత్యామ్నాయం' కోసం జరిగిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో, ఆ రెండు పార్టీలు తప్ప మరెవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరనే దురభిప్రాయం ప్రజల్లో కూడా బలంగా నాటుకుపోయింది. ఈ మూస అభిప్రాయం రాష్ట్రంలో కొత్త పార్టీలు సాధ్యం కావని , ఒకవేళ వచ్చినా ఆ రెండు పార్టీలని తట్టుకుని బతికి బట్ట కట్టలేవనే అభిప్రాయాన్ని ప్రజల్లో స్థిరపరిచింది. పిఆర్పీ, బియస్పీ లెఫ్ట్ పార్టీల అనుభవాలే ఈ అవగాహనకి కారణం గా తెలుస్తుంది.ఫలితంగా ఆ రెండు ప్రధాన పార్టీలకి ఎదురు లేకుండా పోయింది.దాంతో మూడో పార్టీ స్థాపన అంటేనే నిరుత్సాహ పరిస్థితులు ఏర్పడ్డాయి.
మూస పద్ధతిని సవాలు చేసి బద్దలు కొట్టిన పవన్ కళ్యాణ్
రాష్ట్రం లో మూడో పార్టీ బతకటం అసాధ్యం అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ జనసేనని స్తాపించారు . ఆ మూస రాజకీయాలకి అలవాటు పడ్డ ప్రజలు గత ప్రత్యామ్నాయాల మాదిరిగానే జనసేన కూడా కొద్ది రోజుల్లో కనుమరుగవుతుందని అంచనాలు వేసారు. కానీ, పవన్ కళ్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా నిలబడి, "ఇంతింతై వటుడింతై" అన్నట్లుగా ఆ పాత మూసల్ని పక్కన పెట్టి మూడో ప్రత్యామ్నాయాన్ని విస్మరించలేని ఒక సజీవ వాస్తవంగా నిలబెట్టారు.జనసేన నుంచి ఈ రోజు 21 మంది MLAలు,ఇద్దరు MPలు, ముగ్గురు మంత్రులు అనేక మంది చైర్మన్లు,, డైరెక్టర్లు పాలకులుగా వున్నారు.ఇంకెంతమందో కౌన్సీలర్లుగా వున్నారు. ముఖ్యంగా రాష్ట్ర పాలనలో ప్రతి చోట జనసేన ముద్ర కనపడుతుంది.ఇప్పుడు ఇంకో పార్టీ అసాధ్యం అనే మాట వినపడటం లేదు. పవన్ కళ్యాణ్ ప్రయత్నం ఆంద్రప్రదేశ్ లో రాజకీయ ప్రజాస్వామ్య పరిధిని కొంత విస్తృత పరిచిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో అయన లెక్కకు మించిన ఎదురుదెబ్బలు,కస్టాలు, అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే . ఆ మూస నుంచి రాష్ట్రాన్ని బయటకి తేవటంలో పవన్ కళ్యాణ్ ఆలోచనలు,శ్రమ కీలక పాత్ర వహించాయన్నది నిజం. ఇది కేవలం జనసేనకు మాత్రమె కాకుండు మొత్తం రాష్ట్రానికే మరో ప్రత్యామాయాన్ని అందించినట్టు గుర్తించాలి. గతంలో ఎంతమంది ఆ దిశలో పనిచేసినా పవన్ కళ్యాణ్ మాత్రమె విజయవంతంగా ఆ మూస నుంచి రాష్ట్రాన్ని బయటకి తెచ్చారని చెప్పటం అతిశయోక్తి కాదు.
