
’మీరు పాలకులు కాదు..సేవకులు‘
అధికారుల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ప్రజలను ప్రతిపక్షాల్లా భావిస్తున్న అధికారుల గర్వపు కోటలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విరుచుకుపడింది. న్యాయస్థానపు తీర్పులను ఆఫీసు అల్మారాల్లో మూలన పడేస్తే.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ అవధానం హరిహరనాథ శర్మల ధర్మాసనం తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) ఉపాధ్యాయుల అర్ధంతర తొలగింపుపై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును అమలు చేయకపోగా, కోర్టుకు ఇచ్చిన హామీని కూడా తుంగలో తక్కిన అధికారుల వైఖరిపై ధర్మాసనం సుమోటోగా కోర్టు ధిక్కార అస్త్రాన్ని ప్రయోగించింది. వ్యవస్థలను అపహాస్యం చేస్తున్న అధికార గణం తీరును ఎండగడుతూ, సామాన్య ప్రజల పట్ల పాలకుల వలె వ్యవహరిస్తున్న వారి ధోరణిని న్యాయస్థానం నిలదీయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) పని చేస్తున్న పార్ట్‌టైం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ల (PGT)ను అధికారులు ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా వారిని అర్ధంతరంగా విధుల నుంచి తొలగించడంతో ఈ వివాదం ముదిరి న్యాయస్థానం మెట్లెక్కింది. బాధితుల పక్షాన నిలిచిన హైకోర్టు సింగిల్ జడ్జి, వారి సేవలను తక్షణమే కొనసాగించాలని స్పష్టమైన మధ్యంతర ఆదేశాలు గతంలో జారీ చేశారు. అయితే, వ్యవస్థలను శాసించే పాలకులమని భావించిన అధికారులు, కోర్టుకు ఇచ్చిన హామీని సైతం తుంగలో తొక్కి ఆ ఉత్తర్వులను అటకెక్కించారు. న్యాయవ్యవస్థ ఆదేశాలనే బేఖాతరు చేసిన అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణిస్తూ సుమోటో గా తీసుకుని కోర్టు ధిక్కార కేసును నమోదు చేసిన హైకోర్టు బుధవారం దీనిపై విచారణ చేపట్టింది.
అధికారులు ఆ విషయాన్ని మరిచారు
అధికారులు తాము ప్రజా సేవకులమనే విషయాన్ని మరిచి, పాలకులమని భ్రమిస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది. అధికారులందరూ ఒక కుటుంబంలా కలిసిపోతారు.. కానీ సామాన్య ప్రజలను మాత్రం ఎల్లవేళలా ఓ ప్రతిపక్షంలా చూస్తుంటారు అంటూ ధర్మాసనం ఘాటుగా విమర్శించింది. కోర్టులు ఏం చేస్తాయిలే అనుకునే అధికారులను ఎవరూ కాపాడలేరని హెచ్చరించింది. ఇది రివ్యూ మీటింగ్ కాదని ఇది కోర్టు అని గుర్తుంచుకోండి అంటూ హెచ్చరించింది. ఈ క్రమంలో కోర్టుకు హాజరైన ఎస్.ఎస్.ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావుపై ధర్మాసనం మండిపడింది. కింది స్థాయి సిబ్బంది వల్లే అమలు కాలేదని పీడీ చెప్పగా, నోటీసులిచ్చి సరిపెట్టుకుంటారా అని నిలదీసింది. కోర్టు అడిగిన ప్రశ్నలకు దాటవేత ధోరణి ప్రదర్శించగా, ఇది మీ అధికారుల రివ్యూ మీటింగ్ కాదు.. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పండి అని ధర్మాసనం హెచ్చరించింది.
ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. అమలుపై లేదు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై కూడా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజాధనంతో తీసుకొచ్చే పథకాలను కేవలం ప్రచారం కోసం వాడుకుంటున్నారు తప్ప, వాటి అమలును పట్టించుకోవడం లేదని కేంద్ర తీరును తప్పుబట్టింది. ప్రభుత్వాలు బాధ్యతల నుంచి తప్పుకున్నా, న్యాయస్థానాలు మాత్రం ప్రజల పట్ల తమ బాధ్యతను విస్మరించబోవని స్పష్టం చేసింది.
ప్రభుత్వ న్యాయవాదికి చివాట్లు
అధికారుల చర్యలను సమర్థించడానికి ప్రయత్నించిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది విష్ణుతేజపై కూడా ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కార కేసుల్లో అడ్వొకేట్ జనరల్ కార్యాలయం అధికారులను సమర్థించేలా కాకుండా, నిజానిజాలు వెలికితీసే ప్రాసిక్యూటర్‌లా వ్యవహరించాలని సూచించింది. ఈ వ్యవహారంలో సింగిల్ జడ్జి ఆదేశాల అమలుకు తీసుకున్న చర్యలపై అఫిడవిట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశిస్తూ, తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

