ప్రియుడి కోసం 12 లక్షలిచ్చి భర్తను చంపించింది
x

ప్రియుడి కోసం 12 లక్షలిచ్చి భర్తను చంపించింది

ఛార్జింగ్ కేబుల్‌తో ప్రాణం తీసి, కాలువలో పడేశారు.


సాధారణంగా ఆపదలో ఉన్నప్పుడు భర్త అండను కోరుకుంటుంది భార్య. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.. కట్టుకున్న భర్తే తనకు అతిపెద్ద అడ్డుగోడగా భావించిందో కిరాతక పత్ని. తాళి కట్టిన వాడే కాలయముడయ్యాడు అన్న వార్తలు విన్నాం కానీ, ఇక్కడ కట్టుకున్న భార్యే కాలకూట విషమై భర్త ప్రాణాలను తోడేసింది. తన వివాహేతర సంబంధానికి అడ్డు నిలుస్తున్నాడన్న కక్షతో, కంటికి రెప్పలా కాపాడాల్సిన మనిషిని కిరాయి ముఠాతో కడతేర్చింది. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో వెలుగుచూసిన ఈ నెత్తుటి ఉదంతం, ఇప్పుడు జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.

అక్రమ సంబంధమే అంతానికి పునాది
ఏడడుగుల బంధం సాక్షిగా అగ్నిహోత్రుడి సాక్షిగా ఒక్కటైన ఆ సంసారంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. ఈ క్రూరమైన క్రైమ్ స్టోరీకి అసలు బీజం పడింది దుర్గామణి మనసు గతి తప్పినప్పుడే. స్థానిక సచివాలయంలో పనిచేస్తూ పరిచయమైన వెంకన్నబాబుతో ఆమె పెంచుకున్న అక్రమ సంబంధం, కట్టుకున్న భర్త రెడ్డి సులేమాన్ రాజు పాలిట శాపంగా మారింది. గుట్టుగా సాగుతున్న వీరి వ్యవహారం కాస్తా భర్తకు తెలియడంతో ఆ పచ్చని సంసారంలో నిత్యం గొడవలు, హెచ్చరికలు మొదలయ్యాయి. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపపడాల్సిన దుర్గామణి, దానికి విరుద్ధంగా తన సుఖానికి భర్తే అడ్డుగోడ అని భావించింది. ఆ అడ్డుగోడను శాశ్వతంగా కూల్చేయాలని, ప్రియుడి కౌగిలిలో స్వేచ్ఛగా ఉండాలని మౌనంగా ఒక భయంకరమైన మృత్యు వ్యూహాన్ని (డెత్ ప్లాన్) సిద్ధం చేసింది.
పక్కా ప్లాన్.. రూ. 12 లక్షల సుపారీ
తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడన్న ఆక్రోశంతో, దుర్గామణి ఏకంగా తన భర్త ప్రాణాలకే వెలకట్టింది. తన ప్రియుడు వెంకన్నబాబుతో కలిసి మృత్యు పాచికలు విసిరిన ఆమె, భర్తను హతమార్చేందుకు ఏకంగా రూ. 12 లక్షల భారీ సుపారీ ఇచ్చేందుకు సిద్ధపడింది. కేవలం మాటలతో ముగించకుండా, ఆ డబ్బును ఎరగా చూపి కిరాయి హంతకులను రంగంలోకి దించారు. వెంకన్నబాబు తన బంధువుల అండతో, అత్యంత రహస్యంగా, పకడ్బందీగా ఈ మరణ శాసనాన్ని రచించాడు. గత నెల 17వ తేదీన సులేమాన్ రాజు ఎక్కడున్నాడో, ఎప్పుడు ఒంటరిగా దొరుకుతాడో అని వేచి చూసిన ఈ ముఠా.. సమయం దొరగ్గానే ఆయన చుట్టూ మృత్యుపాశాన్ని విసిరి, సులేమాన్ రాజును ఏకాంతంగా దొరకబుచ్చుకుని తమ దారుణానికి తెరలేపారు.
ఛార్జింగ్ కేబుల్‌తో ప్రాణం తీసి.. కాలువలో పడేసి
నిందితులు సులేమాన్ రాజును హతమార్చడానికి ఎంచుకున్న మార్గం వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవక మానదు. చుట్టూ మనుషులున్నా, అరుపులు వినపడకుండా ఉండేందుకు అత్యంత కిరాతకమైన పద్ధతిని ఎంచుకున్నారు. చేతిలో ఉన్న సెల్‌ఫోన్ పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్‌నే ఉరితాడుగా మార్చి, సులేమాన్ రాజు గొంతు చుట్టూ బిగించి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశారు. ప్రాణం పోయిందని నిర్ధారించుకున్నాక, ఆనవాళ్లు దొరకకూడదనే కుతంత్రంతో మృతదేహాన్ని ఉప్పులూరు రైవస్ కాలువలో విసిరేశారు. తమ పాపం గంగలో కలిసిపోయిందని, ఇక తమ అక్రమ బంధానికి తిరుగులేదని ఆ కిరాతక జంట సంబరపడింది. కానీ, పాపం పండితే సాక్ష్యం దొరకకుండా పోదని వారు ఊహించలేకపోయారు.
పోలీసుల వేట..సెల్ సాక్ష్యంతో బయటపడ్డ అసలు రంగు
సులేమాన్ రాజు అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. ప్రాథమిక విచారణలోనే ఏదో అశుభం జరిగిందని పసిగట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అస్త్రంగా చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు, నిందితుల కాల్ డేటా దిమ్మతిరిగే నిజాలను వెల్లడించింది. బయటకు అమాయకంగా కనిపిస్తున్న భార్య దుర్గామణి ఫోన్ కాల్స్, ఆమె కదలికలే ఈ హత్యలో అసలు సూత్రధారి ఆమేనని తేల్చేశాయి. ఖాకిల దెబ్బకు నిందితుల నోళ్లు తెరుచుకోవడంతో ఈ నెత్తుటి నాటకం వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా, పక్కా సాక్ష్యాలను సైతం సేకరించారు. నిందితుల నుంచి హత్యకు వాడిన పవర్ బ్యాంక్ ఛార్జింగ్ కేబుల్, ఒక కారు, 5 సెల్‌ఫోన్లు, 5 ఖాళీ బీరు సీసాలు, సుపారీ సొమ్ములో మిగిలిన రూ. 75,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.
Read More
Next Story