పవన్‌ను తిట్టండి - పదవులు పట్టండి
పవన్ కళ్యాణ్ ఎదుగుదల తమ పార్టీకి నష్టం కలిగిస్తుందని భావించిన ప్రత్యర్ధి పార్టీ ఆయన ఇమేజ్ ని దెబ్బకొట్టటానికి అనేక రకాలుగా ప్రయత్నించింది. ఆ పార్టీ న్యాయకులతో గుంటూరు,విజయవాడ, చెన్నై ఇంకా అనేక ప్రాంతాలనుంచి డైలీ అత్యంత హేయమైన రీతిలో పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టించి, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చెయ్యటానికి చెయ్యని ప్రయత్నం లేదు. వాళ్ళ సోషల్ మీడియా పవన్ కళ్యాణ్ పై తిట్లు, బెదిరింపులతో నిండి పోయేది. ఆ పార్టీకి చెందిన కొందరు కాకినాడ నేతలు బహిరంగ వేదికలపైనే సంస్కారహీనంగా మాట్లాడటం ప్రజలు ఈసడించుకున్నారు.వీటన్నింటికీ తోడు పవన్ కళ్యాణ్ ని ఎంత ఎక్కువ తిడితే తమకు అంత ఎక్కువ బలం వస్తుందనే ఒక మూర్ఖపు సమీకరణాన్ని ఆ పార్టీ రూపొంద్ఫించుకున్నట్టు అనేక చర్చలు జరిగాయి.ఆ క్రమంలో "పవన్‌ను తిట్టండి - పదవులు పట్టండి" అనే అలిఖిత ఆదేశం ఆ పార్టీ అధినాయకత్వం నుంచే వచ్చినట్లు ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. ముఖ్యంగా-గతంలో ప్రజారాజ్యం పార్టీ (PRP) సమయంలోనూ, మొన్న 2024 ఎన్నికల సమయంలోనూ ఆ పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కుటుంబంలోని మహిళలను భరించలేని రీతిలో మాట్లాడారు..ఆ పార్టీ నాయకుల అండదండలతో కొందరు గుంటూరు కి చెందిన గుండాలు ప్రజల్ని బహిరంగంగానే భయభ్రాంతులకి గురిచేసినట్టు ప్రజల్లోకి వచ్చింది. అలాంటి అరాచక పరిస్థితులకి అడ్డుకట్ట వెయ్యటానికి పవన్ కళ్యాణ్ నడుం కట్టి కూటమిని ఏర్పాటు చేసారని అర్ధం అవుతుంది. అప్పటి పరిస్థితులకి దానికే అయన ప్రాధాన్యత ఇచ్చినట్టు గుర్తించాలి.ఆ పరిస్థితుల్లో ఆయన తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయమే నేడు రాష్ట్రంలో ఈ రాజకీయ మార్పులకి నాంది పలికింది.
జనసేన పుట్టింది చంద్రబాబుని మోయ్యటానికేనా?
పవన్ కళ్యాణ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని బలంగా వెన్నంటి ఉండటంవల్లనూ ,కూటమిలో చంద్రబాబు సియం కావటం వల్లనూ ఆయన రాజకీయ ప్రత్యర్ధులు జనసేన పుట్టింది టిడిపి ని మోయ్యటానికే అనే ప్రచారాన్ని మొదలు పెట్టారు.“నేను సీఎం పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదు" అని పవన్ కళ్యాణ్ గతంలో అన్న మాటలను, ఆయన రాజకీయ ప్రత్యర్థులు జనసేన శ్రేణుల్లో నిరాశ నింపడానికి ఆయుధంగా వాడుకుంటున్నారు. అలాగే "కూటమి ప్రభుత్వం పదిహేనేళ్ల పాటు కొనసాగాలి" అని ఆయన ఆకాంక్షించడాన్ని సాకుగా చూపిస్తూ, 15 ఏళ్ల తరువాత ఆయనకి 70 ఏళ్ళు వస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ రాజకీయాలు అప్పటితో అయిపోతాయని సిద్దాంతీకరిస్తున్నారు. ఎన్నికల్లో 21 అసెంబ్లీ స్థానాలతో సర్డుకుపోవటం కూడా చంద్రబాబుని మోయ్యటానికేనని వారు ప్రచారం చేస్తున్నారు.
కానీ, కొంచెం తార్కికంగా ఆలోచిస్తే, ఏ రాజకీయ నేత అయినా మరో పార్టీని మోయడం కోసం సొంతంగా పార్టీ పెడతారా? అదేమన్నా సరదానా? వేరే ఎవరికోసమో కుటుంబ సభ్యులని తిట్టించుకుంటారా? పైగా ఆంధ్రప్రదేశ్ లాంటి 'కత్తి మీద సాము' లాంటి రాజకీయ వాతావరణంలో, కేవలం వేరే పార్టీని గెలిపించడం కోసం ఎవరైనా తన సర్వస్వాన్ని పణంగా పెట్టి రంగంలోకి దిగుతారా? జనసేన స్థాపించిన నాటి నుండి పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న రాజకీయ దాడులు, ఆయన వ్యక్తిత్వ హననానికి జరిగిన కుట్రలు ప్రజలు చూసారు.ఇంకొకరి కోసం ఇంటి ఆడపడుచుల గౌరవం దెబ్బతినే రీతిలో మాటల్ని భారిస్తారా? అనేది ఇక్కడ అసలైన ప్రశ్న.
