
కొత్త పింఛన్లు ఎప్పుడు సారూ..
కొత్త అనుమతి ప్రభుత్వానికి అసలైన సవాల్! ఆశగా ఎదురు చూస్తున్న 12 లక్షల మంది కళ్లు ..
ప్రభుత్వం మారిన తరువాత పింఛన్ల పెంపుతో పండగ వచ్చింది. వేలాది మంది కళ్లల్లో మాత్రం ఇంకా నిరీక్షణే మిగిలి ఉంది. 'ఎన్టీఆర్ భరోసా' కింద పెంచిన పింఛన్ అందుతున్న పాత లబ్ధిదారుల సంతోషం ఒకవైపు కనిపిస్తుంటే, దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్నా 'అనుమతి' రాని కొత్త దరఖాస్తుదారుల ఆవేదన మరోవైపు కనిపిస్తోంది. కొత్త పింఛన్ల పోర్టల్ ఎప్పుడు తెరుస్తారని పండుటాకులు కళ్లలో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నాయి.
వయసు పైబడిన భారంతో.. ఆశగా ఎదురుచూస్తున్న పండుటాకులు:
రాష్ట్రంలో సుమారు 63 లక్షల మంది ఇప్పటికే ఈ ఫలాలను అందుకుంటున్నప్పటికీ, మరో 12 లక్షల మంది అర్హులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. రీ సర్వేలో సుమారు లక్ష మంది వరకు అనర్హులను గుర్తించారు. ఆ సంఖ్య ఇంకా అధికంగా ఉంటుందనేది ప్రభుత్వ సందేహం. దీనివల్ల కొత్త పింఛన్లకు దరఖాస్తులు తీసుకోవడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందని చెబుతున్నా, ఆర్థికభారం వల్లే ఆచుతూచి వ్యవహరిస్తున్నట్లు పరిస్థితి చెక్కచనే చెబుతోంది.
"సామాజిక పింఛన్లలో వృద్ధుడిగా ఉన్న భర్త చనిపోతే ఆ స్థానంలో భార్యకు ఇవ్వడానికి మాత్రమే సాంకేతికంగా అవకాశం ఉంది" అని డీఆర్డీఏ ఏపీడీ వీణా వెంకటేశ్వరప్రసాద్ చెప్పారు. జిల్లాలో కనీసంగా వారానికి డివిజన్, జిల్లా స్థాయిలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ కు కనీసంగా 200 దరఖాస్తులు వస్తుండవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.
2025 మార్చి 25 : Ycp ప్రభుత్వంలో 65.18 లక్షల పింఛన్లు ఇచ్చారు. తమ ప్రభుత్వం 63.71 లక్షల పింఫన్ల ఇస్తోందని సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీలో ప్రకటించారు. మే నెల నుం, 93 వేల మంది వితంతువులకు కొత్త పింఛన్లు ఇస్తామని చెప్పినా, సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. ఆయన ప్రకటన ప్రకారం రాష్ట్రంలో ఐదు లక్షల మంది పింఛన్లకు అనర్హులుగా గుర్తించారు.
రాష్ట్ర జనాభాలో 12.88 శాతం ప్రజలకు సామాజిక పింఛన్లు ఇస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పి ఏడాది కావస్తున్నా, ఇంతవరకు కార్యాచరణ ప్రారంభం కాలేదు. దీంతో అర్హులకు నిరీక్షణ తప్పడం లేదు.
కూటమికి మైలేజ్ తెచ్చిన పింఛన్ల..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సామాజిక పింఛన్ల పంపిణీలో నూతన అధ్యాయం అనడం కంటే, పింఛన్ల మొత్తం పెంపు కూటమి ప్రభుత్వానికి పెద్ద మైలేజీ తెచ్చింది. ఒకేసారి రూ. 4 వేలకు పింఛన్ పెంచి వృద్ధులు, వితంతువుల ఇళ్లలో వెలుగులు నింపిన మాట వాస్తవం. ఈ వెలుగులు కేవలం పాత లబ్ధిదారులకే పరిమితమయ్యాయా? అనే సందేహాలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలో 29,86,023 మంది వయోవృద్ధులకు నెలకు నాలుగు వేల వంతున 1,194.41 కోట్లు, 7,65,820 మంది దివ్యాంగులకు ఆరు వేలు వంతున రూ.459.49 కోట్ల రూపాయలు, వితంతువులు 17,35,963 మందికి నాలుగు వేల వంతున 694.39 కోట్ల రూపాయలు పింఛన్లు ప్రతినెలా చివరిలో పంపిణీ చేస్తున్నారు.
హామీ సాకారం చేసిన సీఎం.
అధికారంలోకి రాగానే వృద్ధాప్య, వితంతు పింఛన్లు పెంచుతాం అని 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే..
2024 జూన్ నెలలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు ఈ పింఛన్ల పెంపు ఫైల్‌పై సంతకం చేశారు.
వృద్ధాప్య, వితంతు పింఛన్లు: రూ. మూడు వేల నుంచి రూ. నాలుగు వేలకు పెంచారు.
దివ్యాంగుల పింఛన్లు: రూ. మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచారు.
వికలాంగులకు: పూర్తిగా మంచానికే పరిమితం, లేదా తీవ్ర వైకల్యం ఉన్నవారికి పింఛన్ రూ. ఐదు వేల నుంచి రూ. 15 వేలు, కొందరికి రూ. పది వేలు చెల్లిస్తున్నారు.
