MLC Ananta Babu and his Wife
x

హైడ్రామా మధ్య వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్!

సాక్షులను బెదిరిస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఈ ఆకస్మిక చర్యకు దిగారు..


డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు (అనంత ఉదయభాస్కర్)ను పోలీసులు కొద్దిసేపటి కిందట అరెస్ట్ చేశారు. సర్పవరం సీఐపై వేటు పడిన ఒక్క రోజులోనే ఈ అరెస్ట్ కావడం గమనార్హం. ఆయన అరెస్టుతో రాజమహేంద్రవరం కోర్టు పరిసరాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బెయిల్‌పై ఉన్న ఆయన సాక్షులను బెదిరిస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు ఈ ఆకస్మిక చర్య తీసుకున్నారు. మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆయన నిందితుడు.
హైడ్రామా మధ్య అరెస్ట్
డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. దీనికిఆయన తన భార్య లక్ష్మీదుర్గతో కలిసి శుక్రవారం రాజమహేంద్రవరం కోర్టుకు వచ్చారు. విచారణ ముగిసిన అనంతరం ఆయన కోర్టు గడప దాటి బయటకు రాగానే, అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు అనంతబాబును చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టుకు కారణం...
సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన సాక్షులను అనంతబాబు ప్రభావితం చేస్తున్నారని, వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సాక్షులను బెదిరించిన కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వెంటనే కాకినాడలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అరెస్టు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా కోర్టు సముదాయం చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. బాధితుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు సాక్షుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఈ అరెస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.
2022లో తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను హత్య చేసి, మృతదేహాన్ని స్వయంగా తన కారులోనే ఇంటికి తీసుకువచ్చిన ఆరోపణలను అనంతబాబు ఎదుర్కొంటున్నారు. అప్పట్లో ఈ 'బాడీ డోర్ డెలివరీ' ఉదంతం సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ కేసులో సాక్షులను బెదిరించారనే కొత్త అభియోగంతో ఆయన మళ్లీ పోలీసుల అదుపులోకి వెళ్లారు.
ఈ కేసులో అనంతబాబుకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో సర్పవరం ఇన్ఛార్జ్ సీఐ రవికుమార్‌పై వేటు పడింది. ఈ కేసు దర్యాప్తునకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని సీఐ రవికుమార్ నిందితుడికి చేరవేస్తున్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.
పోలీసుల వ్యూహాలు, దర్యాప్తులో బయటపడుతున్న సాక్ష్యాలు, తదుపరి చర్యల గురించి ఎమ్మెల్సీకి ముందస్తు సమాచారం అందుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
ఈ ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం, ఏలూరు రేంజ్ ఐజీ కఠిన నిర్ణయం తీసుకున్నారు. సీఐ రవికుమార్‌ను తక్షణమే విధుల నుంచి తప్పించి, వీఆర్‌ కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
Read More
Next Story