మరి పవన్ కళ్యాణ్ మాటల్లోని ఆంతర్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన వ్యాఖ్యల వెనుక ఉన్నది "అధికార దాహం " కాదు, ఒక "ఆశయ సాధన కోసం తపన " అని విశ్లేషణలు చెపుతున్నాయి. సీఎం పదవి కోసం రాలేదంటే, ఆ పదవి తనకు వద్దని కాదు; కేవలం పదవిని అనుభవించడం కంటే, ఆ పదవి ద్వారా ప్రజలకు సేవ చేయటం ముఖ్యమని చెప్పడం ఆయన ఉద్దేశం అని గ్రహించాలి. అలాగే, "15 ఏళ్ల పొత్తు" అంటే.. పదిహేనేళ్ల పాటు టిడిపి ని భుజాన మోస్తారని కాదు. ఆ కాలమంతా ఇరు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకుంటూ, రాష్ట్రం కోసం నిలబడాలని అర్థం. ఈ పొత్తులో ఎవరూ ఎవరినీ మోయడం వుండదు. ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవటమే లక్ష్యంగా వుంటుంది. ఆయనే చంద్రబాబుని మోస్తుంటే ప్రజలు అతన్ని ఎందుకు అనుసరించాలి? డైరెక్ట్ గా చంద్రబాబు పార్టీలోనే చేరితే సరిపోలా? అని ఇంకో వాదన తెస్తున్నారు. మొయ్యటానికి,పంచుకోవటానికి మధ్య వున్నా తేడా తెలుసుకుంటే ఈ వాదనలు అర్ధరహితమని తేలిపోతుంది. ఆ విధంగా 2024 ఎన్నికలలో కేవలం అధికారం కోసం కాకుండా, ఆ నాటి అధికార పార్టీ అరాచకాలను అంతమొందించడం పవన్ కళ్యాణ్ ఒక 'మిషన్' లాగా భావించారని అవగతమౌతుంది.
ఆ సందర్భంలో రాష్ట్ర రక్షణ అనే ఒకే ఒక్క ప్రత్యేక లక్ష్యం కోసం, అవసరమైతే 21 సీట్లకంటే తక్కువ సీట్లకైనా పవన్ కళ్యాణ్ సర్దుకుపోయేవారేమో అనిపించింది కూడా. అయితే ఆ 21 సీట్ల వ్యూహం కేవలం 2024 ఎన్నికల వరకి మాత్రమే గమనించాలి. ఒక వైపు కూటమిని చూసుకుంటూనే మరోవైపు రాబోయే రోజుల్లో మొదటి ప్రత్యామ్నాయంగా తన పార్టీని అభివృద్ధి చేసుకోవటం కోసం అయన ప్రణాలిళికల్ని సిద్ధం చేసుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో పాలక కూటమి పవన్ కళ్యాణ్ మానస పుత్రిక అని అందరికి తెలుసు . దాని ఏర్పాటుకు తానే ప్రధాన సూత్రధారి అనీ తెలుసు . సంకీర్నంలోకి వెళ్ళాక మిత్ర పక్షాల మధ్య అప్పుడప్పుడు కొన్ని పొరపొచ్చాలు,ఇబ్బందులు రావటం సహజం. వాటిని సర్దుకు పోవటం కూడా అంతే అవసరం . దాన్ని "ఇంకొకరిని మోయడం" ఆనటం సరికాదు. ఒకవేళ దాన్ని ఒప్పుకుంటే పవన్ కళ్యాణ్ ని కూడా చంద్రబాబు మోస్తున్నాడని ఒప్పుకోవాలి. గత ఎన్నికల్లో ఆయన లక్ష్యం వేరే ఉండింది . కేవలం ఒక పదవి కోసం కాకుండా ఒక నూతన రాజకీయ సంస్కృతి( political culture)కి అయన నాంది పలికే ప్రయత్నం చేసాడు.
పవన్ కళ్యాణ్ ఎప్పటికీ సియం కాలేరా?