2024 ఏప్రిల్ నుంచి వర్తిస్తుందని ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు జూలై ఒకటో తేదీ పంపిణీ చేశారు. ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలను (నెలకు రూ. వెయ్యి, చొప్పున ₹3,000) కలిపి మొత్తం రూ. ఏడు వేలు ఒకేసారి లబ్ధిదారులకు అందించారు.
కొత్త వారికి నిరీక్షణ
2024 ఎన్నికల మేనిఫెస్టో: అధికారంలోకి రాగానే ఏటా క్రమబద్ధమైన సర్వేలు నిర్వహించి అర్హులందరికీ కొత్త పింఛన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు హామీ ఇచ్చారు. పింఛను మొత్తం పెంచడంలో కూటమి తన హామీని అమలు చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిపై చూపకపోవడం ఇప్పుడు విమర్శలకు దారితీస్తోంది.
"కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత సూపర్ 6 హామీల్లో భాగంగా పింఛన్ మొత్తం పెంచింది. కొత్త పింఛన్లకు అనుమతి ఇవ్వలేదు" అని తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ వివరించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వేలాది మంది అర్హులు, ప్రభుత్వం నుంచి 'గ్రీన్ సిగ్నల్' రాక, సచివాలయాల చుట్టూ తిరుగుతూ నిరాశతో వెనుదిరుగుతున్నారు.
రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది సామాజిక పింఛన్ల కోసం నిరీక్షిస్తున్నారు. డీఆర్డీఏ పీడీ ఒకరు ఈ విషయాన్ని అనధికారికంగానే ధృవీకరించారు. "సామాజిక పింఛన్ల పోర్టల్ లో ఆ దరఖాస్తులు నమోదు చేసే అవకాశం లేకపోవడం వల్ల నిర్దిష్టంగా ఎన్ని పెండింగ్ లో ఉన్నాయనేది చెప్పడం కష్టం" అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తక్కువ అనుకున్నా.. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు తక్కువలో తక్కువ అంటే 12 లక్షల మంది వరకు కొత్త పింఛన్ల కోసం ఇచ్చిన దరఖాస్తులకు మోక్షం లభించలేదు.
"బడ్జెట్ కేటాయింపులు, పింఛన్ల పంపిణీతో పెరిగిన ఆర్థిక భారం వల్లే ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరులో తాత్సారం చేస్తోంది" అనే మాటలు వినిపిస్తున్నాయి. జాప్యానికి ప్రధానంగా రెండు కారణాలు చెబుతున్నారు. గ్రామ సచివాలయిలు, నగరాల్లో వార్డు సచివాలయల సిబ్బంది నిర్వహించిన సర్వేలో లోపాలు ఉండడం, డేటా సరిగా నమోదు చేయడంలో సమస్య వల్ల అర్హుల ఎంపికలో ఇబ్బంది ఏర్పడినట్టు ప్రభుత్వం చెబుతోంది.
రీ సర్వేతో వెలుగులోకి..
టీడీపీ కూటమి ప్రభుత్వం 2025లో ఎంపిక చేసిన పంచాయతీల్లో మాత్రమే రీ సర్వే చేయించింది. దీంతో 80 వేల నుంచి లక్ష మంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేస్తున్నారనే విషయం వెలుగుచూసింది. ప్రధానంగా దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలకు సంబంధించి సమర్పించిన నివేదికల్లో తేడా ఉందనే విషయాన్ని గుర్తించారు. దీంతో అప్పటి నుంచి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్ లైన్ పోర్టల్ ఓపెన్ చేయడం లేదు.
ఇదో ఉదాహరణ..
1. తిరుపతి జిల్లా చంద్రగిరి, శ్రీకాళహస్తి పరిసరాల్లో వైసీపీ ప్రభుత్వ కాలంలో రాజకీయ సిఫార్సులతో మంజూరు చేసిన పింఛన్ల వ్యవహారం బయటపడింది. సచివాలయ సిబ్బంది తనీఖీల్లో సుమారు 400 మందికి పైగా పింఛన్లను తాత్కాలికంగా నిలిపివేసి, తిరిగి వైద్య పరీక్షలకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
2. రీ-సర్వేలో భాగంగా రేషన్ కార్డులు డేటా అనలిటికల్స్ ద్వారా కొన్ని లోపాలు కూడా గుర్తించారు. కొందరు లబ్ధిదారుల పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా భారీగా ప్రయోజనం పొందుతున్నా పింఛన్ తీసుకుంటున్నట్లు బయటపడింది. దీంతో వారిని "బోగస్" లబ్ధిదారులను గుర్తించి జాబితా నుంచి తొలగించారు. తద్వారా పింఛన్లకు అర్హత లేకుండా పోయింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ కారణాల నేపథ్యంలో సామాజిక పింఛన్లపై పూర్తి స్థాయిలో సర్వే చేయించిన తరువాత కానీ, కొత్తగా దరఖాస్తులకు ఉండబోదనేది ఓ అధికారి చెప్పిన మాట.
అనర్హులను గుర్తించడానికి నిర్వహించిన రీ సర్వే తరువాత కడప జిల్లాలో 2.79 లక్షల మందికి 122 కోట్ల రూపాయలు పింఛన్లుగా పంపిణీ చేస్తున్నట్లు డీఆర్డీఏ ఏపీడీ వీణా వెంకటేశ్వరప్రసాద్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న వారిలో చాలా మంది పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రభుత్వం స్పందిస్తుందా? ఈ నిరీక్షణకు ఎప్పుడు తెరపడుతుంది? అనే ప్రశ్నలకు త్వరలో సమాధానం దొరకడం కష్టమే.
Next Story

