
ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్,నేడు కీలక నిర్ణయం
నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది.
ఆంధ్రప్రదేశ్ పాలనా యంత్రాంగంలో ఒక సరికొత్త విప్లవానికి నేడు పునాది పడబోతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరగనున్న కేబినెట్ భేటీ కేవలం సాధారణ సమావేశం మాత్రమే కాదు.. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే భేటీ మిగిలిపోనుందనే చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం కార్పొరేట్ సంస్థలకే పరిమితమైన వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) సంస్కృతిని, దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలోకి ప్రవేశపెట్టే సాహసోపేతమైన దిశగా అడుగులు పడుతున్నాయని, దీనికి సబంధించిన కీలక నిర్ణయం నేడు కేబినెట్ లో తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో పెరుగుతున్న ఇంధన ఖర్చులను కట్టడి చేయడమే కాకుండా, టెక్నాలజీ సాయంతో ప్రభుత్వ పనితీరులో వేగం పెంచాలని సీఎం భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం జరగనున్న మంత్రి వర్గ సమావేశంలో సుమారు రూ. 2 లక్షల కోట్ల భారీ పెట్టుబడుల ఆమోదంతో పాటు, ఉద్యోగుల పని విధానంలో తీసుకురాబోయే ఈ హైబ్రిడ్ మోడల్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు పొదుపు.. ఇటు ప్రగతి, రెండింటినీ సమన్వయం చేస్తూ చంద్రబాబు మార్క్ విజనరీ పాలన నేడు ఏ మలుపు తీసుకోబోతుందో అన్నది రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
పొదుపు బాటలో సర్కార్..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో ప్రధాని మోదీ పొదుపు మంత్రం పాటించాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన సీఎం చంద్రబాబు, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు ఇంధన పొదుపు కోసం హైబ్రిడ్ పని విధానాన్ని (కొన్ని రోజులు ఆఫీస్, కొన్ని రోజులు ఇంటి నుండి పని) పరిశీలిస్తున్నారు. తప్పనిసరిగా కార్యాలయానికి రావాల్సిన వారు మినహా, మిగిలిన విభాగాల ఉద్యోగులకు ఇంటి నుండి పనిచేసే వీలు కల్పించడంపై నేడు కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే సీఎం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తమ కాన్వాయ్‌లలోని వాహనాలను 50 శాతం తగ్గించుకుని పొదుపు దిశగా మొదటి అడుగు వేశారు.
రూ. 2,01,023 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ఈ కేబినెట్ భేటీ కేవలం పొదుపు చర్యలకే పరిమితం కాకుండా, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయనుంది. 17వ SIPB ఆమోదించిన మొత్తం 25 మెగా ప్రాజెక్టులకు కేబినెట్ ముద్ర వేయనుంది. సుమారు రూ. 1.08 లక్షల కోట్లతో విశాఖపట్నంలో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. సత్యసాయి జిల్లాలో రూ. 51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడపలో రూ. 12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులకు భూ కేటాయింపులు జరగనున్నాయి. తిరుపతిలో రూ. 2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించనుంది.
టెక్నాలజీతో పాలన..
పరిపాలనలో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాడకాన్ని పెంచాలని భావిస్తున్న ప్రభుత్వం, ప్రతి నెల మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆర్థిక వృద్ధిని (GSDP) పర్యవేక్షించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనుంది. కేవలం అభివృద్ధి పనులే కాకుండా, సామాన్య ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పొదుపు చేయాలనే అంశంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
Next Story