జనసేన పార్టీ బలంగా నిలబడింది కాబట్టి ఇప్పుడు చర్చని “పవన్ కళ్యాణ్ - భవిష్యత్తులో సీఎం అవుతారా లేదా?" అనే వైపునకు మళ్ళించారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలు పవన్ కళ్యాణ్ సియం అయ్యే అవకాశాలు లేవు అనే ప్రచారాన్ని చేస్తున్నాయి..ఈ ప్రచారాన్ని ఒక పార్టీ బహిరంగంగానే చేస్తుంటే మరొక పార్టీ చాప కింద నీరులా ప్రచారం చేస్తుంది.. దీనికి కారణం జనసేన ఎదుగుదల భవిష్యత్తులో ఆ రెండు పార్టీల వోటు cut చేస్తుందేమోననే అనుమానం. పవన్ కళ్యాణ్ సియం కారని చెప్పటానికి వాళ్ళు కొన్ని వాదనలు చేస్తున్నారు: . జగన తో పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోరని, , ఆయనకు ఉన్న ఒకే ఒక్క ప్రత్యామ్నాయం చంద్రబాబు మాత్రమేనని కూటమి వుంటే టిడిపి వారే సియంగా ఉంటారని పవన్ కళ్యాణ్ సియం కాలేడనిని వాదిస్తున్నారు.. అలా అనుకోవటం రాజకీయ అపరిపక్వత అవుతుంది. అనేక రాష్ట్రాల్లో ఈ అవగాహన తప్పని ఇప్పటికే తేలిపోయింది. ఆంధ్రలో రాష్ట్రంలో సంకీర్ణ రాజకీయాలు పరిణతి చెందే క్రమంలో, జనసేన పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల భౌతిక పరిస్థితులు రాక తప్పదు. ఐయితే దానికి కొంత సమయం పట్టవచ్చు. అప్పటివరకు వరకు ఓపిక పట్టడం పవన్ కళ్యాణ్ వ్యూహం గా భావించాలి.
ఇక ప్రత్యర్థులు చేసే రెండో వాదన: "చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు టీడీపీ అత్యంత బలహీనపడింది. ఆ సమయంలో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఉంటే పవన్ సియం అయ్యేవాడు. కానీ పవన్ ఆ అవకాశాన్ని చంద్రబాబు కి వదిలేసారు. సియం కావాలనుకునే వారు ఇంత మంచి అవకాసం వదులుకుంటారా?” అనేది ఇింకో విమర్శ. కానీ అప్పట్లో టీడీపీ తాత్కాలికంగా ఇబ్బందుల్లో పడిన మాట నిజమే కానీ , ఆ స్థానాన్ని పూర్తిగా భర్తీ చేసే (Replace) స్థాయికి జనసేన ఎదగలేదు. ఆ ఎన్నికల్లో కూటమి లేకుండా జనసేన ఒంటరిగా వెళ్లుంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయేది. అది జరగకుండా చూడటమే తన లక్ష్యమని పవన్కళ్యాణ్ అనేక సార్లు చెప్పటాన్ని ఇక్కడ గుర్తించాలి.అంతే కాక చంద్రబాబుని కక్షపూరితంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అయన నమ్మాడు. ఆ బలహీన పరిస్థితిని తన సొంత ప్రయోజనాలకి వాడుకోవటం అనైతికం అనే భావన కలిగినట్కూటు అయన చెప్డాపటం గమనార్హం.
ఈ దిశలో మూడో వాదన: "రాబోయే 2029 ఎన్నికల్లో కూడా కూటమి కొనసాగితే, జనసేనకు గతంలో కంటే మరో నాలుగు సీట్లు ఎక్కువ రావచ్చు. అంటే 25 నుండి 30 స్థానాల లోపు దక్కవచ్చు. అందులో గెలిచేవి ఎన్నో ఇప్పుడే చెప్పలేం. జనసేనని వాడుకుని ప్రస్తుతం టీడీపీ క్షేత్రస్థాయిలో బాగా పుంజుకుంది కాబట్టి, సహజంగానే జనసేన కంటే నాలుగు రెట్లు ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది. అంత పెద్ద పార్టీగా అవతరించాక టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం పదవిని వదులుకోదు. కాబట్టి ఎలా చూసినా పవన్ కళ్యాణ్‌కు సీఎం అయ్యే అవకాశం లేదు." పైకి ఇది ఒక గణంక విశ్లేషణలా కనిపించినప్పటికీ, నిజానికి ఇది కేవలం తన ప్రత్యర్థుల 'విష్‌ఫుల్ థింకింగ్' లాగ కనిపిస్తుంది.. నిజానికి కొంచెం చరిత్రను తిరగేస్తే.. మన దేశ రాజకీయాల్లో చిన్న పార్టీలు లేదా తక్కువ సీట్లు ఉన్న పార్టీల నేతలు ముఖ్యమంత్రులు, ప్రధానులు కావటం కొత్తేమీ కాదు. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మరియు ఇటీవల మహారాష్ట్ర రాజకీయాలను గమనిస్తే ఆ వాదన సరి కాదని తేలిపోతుంది. నిజానికి రాజకీయాల్లో ఒక్క గంట వ్యవధిలోనే అద్భుతాలు, అనూహ్య మార్పులు జరుగుతాయని సమకాలీన చరిత్ర మనకు పదే పదే నిరూపించింది.
ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి స్థాయి సంకీర్ణ రాజకీయాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. రాబోయే 15 ఏళ్ల కాలంలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో ఎన్నెన్నో మార్పులు, చేర్పులు, సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తాయి..జనసేన లాంటి పార్టీ కూడా శాశ్వతంగా ఒకే స్థానంలో ఉండిపోదని ఇప్పటికే నిరూపితమైంది. కాబట్టి, ప్రస్తుత సీట్ల సంఖ్యను బట్టి పవన్ కళ్యాణ్ భవిష్యత్తును అంచనా వేయడం రాజకీయాల ప్రాథమిక సూత్రాలకే విరుద్ధం. రాజకీయాల్లో ఏ క్షణంలోనైనా ఎలాంటి మార్పులైనా జరగొచ్చు. అన్ని పరిస్థితులు అనుకూలించే వరకు ఓపిక పట్టాలనేదే పవన్ కళ్యాణ్ సుదీర్ఘ రాజకీయ ఆలోచనలా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పట్టుదల, ఓపిక, సహనం, వ్యూహాలు గమనిస్తే తన పార్టీ రాష్ట్రంలో సొంతగా ప్రభుత్వాన్ని స్థాపించే వరకు విశ్రమించడని అర్ధమౌతుంది. ఇప్పటివరకు ఆయన అడుగుల్ని గమనిస్తే భవిష్యత్తులో ఆయన రాజకీయ వ్యూహాలు, నిర్ణయాలు బలంగా,వేగంగా ఉంటాయని ఊహించ వచ్చు.
పవన్ కళ్యాణ్ ముందున్న ప్రత్యామ్నాయాలు
నిజానికి ముఖ్యమంత్రి కావటానికి పవన్ కళ్యాణ్ ముందు ఇప్పుడు కూడా కొన్ని ప్రత్యామ్నాయాలు వున్నాయి. అయితే అడ్డ దారుల్లో కాకుండా ,ఒక సామరస్య పద్ధతి ద్వారానే,అన్ని వర్గాల్ని కలుపుకొనే అయన అధికారాన్ని చేపట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దేశంలో రాజకీయ పరిణామాల్ని , రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్ గ్రాఫ్ ని స్టడీ చేస్తే ఆయన సియం కావటం ఎంతో దూరం లేదని అంచనా వెయ్యొచ్చు. మొదట ఆయనేం చేయలేడన్నారు; పార్టీ పెట్టి చూపించాడు. పార్టీ మూసేస్తాడన్నారు; మూడో ప్రత్యామ్నాయానికి పార్టీని పెంచాడు. ఏమీ సాధించ లేడన్నారు. ఈ రోజు రాష్ట్ర పాలనలో భాగం పంచు కుంటున్నాడు . గతంలో పేరుకి మాత్రమె ఉపముఖ్య మంత్రులు వుండేవారు.ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే ఏంటో చూపిస్తున్నాడు.ఆ పదవి రాజ్యాంగంలో లేదన్నారు. అతని వల్ల ఆ పదవికి అంతకు మించిన గౌరవం దక్కింది. రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందని చెప్పటానికి ఇంతకంటే ఎక్కువ ఆధారాలు అవసరం లేదు. అతిక్లిష్టమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని మునుపెన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ ప్రభావితం చేస్తున్నాడని చెప్పటంలో సందేహం లేదు. అందువల్లనే పవన్ కళ్యాణ్ ను దేశలోనే అత్యంత ప్రభావశీలురైన అతి కొద్ది మంది రాజకీయ దురంధరుల్లో ఒకరుగా నేడు రాజకీయ పరిశీలకులు పరిగణిస్తున్నారు. గత ఎన్నికల్లో తన వ్యూహాత్మక నిర్ణయాలతో రాజకీయాలను ఒక చారిత్రాత్మక మలుపు తిప్పిన నాయకుడు ముఖ్యమంత్రి కావద్దని ఎందుకు అనుకుంటాడు ? ఎవరికీ ఇష్టం వున్నా లేకపోయినా ఆయన ముఖ్యమంత్రి అవటానికి కొంత కాలం పట్టొచ్చేమోగానీ కావటం మాత్రం తప్పదు.
(ప్రొఫెసర్ శ్రీపతి రాముడు,డైరెక్టర్/హెడ్ , సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ సోషల్ ఇంక్లూజన్, హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీ)
(The Federal seeks to present views and opinions from all sides of the spectrum. The information, ideas or opinions in the articles are of the author and do not necessarily reflect the views of The Federal)

