సృష్టికి మూలం మహిళలే: సీఎం చంద్రబాబు
x

సృష్టికి మూలం మహిళలే: సీఎం చంద్రబాబు

చట్టసభల్లో 33% రిజర్వేషన్లు.. ఎమ్మెల్యేలు కావడానికి మహిళలు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు అన్నారు.


సృష్టికి మూలం మహిళలే.. కష్టానికి, ప్రేమకు, త్యాగానికి ప్రతిరూపం వారు. స్త్రీలను పూజించిన చోట సంపదకు లోటు ఉండదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయపూడిలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతపై ఆయన కీలక ప్రసంగం చేశారు.


మహిళా నేతృత్వానికి జై

మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని ముఖ్యమంత్రి కొనియాడారు. దేశ రాష్ట్రపతిగా గిరిజన మహిళ (ద్రౌపది ముర్ము), ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ అద్భుతంగా పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఏపీ హైకోర్టుకు కూడా మహిళా ప్రధాన న్యాయమూర్తి వస్తున్నారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయని, ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఎన్టీఆర్ సంస్కరణలే పునాది
ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని చంద్రబాబు స్మరించుకున్నారు. మహిళల కోసం ప్రత్యేక యూనివర్సిటీని కూడా ఆయనే స్థాపించారని గుర్తు చేశారు. తాము కూడా మహిళా పక్షపాతినని చెబుతూ, గతంలో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడు విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదని, నేడు మహిళలు ఐటీ రంగంలో మగవారి కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని, ఇది చాలా గర్వకారణమని చెప్పారు.

స్వయం ఏపీ ఆవిష్కరణ
మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. డ్వాక్రా సంఘాల ఆర్థికాభివృద్ధి కోసం రూ. 10,102 కోట్ల రుణాలకు సంబంధించిన మెగా చెక్కును సీఎం అందజేశారు. డ్వాక్రా ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు స్వయం ఏపీ (Swayam AP) బ్రాండ్ పేరు, లోగోను ఆవిష్కరించారు. సెర్ప్ సహా వివిధ విభాగాల ద్వారా 41 అవగాహన ఒప్పందాలను (MoUs) వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు.

కూటమి ప్రభుత్వ సంకల్పం
2019-24 మధ్య జరిగిన నష్టాన్ని పూడ్చి, డ్వాక్రా, మెప్మా సంఘాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ , తాము ముగ్గురం మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమిస్తామని స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత గ్యాస్, బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాల ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు గుమ్మిడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, సబిత, బీజేపీ నేత మాధవ్ , వేల సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
Read More
Next Story