
పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటామంటే అరకులో కాఫీ పంట ఉంటుందా?
ఐ అండ్ పీఆర్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు నిప్పులు. 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అధికారులకు క్లాస్.
ప్రభుత్వ యంత్రాంగం కేవలం అలంకారప్రాయంగా ఉంటే సరిపోదు.. అది అభివృద్ధికి దిక్సూచిగా మారాలి.. అంటూ ఏడో కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై నిప్పులు చెరిగారు. ముఖ్యంగా అభివృద్ధిని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న కొందరు అధికారుల తీరును ఎండగడుతూ.. పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటామంటే అసలు అరకులో కాఫీ పంట మనుగడ సాధ్యమేనా? అని సూటిగా ప్రశ్నించారు. ఐ అండ్ పీఆర్ వ్యవస్థ పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల శక్తిని ఎందుకు వాడుకోవడం లేదని నిలదీశారు. అధికారుల ఆలోచనా విధానం మారాలని, రూల్ బుక్కులకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి ఫలితాల సాధనే లక్ష్యంగా పనిచేయాలని సీఎం స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
రాష్ట్ర సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) కేవలం ఒక ఆభరణంలా మారిందని, అది ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలను ప్రజల ముంగిట నిలపడానికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఎందుకు భాగస్వాములను చేయడం లేదని ప్రశ్నించారు. నేటి కాలంలో స్థానిక ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రభావం ప్రజలపై బలంగా ఉంటుంది, వారి సాయంతో అభివృద్ధిని చాటి చెప్పాలి అని దిశానిర్దేశం చేశారు.
అభివృద్ధికి అడ్డుగోడలు వద్దు .. అధికారులకు హితబోధ
కొందరు అధికారులు కేవలం రూల్ బుక్ పట్టుకుని కూర్చుంటే అభివృద్ధి కుంటుపడుతుందని సీఎం హెచ్చరించారు. గిరిజన ప్రాంతాల్లోని వాస్తవ పరిస్థితులను ఉదాహరిస్తూ.. పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటామంటే అసలు అరకులో కాఫీ పంట ఉంటుందా? అని అధికారులను నిలదీశారు. అధికారులు తమ పాత పద్ధతులను మార్చుకుని అభివృద్ధికి ఊతమిచ్చేలా పనిచేయాలని హితవు పలికారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ఎందుకు సమర్థవంతంగా కౌంటర్ చేయడం లేదని ప్రశ్నిస్తూ, ప్రజా వ్యతిరేకతను తొలగించే విషయంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
కలెక్టర్ల మధ్య పోటీ .. రిజల్ట్ ఓరియెంటెడ్ పాలన
పరిపాలనలో వేగం, పారదర్శకత పెరగాలంటే జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని సీఎం సూచించారు. వినూత్నమైన ఆలోచనలు (Innovative Ideas) తీసుకువచ్చే అధికారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని, అవసరమైతే వారిని ఇతరులకు మెంటర్లుగా నియమిస్తామని ప్రకటించారు. ఫైళ్లను కేవలం పెండింగ్‌లో పెట్టడం కాకుండా, వాటిలోని సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. పనులు ఎంత వేగంగా సాగితే ఫలితాలు అంత త్వరగా ప్రజలకు అందుతాయని, కలెక్టర్లు అందరూ రిజల్ట్ ఓరియెంటేషన్ తో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.
Next Story

